జర్మనీ తన ఉద్యమానికి ఎటువంటి సహకారం ఇవ్వాలన్న విషయంలో నేతాజీకి స్పష్టమైన అవగాహన వుంది. భారత స్వాతంత్ర్యానికీ, సార్వభౌమత్వానికీ గల హక్కును జర్మనీ గుర్తించాలి, ఆజాద్ హింద్ ఉద్యమాన్ని నాజీలు ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల విప్లవోద్యమంగా గౌరవించాలి, ఆజాద్ హింద్ ప్రసారాల పట్ల, ప్రచురణల పట్ల ఎటువంటి నిర్బంధాలు, నిషేధాలు, అదుపు ఉండరాదు, ఆజాద్ హింద్ ఫౌజ్ లో సైనికులను చేర్చుకునే అధికారం, నిర్వహణ సుభాష్ దే, ఆజాద్ హింద్ దళాల విధ్యేయత తమ మాతృదేశానికే ఉంటుంది కానీ మరెవరికీ కాదు, ఆజాద్ హింద్ దళాలు బ్రిటన్ పైనే కానీ జర్మనీకి శతృవులైన మరే ఇతర దేశం పైనా తమ తుపాకీని ఎక్కుపెట్టవు - క్లుప్తంగా చెప్పాలంటే బోస్ షరతుల సారాంశం ఇదే.
బోస్ తీసుకున్న స్వతంత్ర వైఖరి నాజీలకు మిగుడు పడేది కాదు. ప్రపంచాన్నే దురాక్రమించి శాసించాలని తలపోసే నాజీలకు,సహజంగానే ఒకదేశపు స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వాన్నీ అంగీకరించడం అయ్యేపని కాదు.
మిలియన్లమంది యూదులని, ఆక్రమిత దేశాలకు చెందిన ప్రజల్ని అమానుషంగా కాన్సట్రేషన్ క్యాంపుల్లో హతమార్చిన నాజీలు , ప్రపంచం నిర్ఘాంతపోయే భయావహ , కౄరకృత్యాలకు పాల్పడిన నాజీలు, మానవజాతి చరిత్రలో సరికొత్త చీకటి అధ్యాయాన్ని రచించిన నాజీలు - భారత స్వాతంత్ర్యపోరాటానికి హృదయపూర్వకమైన సానుభూతి ఎలా చూపగలరు?ఫాసిజం పైన బోస్ అనుసరించిన వ్యూహం సమగ్రమైనది కాదు. ఈ విషయంలో బోసుకంటే, గాంధీజీ, నెహౄ వంటి నేతలు తీసుకున్న వైఖరి వాస్తవికంగా సమతుల్యంగా ఉందని చెప్పాలి.
నాజీల, ఫాసిస్టుల మద్దతుతో దేశ స్వాతంత్ర్యానికి పోరాటాన్ని నడపాలనే వ్యూహం రచించడం ద్వారా సుభాష్ బోస్ తప్పటడుగు వేశాడన్నది నిజం. అయితే, పులిమీద స్వారీ వంటి తన వ్యూహంతో ఈ అసమాన దేశ భక్తుడు కనపరిచిన చాకచక్యం, సాహసం మాత్రం అనితరసాధ్యం. ఒంటరిగా తమ దేశానికి కార్యార్థిగా వచ్చిన నేతాజీ, తమకి విధించిన షరతుల్ని చూసి నాజీలు నిర్ఘాంతపోయారు. తాము ఎటువంటి మనిషితో వ్యవహరిస్తున్నదీ వారికి తెలిసి వచ్చింది. మరీ అంత ఆత్రం పనికి రాదని, జర్మనీ వచ్చిన తర్వాత జర్మనీ ప్రభుత్వ ఆమోదం లేనిదే ఏ కార్యక్రమాలు చేపట్టరాదని నాజీ అగ్రనేతలన్నారు
'మీ షరతుల ప్రకారం పనిచేయక పోతే నన్నుమీరు జైల్లో పెట్టగలమని బెదిరిస్తున్నారా?' అని సూటిగా అడిగేశాడు. నాజీ అధికారులు వెనక్కి తగ్గి అలా చేయమని బదులిచ్చారు.
అయితే తాము తలచుకున్నపుడు మాత్రం బోస్ కార్యకలాపాలను నిర్వీర్యపరచగలమని, అటువంటి సందర్భంలో బోస్ నిష్క్రియాశీలునిగా ఉండాల్సి వస్తుందని-మరొక నాజీ అధికారి దర్పంగా వ్యాఖ్యానించాడు. నాజీల దురాలోచనలు బోసుకి తెలియనివి కావు. ఒక బందీగా, ఒక నిష్క్రియాపరుడిగా ఉండాల్సిన పరిస్థితి వస్తే తాను జర్మనీలో ఉండనని, అవసరమైతే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొని తిరిగి భారత్ కే వెళ్లి తన ఉద్యమాన్ని కొనసాగిస్తానని బోస్ స్పష్టం చేశాడు. బోస్ జర్మనీ వదిలి వెళ్లదలుచుకుంటే, అందుకు తమ అనుమతి అవసరమని మరొక అధికారి వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే, కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరిగా ఆ అహంకారికి బోసునించి తలతిరిగి పోయే సమాధానం వచ్చింది. '
...నేను మీ గెస్టపో (జర్మనీ గూడచారి విభాగం ) గురించి చాలా విన్నాను.కానీ, బ్రిటిష్ గూఢచారులు కూడా సమర్థతలోనూ, కౄరత్వంలోనూ తీసిపోరు. నేను వారి కళ్లు గప్పి తప్పించుకోగలిగానంటే, ఇక్కడ కూడా ఆ పని చేయగలను '.
*
పైకెన్ని మాటలు చెప్పినా నాజీలు బోసును అడుగడుగునా అనుమానించారు. తొలుత ఆయన బసచేసిన హోటళ్లలో కాపు కాశారు. ఆయన కదలికలపై, సంభాషణలపై, ఉత్తరాలపై నిఘా వేశారు. చివరికి ఆయన వ్యక్తిగత సిబ్బందిలో సైతం గూఢచారుల్ని జొప్పించారు. ఆయన డైరీలని, పత్రాలని, ఆయన సూట్ కేసులని రహస్యంగా తనిఖీ చేశారు. వాగ్థానానికి భిన్నంగా 'ఆజాద్ హింద్ ' ప్రసారాలపై రహస్యంగా సెన్సారింగ్, నిఘా అమలు జరిపారు. నాజీ రాజకీయాల్లో ఎదురయ్యే ఆటుపోట్లను, సం క్షుభిత వాతావరణపు సెగలను తట్టుకుని బోస్ పనిచెయ్యాల్సి వచ్చేది. బోస్ కు అనుకూలంగా వ్యవహరించిన ఆడం వాన్ ట్రాట్ ఒక దశలో హిట్లర్ కు వ్యతిరేకంగా కుట్ర చేశాడనే అభియోగంతో కాల్చివేతకి గురయ్యాడంటే, భారత వీర పుత్రుడు బోస్ నాజీల రాజ్యంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచెయ్యాల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నేతాజీని లోలోపల తమ బోనులోని చిరుతపులి మాదిరిగానే నాజీలు పరిగణించారు. బ్రిటిష్ వ్యతిరేక ప్రచారానికి పనికి వస్తాడు లెమ్మని నాజీల అంచనా. బోస్ ను బంధించాలని బ్రిటన్ ఉవ్విళ్లూరుతూంటుంది కాబట్టి, కష్టకాలంలో బ్రిటన్ తో బేరసారాలకు బోసును తురుపుముక్కగా ఒడ్డవచ్చని నాజీల దూరాలోచన.
భారతదేశపు విస్తారమైన వనరులు,జనశక్తి బ్రిటన్ కు అపరిమితమైన పోరాట సామర్థ్యాన్ని సమకూర్చుతున్నాయని జర్మన్లకు తెలుసు. భారత్ ను బ్రిటన్ అదుపు నుంచి తప్పించగలిగితే, బ్రిటన్ ను జయించడం సుళువవుతుందని జర్మన్ల వ్యూహం. ఆ మేరకు వారికి సుభాష్ ఉద్యమం పట్ల అనుకూలత ఉంది. అంతే కాక, నాజీలకు భారత్ పైన దురాక్రమణ ఆశలు సైతం ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. భారత్ స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉంటామని స్పష్టమైన హామీ ఇవ్వాలని హిట్లర్ ను సుభాష్ ఎంత పట్టుబట్టినా ప్రయోజనం లేకపోయింది. వారిద్దరి భేటీ సమయంలో భారత స్వాతంత్ర్యానికి జర్మనీ మద్దతును తెలిపే ప్రకటన ఆవశ్యకతను గురించి బోస్ ప్రస్తావించినపుడు హిట్లర్ గంభీరంగా ఉండిపోయాడు. ఆ సమావేశపు గది కొసన ఉన్న గోడ వద్దకు బోస్ ను తీసుకెళ్లాడు. ఆ గోడకి ఒక భారీ ప్రపంచపటం అమర్చి ఉంది. ప్రపంచ పటం పైన హిట్లర్ వేళ్లు కదులుతున్నాయి. ఆనాటికి జర్మనీ ఆక్రమణలో ఉన్న రష్యన్ ప్రాంతాల సరిహద్దును, భారత్ సరిహద్దులను చూపాడు హిట్లర్. ఆ రెంటికీ మధ్య అధివమించాల్సిన దూరం ఎంత ఉందో చూపాడు. హిట్లర్ చెప్పదలిచిందేమిటో బోస్ కి అవగతమైంది.
భారత్ కు ఎంతో దూరంగా ఉన్న జర్మన్లు, భారత్ స్వాతంత్ర్యానికి మద్దతునిస్తూ పకటన ఇవ్వడం వలన ఒరిగిపడే ప్రయోజనం ఏముంటుందన్నది హిట్లర్ ప్రశ్న. హిట్లర్ అక్కడితో ఆగలేదు.వీరిద్దరి భేటీ గురించి ఆడం వాన్ టృఆట్ తర్వాత వెల్లడించిన విశేషం మరొకటి ఉంది.
భారత దేశానికి అత్యంత అననుకూలమైన పరిస్థితే కనిపిస్తున్న తరుణంలో, ఆచరణాత్మకంగా బోసు చేయగలిగేది మాత్రం ఏముంటుందని హిట్లర్ ప్రశ్నించాడు. బోసుకి ఈ వెటకారంతో అరికాలి మంట నెత్తికెక్కింది.
'హిజ్ ఎక్స్ లెన్సీకి చెప్పండి. నేను నా జీవితమంతా రాజకీయాల్లోనే ఉన్నాను. నాకు ఈ విషయంలో మరొకరి సలహా అవసరం లేదు...' అని బోస్ ఘాటుగా జవాబిచ్చాడు. ఇక హిట్లర్ వలన తన ఉద్యమానికి జరిగే మేలు పెద్దగా ఏమీ లేదని బోస్ కి అర్థమైంది. భారత్ కు తూర్పునించి విజృంభిస్తున్న జపాన్ మద్దతు వలన ఉద్యమానికి మేలు కలగవచ్చు. అదీ కాక, ఆగ్నేయాసియా దేశాల్లో భారత స్వాతంత్ర్యం కోసం కృషి చేస్తున్న విప్లవకారుల నుంచి బోస్ కి అనుకూలమైన సందేశాలు అందుతున్నాయి. దానితో బోస్ ఆగ్నేయాసియాకు వెళ్లాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు.
బోస్ నిష్క్రమణానంతరం యూరపు లో ఒక శక్తివంతమైన నాయకత్వ లేమి వల్ల ఆజాద్ హింద్ దళాలు అంతగా పురోగతి సాధించలేకపోయాయి.
బ్రిటన్ తో తప్ప మరెవరితో పోరాడవద్దని, సోవియట్ కు వ్యతిరేకంగా యుద్దంలో పాల్గొని వద్దని బోస్ తన నిష్క్రమణకు ముందు ఆజాద్ హింద్ దళాలకు ఆజ్ఙ ఇచ్చాడు. ఈ ఆజ్ఙని పాటించడం ఆజాద్ హింద్ బలగానికి అగ్ని పరీక్షగా మారింది. యుద్దంలో గడ్డు పరిస్థితులు ఎదురుకావడంతో ఆజాద్ హింద్ దళాలను కూడా యుద్దంలో పాల్గొనమని నాజీలు వత్తిడి తెచ్చారు. కాదన్న ఆజాద్ హింద్ వీర కమాండర్లను కోర్టు మార్షల్ చేసి నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. యుద్దంలో ఆజాద్ హింద్ ప్రధాన దళాలు చాలా వరకూ నిర్మూలించబడ్డాయి. బందీలుగా చిక్కిన కొందరిపైన డిల్లీలో విచారణ జరిగింది.
Comments
10 comments to "Netaji's meet with Hitler - II"
December 21, 2008 at 10:03 PM
i want to know about godsa and gandhiji can you please explain whats the reason that godsa kill gandhiji ji please
December 21, 2008 at 11:41 PM
కొనసాగించండి.అరుదయిన చిత్రాలను అందిస్తున్నందుకు థాంక్స్.
December 22, 2008 at 5:58 AM
My next post is about Nadhuram Godse. Actually Gandhiji was killed in the second attempt of Godse. Previously an attempt for assasination was planned and executed unsuccessfully. I shall give u in detail.
December 22, 2008 at 7:46 AM
We heard a lot about hitler and his monopoly. Could you please take some time to come out with realities/history posts bout Hitler
December 22, 2008 at 12:56 PM
Please Tell me, why the Hitler was hated the Jews, any reasons fot that?
Even now the Arabs are hating the Jews,what for?
Why the jews ate setteled in Middle East(In Deserts,where the water also available) rather than rest of world ?
Please give details
December 22, 2008 at 5:44 PM
great writing,
December 23, 2008 at 10:31 AM
Great going waiting for the Godse article :)
December 23, 2008 at 6:11 PM
ధన్యవాదాలు.. మరిన్ని post ల కొరకు ఎదురు చూస్తూ
December 23, 2008 at 7:01 PM
o my god ఇప్పుడే మీ మిగిలిన పోస్టులన్ని చదివా... ఎన్ని విషయాలు చెబుతున్నారండి.. అక్బర్ ఎదో చాలా గొప్పవాడని అనుకునేదాన్ని అమ్మో.. అమ్మో ఇంత కౄరుడా :(
December 23, 2008 at 11:30 PM
netaji prati adugu ento pranalika badhamga, ayana lakshyam disa gane sagutundadam manam chusam, kani germanylo bose unna paristitulu teesukunte, ento dhairya sahasalato, chala risk teesukuni, ento srama korchi oka dalam erpatu chesi, danni madyantaramlo vadilesi velladam enta varku samanjasam??
oka army force jeevam poskovali ante, adii oka parayi desamlo, yuddha kalamlo, adi oka miracle ane cheppali.. alanti force, bose velipoyaka, punadulato saha nirmulana ayipovadanki bose karakudu kada??
bose tana sainyanni japanku enduku nadipinchaledu? germanylo appati paristitilo ika samaram konasaginchadam sadhyapadaka pote, oka able leader ki enduku appajappaledu? apudu, iru vipula ninchi british vari pina poratam jarapachu kada?
meerem antaru?
Post a Comment