కొంత పిండుకొని తయరుచేసుకొన్న మతం పేరే అక్బర్ ప్రవేశపెట్టిన ఈ కొత్త మతం. అక్బర్ స్థాపించిన ఈ కొత్త
మతం సర్వమత సమానత్వానికి, సెక్యులర్ సహజీవన సిద్దాంతానికి మకుటాయమానమని, దీనిని ప్రపంచానికి ప్రసాదించడమే అక్బర్ గారి గొప్పతనాలలోకెల్లా గొప్పదని కొంతమంది మేధావులు తీర్పునిచ్చారు. సరే, ఈ మతం నిజంగా గొప్పదో లేక తన ప్రాపకాన్ని పెంపొందిచుకోటానికి అక్బర్ తయారు చేసిన మేడిపండో దీన్లోకెళ్లి వివరాలు చూద్దాం.
‘రాజుల దర్శనమే దైవారాధనలో భాగం. వారిని దేవుడి నీడలు అని అనూచానంగా అంటారు. వారిని కళ్లజూడటమే సృష్టికర్తను జ్ఙప్తి చేసుకునే సాధనం: సర్వేశ్వరుడి రక్షణకు అది సూచన’ .
రాజు దేవుడి నీడ కనుక... హిందూస్థాన్ లోకెల్లా తానే గొప్ప రాజు కాబట్టి... తానే దేవుడి నీడ అని నమ్మేసి తాను ప్రవక్తగా కొత్త రూపం తీసుకోదలచి 1579 లో మతాధికారుల, సైన్యాధికారుల, రాజప్రముఖుల సమావేశాన్ని నిర్వహించాడు. అప్పుడు అక్బర్ చెప్పిన మాటలివి.
ఇంకా, '… ఒక్కరి ఆధిపత్యంలో వున్న సామ్రాజ్యంలో జనం వేర్వేరు మత వర్గాల కింద చీలి విభేదించుకోవడం బాగాలేదు. ఎన్ని మతాలు వున్నాయో అని వర్గాలున్నాయి. కాబట్టి మనం మతాలను ఒకటిగా చెయాలి. ఆ 'ఒకటి 'లోనే అన్నీ వుండాలి. అన్ని మతాల్లోంచి మంచినీ మాత్రమే తీసుకుందాం. దేవుడికి గౌరవాన్ని, ప్రజలకు శాంతిని, సామ్రాజ్యానికి సుస్థిరతను సమకూర్చే రీతిలోనే ఈ పని జరగాలి…’
అక్బర్ అంతటి చక్రవర్తి ఇలా పల్లవిని అందుకుంటే మిగిలిన చరణాల్ని పూర్తి చేయకుండా వుంటారా ఆయన భజపరులు? సభను ముగిస్తూ అక్బర్, అబుల్ ఫజల్ తండ్రి షేక్ ముబారక్ ను పిలిచి 'మొఘల్ సామ్రాజ్య మంతటా అందరూ ఆచరించదగిన మతధర్మాన్ని దర్బారు నుంచి త్వరలో ప్రకటిస్తామని రాజ్యమంతటా చాటించమని పురమాయించాడు.
ఇక తరువాత జరగవలసిన ముఖ్య పనులన్నీ చకచకా జరిగిపోయాయి. హిందూ మతాధికారుల్ని సంప్రదించిన దాఖాలాలేవీ కనిపించలేదు. అప్పట్లో క్రైస్తవం ఉనికే తక్కువ. ఇక ఇస్లాం విషయంలో మతపెద్దల ఆమోదం వుంటే ఇలాంటి విషయంలో అడుగువేయటం సుళువు కాబట్టి, 1579 సెప్టెంబర్ లో మొగల్ సామ్రాజ్యానికి ముఫ్తీ అయిన కాజియుల్ కుజాత్ చేత, మరో ఐదుగురు ముస్లిం ఉలేమాల చేత సంతకాలు చేయించి వారిచేత తిరుగులేని వొక డిక్రీ ఇప్పించాడు. అంతే! ఇక కొత్త మతం ఆవిర్భవించింది. దాని సృష్టికర్తా, మార్గదర్శీ అన్నీ అక్బరే. ఇదీ ఈ కొత్త మతానికి పూర్వరంగం. ఇక దీన్లోని వింతలూ విశేషాలూ చూద్దాం పదండి.
అక్బర్ మతం పుచ్చుకొనదలచినవారు సూర్యుడు ఉజ్వలంగా ప్రకాశించే ఆదివారం నాడు తలపాగా తీసి అక్బర్ కాళ్లమీద తలపెట్టి వేడుకోవాలట. దేవుడి ప్రతినిధి అయిన ప్రభువుల వారు అతడిని లేవదీసి నెత్తిన తలపాగాపెట్టి, చెయ్యెత్తి దీవించి 'అల్లా హు అక్బర్ ' అని రాసిన బిళ్లను బహూకరించడం ద్వారా తన మతంలో చేర్చుకుంటాడు. భక్తుడు అ బిళ్లను ఎప్పుడూ తలపాగాలో దాచుకుని తిరగాలట. నూతన మతస్థులు ఒకరినొకరు ఎదురుపడితే 'అల్లా హు అక్బర్ ' అని పలకరించుకోవాలట.
ఆ మాటకు అర్థం 'అల్లా గొప్పవాడు ' అని చెప్పుకుందామా లేక అక్బరే అల్లా ' అని చెప్పుకుందామా? మీకే వొదిలేస్తున్నాను.
అక్బర్ ప్రవక్తగారి మతంలో చేరేవారు చక్రవర్తిగారికి అర్పించుకోవలసినవి నాలుగు: ఆస్తి,జీవితం,గౌరవం,మతం. వీటిలో ఒకదానిని మాత్రం త్యాగం చేయగలిగిన వాడికి ఒక పట్టా: నాలుగూ అర్పించుకోగలిగినవాడికి నాలుగు డిగ్రీలు ప్రసాదించబడేవి. గొడ్రాళ్లకు బిడ్డలు పుడతారని తన కాళ్లు కడిగిన జలాన్ని తాగితే రోగాలు నయమవుతాయని చక్రవర్తి గారు ప్రచారం చేయించుకుని అభాగ్యులందరికీ తన పాదోదకాన్నీ తాగించేవారు.
పుట్టే బిడ్డకు మహమ్మద్ పేరు పెట్టడానికి వీలులేదు. ఈ వరకే పెట్టి ఉంటే తప్పక మార్చెయ్యాలి. కొత్తగా మసీదులు కట్టరాదు. పాతవాటికి మరమ్మతులు, పునరుద్దరణలు చెయ్యరాదు. అనంతర కాలంలో మసీదులను అడగొట్టి నేలమట్టం చేశారు. గడ్డాలు గొరిగితీరాలి. ప్రార్థనలనూ, రంజాన్ ఉపవాసాలను, మక్కాకు యత్రలనూ చెయ్యడం నిషిద్దం. అరబిక్ భాషనూ, మహమ్మదీయ న్యాయాన్ని, ఖురాన్నూ అధ్యయనం చేయడానికి వీలులేదు. చనిపోయిన వారిని తూర్పువైపు తల, పశ్చిమాన కాళ్లు ఉండేలా పూడ్చిపెట్టాలి. చక్రవర్తి కూడా ఆ భంగిమలోనే నిద్రించసాగాడు.
దీనివల్ల ఉదయించే సూర్యుడిని గౌరవించటమేగాక, ఇండియాకు పశ్చిమాన గల మక్కావైపు మోకరిల్లే మహమ్మదీయులకు అవమానంగా కూడా దీన్ని ఉద్దేశించారు.
అక్బర్ తన కొత్త మతపైత్యం పోనుపోనూ తనని ముస్లిం వ్యతిరేకిగా ముద్ర వేసింది. కొంతమంది ముస్లిం మత పెద్దలు మాట విననందున వేధించి ఆఖరికి పెద్ద సంఖ్యలో షేక్ లను, ఫకీర్లను దేశం నుంచి బహిష్కరించాడు. ఐదారేళ్ల స్వల్ప వ్యవధిలో ఆయన హృదయంలో మహమ్మదీయ భావన అనేది ఆనవాలు లేకుండా పోయింది. అక్బర్ దర్భారులో 'దీన్ ఇలాహి ' మత తీర్థం పుచ్చుకున్న రాజ ప్రముఖులు 18 మంది అని Ain-i-Akbari లొ వుంది. వీరిలో రాజా బీర్బల్ ఒక్కడే హిందువు. మిగిలినవారు ముసల్మాన్లు.
ఆస్థాన ప్రముఖుల్లోనే గాక సామాన్య జనంలోనూ ఎంతగా ఊదరబెట్టినా కొత్త మతం లోకి మారినవారి సంఖ్య చాలా స్వల్పం.
Plz. check here for some more info.
అక్బర్ పెట్టిన మతం అక్బర్ తోటేపోయింది.
Comments
1 comments to "వెజిటెబుల్ మిక్స్ - 'దీన్-ఇ-ఇలాహి ' (అక్బర్ కొత్త మతం)"
February 19, 2008 at 2:14 AM
శ్రీధర్ గారూ జుదా అక్బర్ సినిమా చూసారా?అందులో చూపిన,మరుగుపరిచిన తప్పులను వివరించగలరు.
Post a Comment