Tuesday, December 9, 2008

Bose with Congress

0 comments
స్వతాహాగా సుభాష్ తెలివైనవాడు. స్కూల్లో ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా, ముభావంగా వుండేవాడు. సహజంగా బాల్యంలో పిల్లలు ఆటల్లో చూపించే ఆసక్తిని కనబర్చేవాడు కాదు. కానీ పూరీని సందర్శించే సన్యాసుల్నీ, తీర్థయాత్రికుల్నీ చూసి సుభాష్ ఎంతో అబ్బురపడేవాడు. చదువులో బాగా చురుకు. స్కూల్ ఫైనల్లో రెండో ర్యాంక్ సాధించి కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజిలో సీటు సంపాయించాడు. ఒకసారి కాలేజీలో వర్ణ వివక్షని చూపినందుకు ఒక ఆంగ్ల ప్రొఫెసర్ పై తన చేతి వాటం చూపాడు 1916 లో . తక్షణం బోస్ ని కాలేజీలోంచి బహిష్కరించారు.బోస్ నాన్నగారికి ససేమిరా ఇష్టం లేదు ఇంకో కాలేజీలో చేర్పించటానికి. ఏమైతేనేం మళ్లీ అదే కాలేజీలో పిలాసపీలో చేరి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత ఉన్నత విద్యకోసం ఇంగ్లాండ్ వెళ్లటం, ICS పరీక్ష రాసి (1920) నాలుగో స్థానంలో నిలిచాడు. (బోస్ కి ఆంగ్లంలో ప్రావీణ్యమెక్కువ. ICS లో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాయించాడు) సరిగ్గా అదే సమయంలో జలియన్ వాలా బాగ్ దుర్ఘటన సుభాష్ నెంతో కలిచి వేసింది. ICS వొదిలేసి గాంధీ పంచన చేరాడు. గాంధీ ఆదేశాల మేరకు కలకత్తా లో వుంటున్న చిత్తరంజన్ దగ్గిరకు వెళ్లాడు...



కాంగ్రెస్ లో చురుగ్గా పాల్గొంటూ (1921-25) చాలాసార్లు అరెస్టయ్యాడు. 1921 డి సెంబర్, వేల్స్ రాకుమారుని భారత సందర్శనను పురస్కరించుకుని చేసే సంబరాల్ని నిరసించటానికి సుభాష్ పెద్ద పెట్టున ప్రదర్శనలు జరపగా జైల్లో పెట్టారు. తర్వాత యింకో సందర్భంలో చిత్తరంజన్ దాస్ తో జైలుకెళ్లాడు. సరిగ్గా అప్పుడే ఇద్దరిమధ్య గురు శిష్య సంబంధం ఏర్పడింది. ఎంతో ఓర్పుతో వంట చేసిపెట్టటంతో పాటు అన్ని రకాల గురు శుశ్రూషలు చేసి ప్రియ శిష్యుడనిపించుకున్నాడు. కలకత్తాకి దేశ్ బంధు చిత్తరంజన్ దాస్ మేయర్ అయినపుడు బోస్ Chief Executive గా నియమింపబడ్డాడు. యిదే పదవిలో వున్నపుడే బోస్ ని విప్లవకారుల్తో సంబంధాలున్నాయన్న నెపంతో చాలా సార్లు బ్రిటిష్ ప్రభుత్వం జైలుకి పంపింది. మొదట Alipore జైలు తర్వాత బర్మాలోని Mandalay కి పంపారు. 1925 లో దేశ్ బంధు మరణం బోస్ ని ఎంతో వ్యాకులచిత్తుడిని చేసింది. 1926 లో Bengal Legislative Assembly కి మెంబర్ గా నామినేట్ చేయబడ్డాడు. 1927 మే 16 న అనారోగ్యం కారణంగా బోస్ విడుదలయ్యాడు. యీ రెండేళ్ల ఖైదీ జీవితం బోస్ కి ఎంతో లాభించింది. దీర్ఘ భవిష్యత్ ప్రణాళికలు వేసుకోటానికి ఉపకరించింది. 1927 లో భారత జాతీయ కాంగ్రెస్ కి జనరల్ సెక్రటరీ గా ఎన్నికయ్యాడు. తరువాతి యేడాదిలో కాంగ్రెస్ సంవేశమైనపుడు భారతీయుల స్వయం పాలనా వ్యవస్థకి సమాలోచనలు జరిపారు. యీ ముఖ్య ప్రతిపాదనని మోతీలాల్ ప్రవేశపెట్టాడు. కానీ దీన్ని యువనేతలందరూ గట్టిగా అభ్యంతరం చెప్పారు. బోస్ నెహ్రూ లయితే భారతీయులకు సంపూర్ణ స్వరాజ్యమే ముఖ్యమని, అదీ అతిత్వరలోనే సాధించుకోవాలని పట్టుబట్టారు. చివరికి గాంధీ యిచ్చిన సలహా మేరకు యీ ప్రతిపాదనని కొద్దిగా మార్చి కమిటీ ఆమోదించింది. అదేమంటే బ్రిటిష్ వారికి స్వయంపాలనా వ్యవస్థ అనుమతి కి యేడాది గడువిచ్చి , అది గనక జరక్కపోతే అపుడు సంపూర్ణ స్వరాజ్యానికి కట్టుబడుండాలని. యీ విషయంలో లో గాంధీ చేసిన తీవ్ర ప్రయత్నాలేవీ ఆ తరువాత ఫలించలేదు. తరువాతి కమిటీ మీటింగ్ లో సంపూర్ణ స్వరాజ్య సాధన బిల్లుకి అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

1931 జనవరి 23 న భగత్ సింగ్ ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. భగత్ సింగ్ ఆత్మత్యాగం, తనని కాపాడుకోలేకపోయిన భారత జాతీయ కాంగ్రెసు నిర్లక్ష్యం బోస్ ని ఎంతో కలిచి వేసింది. 1932 జనవరి 2 న బోస్ ని అరెస్ట్ చేసి తర్వాత బహిష్కకరించింది.బోస్ Vienna వెళ్లినపుడు విఠల్ దాస్ పఠేల్ తో పరిచయం ఏర్పడింది . పఠేల్ తో కొన్ని సైద్దాంతిక సమాలోచనలు జరిపాడు. అహింసా పద్దతిలో జరిపే స్వాతంత్ర్య పోరాటానికి కొన్ని విప్లవ తరహా రూపురేఖలు తీసుకురావాలన్న అవసరం ఎంతైనా వుందని గుర్తించారు. దురదృష్టవశాత్తూ 1933 oct లో పఠేల్ చనిపోయాడు. 1934 లో 'భారత పోరాటం ' అనే పుస్తకాన్ని ప్రచురించాడు.

1932-36 ప్రాంతంలో బోస్ కొందరు ప్రపంచ నేతలను కలిశాడు. ఇటలీలో ముస్సోలినీ, జర్మనీలో ఫెల్దర్ , ఐర్లాండ్ లో వలెరా , ఫ్రాన్స్ లో రోం రోలాండ్ . 1936 ఆప్రిల్ 18 న భారత్ తిరిగి వస్తున్నట్టు తెలియజేశాడు బోస్. బొంబాయిలో అడుగుపెట్టగానే అరెస్టయి 1937 మార్చి 17 న విడుదలయ్యాడు. అప్పటికే దేశంలో సుభాష్ బోస్ ఎంతో ప్రసిద్దుడయ్యాడు. గాంధీ బోస్ ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేయమని అడిగాడు. ఆ విధంగా మొదటిసారి 1938 లో భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. యిదే సమయంలో ఠాగోర్ బోస్ ని 'దేశ్ నాయక్ ' అనే పేరుతో సంబోధించాడు. ముస్సోలినీ తదితర నాయకులతో భేటీ అయిన విషయం గాంధీకి ఆ తర్వాత తెలిసొచ్చి యీ విషయం వైస్రాయ్ కి ససేమిరా నచ్చలేదనీ చెప్పాడు. అప్పటినుంచే గాంధీ-సుభాష్ మధ్య విభేదాలు పొడసూపడం అధికమయ్యాయి (సైద్దాంతిక విభేదాలూ ఉండనే వున్నాయి)

ఆ కారణంగానే యీసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తానని రాజెఏంద్రప్రసాద్ ని , నెహ్రూ ని గాంధీ అడిగాడు. చివరికి పట్టాభి సీతారామయ్యని ఒప్పించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తో 1580-1371 ఆధిక్యంతో బోస్ మళ్లీ కాంగ్రె స్ కి రెండోసారి అధ్యక్షుడయ్యాడు.


ఆ తర్వాత గాంధీ ఇది తన ఓటమి అని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. కాంగ్రెసులో ప్రతికూల పరిస్థితులు ఎర్పడటం వల్ల నెల తిరక్కుండానే బోస్ కాంగ్రెస్ విడిచి 1939 మే లో 'ఫార్వాడ్ బ్లాక్ ' పార్టీని స్థాపించాడు. సాధారణ ప్రజలకు గాంధీ చర్య మింగుడు పడలేదు. అంతటి జాతిరత్నాన్ని కాంగ్రెసు నించి బయటకు సాగనంపినందుకు విస్తుపోయారు. రెండో ప్రపంచ యుద్దం ప్రారంభమయ్యాక భారత్ తమతో పాటు యుద్దంలో పాల్గొంటుందని ప్రపంచానికి వెల్లడి చేసింది బ్రిటన్. ఈ చర్యకు నిరసనగా పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేశారు. బోస్ వీర్ సావర్కార్ ని 1940 జూనె 21 న సమావేశమయ్యాడు. సావర్కార్ సదన్ లో (ముంబాయి) జపాన్ లో వుంటున్న రాస్ బిహారీ సహాయంతో దేశం వొదిలి బ్రిటన్ శత్రు దేశాల మద్దతుతో భారత సైన్యాన్ని నిర్మించుకోవాలని కోరాడు. సుభాష్ తన ఆందోళనల్ని ప్రజల మద్దతుతో ఉధృతం చేశాడు. యీసారి ప్రజలు ఉత్తుంగ తరంగాలై ఉద్యమంలో వెల్లువెత్తారు. బోస్ ని జైలులో పెట్టాక ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిచాక 11 వ రోజు బోస్ ఆరోగ్యం మరింతగా క్షీణమవటంతో గృహ నిర్బంధంలో వుంచారు.

సుభాష్ కు గాంధీ కి అసలు పడదని కొందరు, అది సైద్దాంతిక విరోధమేనని మరి కొందరి వాదన. వ్యక్తిగతంగా ఒకరిపట్ల ఒకరు ఎట్లా మసలుకొనేవారో, కాంగ్రెసుని బోస్ విడిచిన తర్వాత బోస్-గాంధీ మధ్య ఏం జరిగిందో ముందు ముందు చూద్దాం.
(Cancelled Passport)













Comments

0 comments to "Bose with Congress"

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com