ముందుమాటలో 'ఎందుకు?' అనే దాంట్లో నేను రాయాల్సినదంతా రాశాననుకున్నాను.
కాని ఇంకొంత మిగిలిపోయిందనిపించి రాస్తున్నాను.
మానవజాతి పరిణామక్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే, అందులో 59 ని. ఆదిమ దశ నుంచి పైకి పెరగడానికే సరిపడుతుంది. నాగరిక మానవ జీవితం యావత్తూ ఒక్క నిమిషంలో గడిచిపోతుంది. యంత్రయుగం నుంచి ఈనాటి వరకు వచ్చిన అభివృద్ది ఒకటిన్నర సెకెండ్లకన్న వుండదని హై మైన్ లేవీ తను 'సోషల్ థింకింగ్' అనే పుస్తకంలో రాశాడు. ఎంతో విస్తృత పరిథి కలిగి వున్న చరిత్ర గురించి మాట్లాడాలన్నా , వ్యాఖ్యానించాలన్నా దాని లోతుపాతులు ఎరిగి ఋజువులు దగ్గిర పెట్టుకుని చర్చకు పెట్టాలంటే యెంతటివాడికైనా ఒళ్లు దగ్గిర పెట్టుకొని మాట్లాడాల్సిందే! ఈ బ్లాగు ప్రారంభించే ముందు నేను కొద్దిగా జంకిన మాట నిజమే! ఎందుకంటే చరిత్రాంశం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. యే వొక్కరో రాయటానికి చరిత్ర యే కవితో , నవలో కాదు. యెందరో మహానుభావులు/ చరిత్రపరిశోధకులూ తమ జీవితాలని ఈ చరిత్రాధ్యాయనానికి ధారపోసి మనకు శతాబ్దాలుగా అందిస్తూ వచ్చారు. వేల సంవత్సరాల ముందు ఏం జరిగిందో మనకు కనీస పరిజ్ఙానమన్నా వుందంటే అది మన పూర్వులూ, మహానుభావులూ, చరిత్ర పరిశోధకులూ, మేథావులూ , పండితులూ ఇంకా ఎందరో తమ తమ జీవితాలని త్యాగం చేసి మనకు పెట్టిన భిక్ష. రాహుల్ సాంకృత్యాయన్ అన్నట్టు 'చరిత్ర గురించిన జ్ఙానం ఎపుడూ అస్థిపంజరం లాంటిది. దానికి చరిత్ర పరిశోధకులు కల్పన అనే మాంసాన్ని అద్దుతారు.' కనక చరిత్రకి వ్యాఖ్యానాలూ యే వొక్కరీ సొత్తూ కాదు.మనకు అందుబాటులో వున్నవి , మన విచక్షణకు అందేవి, యుక్తంగా అనిపించేవి తీసుకుని విశ్లేషించుకుని - మంచి చెడులు, సత్యాసత్యాలూ బేరీజు వేసుకోవడం మన విజ్ఙతపై, వివేకంపై ఆధారపడుతుంది.
నేను చేసే పని కూడా అదే! మన ముందు ఏమేం వున్నాయో వాటిని ఒక క్రమపద్దతిలో తిరిగి మీకోసం అమరుస్తున్నాను. స్మైల్ గారు ఓ మంచి మాట చెప్పారు. చరిత్రను చెప్పే దృక్కోణానికి పక్షపాతం వుండకూడదని. చాలామంది చరిత్రకారులు చేసిందదే (దీనిలో భారత ప్రభుత్వ (భారత నాయకులందామా (నెహౄ, ఆజాద్ etc.)?) పాత్ర ఎంతైనా వుంది. ఉదా. స్వాతంత్ర్య సంగ్రామ సమగ్ర చరిత్రను తయారు చేయాల్సిన అవసరాన్ని స్వాతంత్ర్యం సిద్దించినది మొదలు విజ్ఙలోకం నొక్కి చెప్పింది. ఈ బృహత్ కార్యం నేరవేర్చమని ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ భారత ప్రభుత్వానికి సిఫారసూ చేసింది. పర్యవసానంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర సంకలనానికి 9 మందితో సంపాదక మండలిని 1952 Dec 30 న ఏర్పాటు చేసింది. డా. ఆర్ .సి. మజుందార్ కు డైరెక్టర్ బాధ్యత అప్పగించి మూడేళ్లలో పని ముగించాలనీ, రెండేళ్లలో సమాచారాన్ని సేకరించి చిత్తు ప్రతి తయారు చేసి మూడో ఏటికల్లా తుది ముసాయిదాను అచ్చుకు సిద్దం చేయాలనీ ఆదేశించింది. కాని నిజానికి ఏం జరిగిందో చూడండి. 1954 సం. తొలి సంపుటం చిత్తుప్రతి తయారయ్యింది. చిత్తు ప్రతిలోని విషయాలు అధికార వర్గాన్ని, కొందరు నాయకులను ఇబ్బంది పెడతాయనీ అవి బయటికొస్తే ప్రమాదమనీ స్వామిభక్తి పరాయణులైన కొంతమంది సర్కారీ మేధావులు హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు అప్రమత్తమయ్యారు. తెర వెనక ఏం జరిగిందో తెలీదు. 1955 Dec 31 ఎడిటర్ల బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత డా. తారాచంద్ అనే విస్వాసపాత్రుడికి స్వాతంత్ర్యపోరాట అధికారిక చరిత్రను గ్రంధస్థం చేసే బాధ్యతను అప్పగించింది. ‘History of freedom movement in India ' , అన్న గ్రంధరాజమే సాధికారిక ప్రామాణిక చరిత్ర క్రింద నేటికీ చెలామణి అవుతున్నది.
నిర్జీవమైన చరిత్రని, చరిత్రని అర్థం చేసుకొని ప్రయోజనమేమీలేదని, చరిత్రని ఎందుకు అవలోకించుకోవాలని ప్రశ్నించేవాళ్లే యెక్కువ వుంటారనుకున్నాను. (దీని గురించే యెక్కువగా రాసింది 'ఎందుకు?!' లో ). కాని పాఠకులు వెలిబుచ్చిన అభిప్రాయాలను చదివిన తరువాత మళ్లీ నాకు నూతనోత్సాహం వచ్చింది. చదివినందుకు, చదువుతున్నందుకు మీకు ధన్యవాదాలు. నా తెలుగుని క్షమించండి. నేననుకున్నట్టుగా సరైన పదాల్లో కాని వ్యాకరణంలో కాని పెట్టలేదన్న నా అశక్తత మీకు కనిపిస్తే దయ చేసి సరిదిద్దుకుని చదవండి. ఫోటోలు యింకా చాలా వుండిపోయాయి పెట్టాల్సినవి. ( స్కాన్ చెయ్యాలి కాబట్టి) వృత్తిరీత్యా కొద్దిగా బిజీగా వుండటం వల్ల యీ మధ్య యేమీ పోస్ట్ చేయలేదు. ఇప్పుడు అంతా సిద్దం చేశాను.
చదవండి.
చర్చిద్దాం.
అందరి అభిప్రాయాలూ విలువైనవే.
చరిత్ర మనందరిదీ.
చరిత్ర అంటేనే మనం!
Comments
2 comments to "ఒక చిన్న మాట!"
October 6, 2007 at 9:29 PM
ఈ బ్లాగు నాకు నచ్చిన బ్లాగులలో ఓకటి
మీరు చెప్పె విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి
October 7, 2007 at 11:09 AM
మీ రాబొయే బ్లొగు చదవాలని ఉత్సుకతగా ఉంది
Post a Comment