Friday, September 25, 2015

ది గ్రేట్ ఎస్కేప్

4 comments



రెండవ ప్రపంచయుద్ద కాలంలో, 1941 డిసెంబర్ లో బ్రిటిష్ సైన్యానికి చెందిన భారతీయ బెటాలియన్ ఒకటి ఉత్తర మలయా అడవుల్లో జపనీయులకి లొంగిపోయింది. ఆ బెటాలియన్ కి నేతలు కెప్టెన్ మోహన్ సింగ్, కల్నల్ అక్రం ఖాన్, కల్నల్ ఫిజ్ పాట్రిక్. భారతీయ విప్లవ కారుడు ప్రీతం సింగ్, జపాన్ సైనికాధికారి పుజివారాల ప్రేరణ ఫలితంగా, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడే నిమిత్తం, లొంగిపోయిన భారతీయ సైనికులతో, కెప్టెన్ మోహన్ సింగ్ ఒక స్వచ్చంద సైన్యాన్ని తయారు చేసేందుకు అంగీకరించాడు.
అలా ఇండియన్ నేషనల్ ఆర్మీ పుట్టింది
.

పాన్ లో తల దాచుకుంటున్న సుప్రసిద్ద భారతీయ విప్లవ కారుడు రాస్ బిహారీ బోస్ అధ్యక్షతన, అప్పటికే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ పనిచేస్తోంది. మోహన్ సింగ్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ కు అనుబంధంగా పనిచేయాలని నిర్ణయించారు. వృద్ధాప్యం వలన తానుశక్తివంతమైన నాయకత్వం అందించలేకపోతున్నానని భావించిన రాస్ బిహారీ, ఉద్యమానికి ఉత్తేజాన్నించి ముందుకు నడిపించగలిగిన నాయకుడి గురించి అన్వేషించారు. అప్పటికే జర్మనీ గడ్డమీద నుంచి భారత విముక్తి కోసం స్వతంత్ర సైన్యాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తున్న సుభాష్ బోసు పైన రాస్ బిహారీ దృష్టి పడింది.భారత్ లో కాంగ్రెస్ అగ్రనాయకుడిగా సుభాష్ చంద్ర బోస్ పేరును ఇండిపెండెన్స్ లీగ్ సభ్యులు అంత క్రితమే విని ఉన్నారు. ఆయన చొరవతో, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఆహ్వానించడం వలన సుభాష్ చంద్ర బోస్ ఆగ్నేయాసియా వచ్చారు.

జూలై 4న సింగపూర్ లో జరిగిన కార్యక్రమంలో సుభాష్ 'ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్' నాయకత్వాన్ని స్వీకరించాడు. సరిగ్గా మూడునెలల్లో నేతాజీ మరొక పెద్ద అడుగు వేశాడు. సింగపూర్ లో ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించాడు.
జరగబోయే మహత్తర పరిణామాలకు ఇది నాందీ ప్రస్తావన
.

ఈ ఘటనా క్రమం అంతా బోస్ 1941 లో బ్రిటిష్ నిర్బంధం నుంచి తప్పించుకున్నపుడే ప్రారంభమైంది.
విదేశీగడ్డమీద నుంచి వేలాది భారతీయులు మాతృదేశ విముక్తి కోసం కదం తొక్కుతూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నిసాహసంతో కత్తి దూసి ఎదుర్కొన్న మహా సంగ్రామానికి నాంది అదే
. అందుకే ఈ కథని కలకత్తానుంచి బెర్లిన్ కు వరకూ సాగిన గ్రేట్ ఎస్కేప్ తో ప్రారంభిద్దాం. గ్రేట్ ఎస్కేప్ ఎందుకు?
*

సుభాష్ చంద్ర బోస్ 1897 లో ఒరిస్సాలోని కటక్ లో జానకీనాధ్ బోస్ దంపతులకి తొమ్మిదవ సంతానంగా జన్మిచాడు. ఇంగ్లాండులో చదివి ఇక్కడి స్వాతంత్ర్య పోరాటంలో దుమికాడు సుభాష్.
గాంధీజీ నేతౄత్వంలోని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. కాంగ్రెస్ లో మిలిటెంట్ యువనేతగా పేరు తెచ్చుకున్నాడు. అతివాద భావాలను ప్రబోధించాడు. కాంగ్రెస్ అధ్యక్షస్థానికి సైతం ఎన్నికయ్యాడు. రెండు దశాబ్దాలకాలంలోనే 11 సార్లు అరెస్టయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ద కాలంలో హాల్వెల్ శిలావిగ్రహాన్ని తొలగించాలని ఉద్యమించాడు సుభాష్. ప్రభుత్వం అతడిని కారాగారంలో నిర్బంధించింది. సుభాష్ ఆరొగ్యం దెబ్బ తినడం, జైలులో అతడు ఆమరణ నిరసన దీక్ష చేపట్టడం, సుభాష్ విడుదలకు మద్దతుగా ప్రజా ఉద్యమం పెల్లుబుకుతుందనే భయం కారణంగా ప్రభుత్వం అతడినిజౌలునుంచి విడుదలచేసి, గృహనిర్బంధంలో ఉంచింది.

మారుతున్న ప్రపంచ పరిస్థితుల రీత్యా నిర్బందంలో చేతులు ముడుచుకుని కూర్చోవడం సుభాష్ కు సాధ్యం కాలేదు. శత్రువు శత్రువు మనకు మిత్రుడని సుభాష్ అభిప్రాయం. బిటన్ యుద్దంలో ఉన్నపుడు, మన దేశ స్వాతంత్ర్య సాధనకు బ్రిటన్ శత్రుదేశాల మద్దతు తీసుకుంటే తప్పేమిటని సుభాష్ ఉద్దేశం. ఆనాటి జాతీయోద్యమ నాయకత్వం ఈ విశ్లేషణని అంగీకరించలేదు. అందుకే తన ఆలోచనని తానే అమలు చేయాలని సుభాష్ నిశ్చయించుకున్నాడు. బ్రిటన్ కు వ్యతిరేకంగా జర్మనీ, ఇటలీ, జపాన్ లు శక్తివంతమైన అగ్రరాజ్యాల కూటమిగా ఏర్పడి - అందుకే యుద్దానికి దిగడం మన స్వాతంత్ర్య సాదనకి చారిత్రక సువర్ణావకాశంగా సుభాష్ భావించాడు. ఆయా దేశాల మద్దతుని అందుకుని భారత జాతీయ విముక్తికి జాతీయ సైన్యాన్ని ఏర్పరచాలని ఆ సైన్యంతో బ్రిటిష్ వారిపైన యుద్దం ప్రకటించాలని, డిల్లీని పట్టుకోవాలని, ఆంగ్లేయుల్ని తరిమేసి దేశ స్వాతంత్ర్యాన్ని సాధించాలని బోస్ ఆశయం.

ఆలోచనల్ని అమలులో పెట్టేందుకే దేశాన్ని విడిచి వెళ్లాలని సుభాష్ నిర్ణయించుకున్నాడు.
కలకత్తా నుంచి బెర్లిన్ కు - ది గ్రేట్ ఎస్కేప్
ఎలా జరిగిందో వివరంగా ముందు చూద్దాం.


[To be Contd]...
 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com