Tuesday, December 2, 2008

ది గ్రేట్ ఎస్కేప్ - II

2 comments
పెషావర్ చేరుకున్నాక సుభాష్ లక్నో మౌల్వీ ఆహార్యం నుంచి, ఆఫ్ఘన్ పఠాన్ ఆహార్యానికి మారిపోయాడు. టర్కీ టోపీ పోయి ఆకుపచ్చ తలపాగా వచ్చేసింది. ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఆయన మూగ, చెవిటివాడుగా, భగత్ రాం అన్నగా నటించాలి. భగత్ రాం కాస్తా రహమత్ అలీఖాన్ గా మారిపోయాడు. పెషావర్ లో సుభాష్ కు సహాయపడిన మరో వ్యక్తి పేరు ఆబాద్ ఖాన్. సుభాష్ బోసు పఠాన్ల అలవాట్ల గురించి, ఆచారాల గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. మహమ్మద్ షా అనే మితృడు, మరో మార్గదర్శకుడు వెంటరాగా సుభాష్, భగత్ రాం కారులో జమ్రాడ్ రోడ్డును చేరుకున్నారు. అక్కడి నుంచి 'గర్హి ' అనే కుగ్రామం చేరారు. అదే రోజు చీకటి పడే వేళకి భారతదేశ సరిహద్దు దాటి ఒక ఆఫ్ఘన్ గిరిజన గ్రామానికి చేరుకున్నాడు. రాత్రి అక్కడే గడిపారు. పెషావర్ నుంచి వచ్చిన మహమ్మద్ షా, మరొక వ్యక్తి వెనకకి భారత్ కి మరలారు. మర్నాడు ఉదయం మరో ముగ్గురు సాయుధ పఠాన్ లతో కలిసి సుభాష్, భగత్ కాబూల్ కి కాలి నడకన ప్రయాణమయ్యారు. దారిలో 'లాల్ పురా' దాటారు. అక్కడి కొండ జాతి ప్రజల పరిపాలకుడు 'ఖాన్ సాహెబ్' సుభాష్ కు ఎంతగానో సహకరించాడు. సుభాష్, భగత్ రాం లు ఇరువురూ సరిహద్దు జాతివారని, వారు 'సఖీ సాహెబ్ ' సమాధిని దర్శించడానికి వెళ్తునారని - పర్షియన్ భాషలో ఖాన్ సాహెబ్ రాసిచ్చిన పరిచయలేఖ మితృలిద్దరినీ అనేక సందర్భాల్లో చిక్కులనుంచి కాపాడింది. అడుగడుగునా పోలీసులని, అధికారులని తప్పుకుంటూ చుట్టూ దారుల్లో, కొండ దారుల్లో సాగింది ప్రయాణం. దారిలో కాబూల్ నదిని దాటాల్సిరావడం గగుర్పాటు కలిగించే అనుభవం. ప్రజలు గుంపులు గుంపులుగా ఒకరికొకరు తాళ్లు కట్టుకుని, తోలుసంచులతో తాత్కాలికంగా పడవలు తయారు చేసుకుని నదిదాటడం చూసి సుభాష్ బోస్, భగత్ రాం మొదట భయపడ్డారు. కానీ, స్థానికులు ఒడుపుగా, సులువుగా దాటుతున్న పద్దతిని చూసి, తాము కూడా ధైర్యం చేసి తోలు సంచులపైన కూర్చుని నదిని దాటారు. నదివరకూ వెన్నంటి వచ్చిన సాయుధులు అక్కడే ఆగి, వీడ్కోలు చెపి వెళ్లిపోయారు.

సుదీర్ఘమైన నడక, నది దాటడం వలన సుభాష్ బాగా అలసిపోయాడు. నిద్ర కూడా వచ్చేస్తోంది. కానీ రోడ్డుమీద ఏదైనా లారీనైనా పట్టుకుని ఆ ప్రాంతం నుంచి బయట పడటం అత్యవసరం. భగత్ రాం లారీని ఆపాడు. పెద్ద పెద్ద తేయాకు పెట్టెల మీద కూర్చుని, రివ్వున తగిలే చలిగాలిని తట్టుకుంటూ రాత్రంతా కిలోమీటర్ల దూరం ప్రయాణం. రోడ్లమీద ఉన్న చెట్ల కొమ్మలు ఒక్కోసారి తలకి తగిలేవి. ఆ భయానికి నిద్రపోవడానికి వీలు లేదు. ఆహారం కూడాలేదు. కేవలం అక్కడక్కడా టీ తాగి ప్రాణాలు నిలబెట్టుకోవాల్సి వచ్చేది. 'బడ్ ఖట్' చేరాక, అక్కడ పాస్ పోర్టుల తనిఖీ జరిగింది. వారి ప్రయాణానికి కారణమేమిటని అధికారులు గుచ్చి, గుచ్చి ప్రశ్నించారు. సుభాష్ ను చూపించి, తన సోదరుడు చెవిటి, మూగ కాబట్టి 'సఖీ సాహెబ్ ' సమాధి దగ్గర ఆశీర్వాదానికి తీసుకువెళుతున్నానని భగత్ రాం అలియాస్ రహమత్ ఖాన్ చెప్పాడు. చివరికి 'ఖాన్ సాహెబ్ ' పరిచయలేఖ గట్టెక్కించింది. జనవరి 31 నాటికి మితృలిద్దరూ కాబూల్ చేరారు. కాబూల్ వచ్చినంత మాత్రాన సుభాష్ సమస్యలు పరిష్కారం కాలేదు. నిజానికవి మరింత తీవ్రమయ్యాయి. మితృలిద్దరూ కాబూల్ లో ఒల సత్రంలో మకాం వేశారు. అక్కడ పోలీసు ఏజంట్లు తగిలారు. వారికి కొంత నగదు రూపేణా లంచం సమర్పించుకుని సుభాష్ బయటపడ్డాడు. ఆశ్రయం లేని అపరిచిత ప్రదేశంలో అడుగుడుగునా...పోలీసుల, బ్రిటిష్ గూడచారుల కళ్ళు గప్పుతో తాను చేరదలచుకున్న దేశానికి చేరుకోవడం అంత తేలిక లక్ష్యమేమీ కాదు.








దిలా ఉండగా ఇక్కడ భారత్ లో జనవరి 26 మొదటి సారిగా సుభాష్ చంద్రబోస్ తప్పించికుని వెళ్లిన సంగతి ప్రపంచానికి వెళ్లడైంది. కోర్టు పని మీద సుభాష్ న్యాయవాది ఆయన్ని కలవాలని ప్రయత్నించి ఆయన గదికి వెళ్లి చూసినపుడు ఆయన తప్పించుకుని వెళ్లి పోయిన విషయం ప్రపంచానికి స్పష్టమైంది. జన. 27 నాటి దినపత్రికలు పెద్ద అక్షరాలతో సుభాష్ అదృశ్యం వార్తల్ని ప్రచురించాయి. ఆయన దేశం వదిలి తప్పించుకోకుండా దేశంలో రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు, ఓడరేవులకు ఈ సమాచారాన్ని పంపించి, కట్టుదిట్టం చేశారు. దేశవ్యాప్తంగా పోలీసు యంత్రాంగమంతా అప్రమత్తమైంది. నిర్బంధం మధ్యనుంచి సుభాష్ అదృశ్యం కావడం పోలీసు వ్యవస్థకే సవాల్ గా ప్రభుత్వం భావించింది. ఈ విషయాలన్నీ రేడియో ద్వారా ఎప్పటి కప్పుడు సుభాష్ చంద్ర బోస్ తెలుసుంటునే ఉన్నాడు. సుభాష్ భారత్ ను విడిచి వెళ్లేముందు బ్రిటిష్ వారిని అయోమయంలో పడేసేందుకు వేసిన ఎత్తుగడ మరొకటి ఉంది. తప్పించుకునే ముందే, రాబోయే నెలల తేదీలతో ముందుగానే కొందరు మితృలకి సుభాష్ కొన్ని లేఖలు రాసి ఉంచాడు. ఆ లేఖల్ని ఆయా తేదీల్లో తన మితృలకి పోస్ట్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. సహజంగానే ఆ లేఖలు బ్రిటిష్ సెన్సార్ వ్యవస్థ చేతిలో పడతాయని సుభాష్ ఊహించాడు. తాను దేశం వదిలి వెళ్లిపోయిన విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి వెన్వెంటనే తెలియరాదని సుభాష్ పన్నిన ఎత్తుగడ అది.

కాబూల్ నుంచి సోవియెట్ కు, అక్కడినుంచి జర్మనీ వరకూ సుభాష్ సాహసయాత్ర ముందు చూద్దాం.

Comments

2 comments to "ది గ్రేట్ ఎస్కేప్ - II"

ప్రపుల్ల చంద్ర said...
December 2, 2008 at 9:39 AM

very nice narration... waiting for next posts....

మనోహర్ చెనికల said...
December 2, 2008 at 12:11 PM

for better and truthful history your work is awesome, keep on

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com