Friday, March 21, 2008

తాటక వథ వెనుక అసలు కథ - I

6 comments




అశ్వమేథయాగం చేసినపుడు 300 పశువులను హోమం చేశారు. యజ్ఙవాటిక ధూమగంధంతో వపా వాసనలతో (వప అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు - దీనిని యాగాలలో అగ్నిలో కాలుస్తారు) నిండి ఆ వాసన బాగా పీచాడు రాజు. వప కోసం ఎన్ని జంతువులు బలి అయివుంటాయో. పశువులనూ,సర్పాలనూ కూడా హోమం చేశారు. దశరథుని పట్టపుగుర్రాన్నీకూడా అందులో చేర్చారు.
పట్టమహిషి కౌసల్య ఆ గుర్రాన్ని పూజించి బంగారు సూదులతో దాని గుండెపై మూడునాట్లుపెట్టి ఆ రాత్రి అంతా ఆమె అక్కడే గడిపింది. తర్వాత దశరథుడు రాజ్యమంతా ఋత్విక్కులకు ధారపోశాడు. 'నీవు అందర్నీ రక్షించగలవు ' అని ఆ రాజ్యం అతనికే ఇచ్చారు. వేదపారంగతులైన బ్రాహ్మణులకు పది లక్ష ఆవులు, నూరుకోట్ల (విలువగల) బంగారం, నాలుగు వందల కోట్ల వెండి ఇచ్చాడు.

తర్వాత పుత్ర కామేష్టి. పుత్రకామేష్టి అయ్యాక ప్రాజాపత్యప్రుషుడు హోమాగ్ని నుంచి వచ్చి (బంగారు) పాయసం పాత్ర ఇచ్చాడు. ఆ పాయసం పుత్రులను ప్రసాదించే ఔషధం. యీ లోపల అక్కడ దేవతలు రావణుని గురించి బ్రహ్మకు ఫిర్యాదు చేశారు. రావణుని రాక్షసునిగానే పేర్కొన్నారు (రావణో నామ రాక్షసః) .


నారాయణుడు వచ్చి తాను భూమి మీదా పుడతానన్నాడు. దేవతా రక్షణమూ (అగ్రవర్ణాల రక్షణ), అసుర సమ్హారమూ(ప్రాచీన జాతులైన కిందివర్గాల) సనాతన ధర్మమే కదా. పురాణాల్లో దేవగణాన్ని మంచివారుగా, రాక్షసులను చెడ్డవారుగా చిత్రీకరించడం జరిగేది. ఆర్యజాతి వారికీ(లేదా ఆర్య సంస్కృతి పాటించేవారికి) ఆదివాసులకూ మధ్యజరిగిన యుద్దాలను నర-రాక్షస యుద్దాలుగా చిత్రీకరిస్తూ కథలు అల్లటం జరిగాయి.

ఇంద్రపదవిలోని వారు తమ పదవి నిలుపుకోటానికి చేసే అరాచకాలన్నిటికీ పురాణాలు కీర్తించాయి. మునులు దేవగణాలూ ఒక పక్షం, అసురులు మరో పక్షం. దేవతలు జగత్కాళ్యాణ కారకులు. అసురుల దేహాలు అధమమైనవట. దేవతల శాస్త్ర జ్ఙానం ఉభయతారకమట. రాక్షసుల జ్ఙానం సర్వనాశనకరమట. రాక్షసులకు విద్య, తపస్సు, మంచివి కావు అనేవి రాముని కథలో చెప్పారు. రామావతారం రాక్షస సమ్హారం కోసమే జరిగింది. కిందివర్గాల ప్రాబల్యాన్ని అరికట్టటానికే జరిగింది. ఒక పథకం ప్రకారమే జరిగింది. రాజులు మునులు కలిసి చేసిన అరాచకాలకు ఇది సమర్థన గ్రంధం. రాక్షసుల వల్ల బాధలు పడుతోన్న దేవతల రక్షణకు విష్ణువు రకరకాలుగా (జంతురూపాలు, మానవరూపాలూ) భూలోకంలో పుట్టిన కథలు మనకుకొత్తకాదు. ఈ విషయం వృతాసురుని వధ విషయంలో ఎంత స్పష్టంగా విదితమవుతుందో చూడండి.

వృత్రాసురుని కథలో కూడా ఇలాంటి వ్యవహారమే కనబడుతుంది. వృత్రుడు రాక్షసుడు, లోక సమ్మతుడు. ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. దేశం శాంతిగా ఉండింది. అప్పటివరకూ అంతా బాగానే ఉంది. వృత్రాసురుడు తపస్సుకు పూనుకునేసరికి కలకలం బయలుదేరింది. దేవతలకు శత్రువయ్యాడు. అంతవరకు ఇంద్రుడూ దేవతలూ అతనితో ఇష్టంగానూ ఉండేవారు. తపోబలం(విజ్ఙానం) కావాలనుకోగానే వృత్రుడు దేవగణాలకు శత్రువయ్యాడు. అతని తపస్సు జగత్తుకు(తమకు) ఉపద్రవ కారణమని భావించి 'వృత్రుడు ధర్మాత్ముడై బలవంతుడై వున్నాడు. అతనిని ఉపేక్షించకూడదు ' అంటూ దేవతలంతా విష్ణువు దగ్గరకు వెళ్ళారు. అతనిని వధించాలని కోరారు. 'పూర్వం అతనితో స్నేహంగా ఉండేవాడిని కాబట్టి, నేను అతనిని చంపను. ఎలా చంపబడతాడో చెబుతాను ' అన్నాడు. స్నేహంగా వుండేవాడినంటో ఇప్పుడు తపస్సుకు పూనుకొనగానే దేవతలందరూ పొలోమని వచ్చి కాపాడమని అడగ్గానే విష్ణువు వృత్రాసురుని చావుకి ముహూర్తం పెట్టాడు. ఇదెక్క్ద్డి న్యాయం. అతను చేసిన పాపమేంటి? తపస్సు పూర్తవలేదు, ఎలాంటి వరం కోరతాడో తెలీదు. అది లోక కళ్యాణమా లేక లోకవినాశనమా తెలీదు, విష్ణువు దర్బారులో న్యాయనిర్ణయం జరిగిపోయింది. విష్ణువు తనను తాను మూడుగా విభాగించుకొని ఒక అంశతో ఇంద్రుని, రెండో దానితో వజ్రాయుధాన్ని, మూడోదానితో భూమిని పొంది వారికి బలం కలిగిస్తానన్నాడు. ఈ పోరాట విధానలో బలాలు మూడు. రాజు(అధికారం), ఆయుధం, భూమి. ఇవే మన పురాణాలన్నిటా , ఇతిహాసాల్లోనూ ప్రముఖ పాత్ర వహించాయి. జగత్పరిపాలకులైన దేవతలకు, ఇంద్రునికీ సుఖం కలిగించటం విష్ణువు ప్రధాన కార్యమట.

దశరథుడు పాయసాన్ని తన ముగ్గురి రాణులకిచ్చాడు ( రాముడు అడవికెళ్తూ తండ్రి దగ్గిర సెలవు తీసుకోటానికొచ్చినపుడు దశరథుడు తన అంతఃపుర స్త్రీలను 350 మందిని పిలిపించాడు. ఇదెలా అర్థం చేసుకోవాలి. అంతఃపుర స్త్రీలంటే చుట్టపక్కాలూ, దాసదాసీలూనా, లేక తను పెళ్ళి చేసుకున్న స్త్రీలనా ( అర్థసప్తశతా : అయోధ్య-34-13).

*
విశ్వామిత్రుని రాక

రాజకుమారుల జననం మొదలుగా వేడుకల పరంపరసాగింది. శాస్త్ర విద్యలూ, యుద్ద కళలూ నేర్చుకుంటో వారు యుక్తవయస్సుకు వచ్చారు. 'అహం నియమమాతిష్టే...మారీచశ్చ సుబాహుశ్చ్య వీర్యవంతౌ సుశీతౌ ' (బాల: 19-4,5,6). ఒక ఫలసిద్ది కోసం తాను యాగం చేస్తున్నాననీ ఆ యజ్ఞానికి ఇరువురు రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారనీ తన యజ్ఙం నిర్విఘ్నంగా సాగటానికి రాముని సహాయం కావాలనీ చెప్పాడు. అతని యజ్ఙం గొప్ప లోకోపకారం చేసేదేమీ కాదు.రామాయణంలో తరువాతయినా ఆ యజ్ఙం ప్రాధాన్యం ఏమీ కనబడదు.'..నకు అడ్డుతగులుతున్న రాక్షసులను (స్థానికులైన భూమి పుత్రులను) చంపించటానికే ఆయన రామున్ని తూసుకువెళ్ళాడు. తపస్సుకు, యజ్ఙయాగాదులకూ ఆటంకం కలిగించటం నిజానికి దేవతలే ఎక్కువగా చేశారు. దేవేంద్రుని పనే అది. మునులు చేస్తున్న యజ్ఙాలూ, భూ ఆకమణలూ, రాజులకు సమ్మతం అని నిరూపించటానికే విశ్వామిత్రుడు రామున్ని తీసుకువెళ్ళాడు. మునుల ఆక్రమణలు చట్టబద్దం చేయటానికే రాముని గమనం సాగింది.


'కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ' ప్రయాణంలో రాత్రి సరయూ తటంలో రామున్ని మేల్కొల్పుతూ, 'కౌసల్య పుత్రుడా, రామా మేలుకో-తెల్లవారింది...' అని విశ్వామిత్రుడు వారిని నిద్రలేపాడు. అప్పటి ఈ మేలుకొలుపు ఈనాటికీ వెంకటేశ్వర సుప్రహాతంలో ఇదే ప్రధానంగా వినిపిస్తుంది. వేంకటేశ్వరునిలో రాముడినే చూస్తున్నారు భక్తులు. కౌసల్య పుత్రుడిగా అప్పటి స్త్రీ స్వామ్య సమాజానికి నిదర్శనం. రానురాను స్త్రీ స్వామ్య సమాజాన్ని రామాయణం పురుషస్వామ్య వ్యవస్థలోకి నెట్టివేసింది. రాముని దశరధరామునిగా ప్రచారం చేసింది.(ఇంకా స్త్రీ స్వామ్యాన్ని నాశనం చేసే చర్యలు తాటక వధ ఘట్టంలోనూ శూర్పనఖ, అయోముఖి అనేవారిని అవమానించి కురూపులుగా చేయటంలోనూ గమనించవచ్చు. ). విశ్వామిత్రుని యజ్ఙాలకు విఘ్నం కలిగిస్తున్న మారీచసుబాహులు వీర్యవంతులు-బలపరాక్రమాలు కలవారు; యజ్ఞాలు జరగకుండా చేయడంలో సుశిక్షితులు. అప్పటికి యజ్ఞాలలో జరిగే హింసకు సమాజంలో వ్యతిరేకత వచ్చింది. ఒక వర్గం యజ్ఙాలు ఆపే ప్రయత్నాలు ఆరంభించింది. సుశిక్షితులైన కార్యకత్రలను కూడా రంగంలో దించింది. వారికి నాగరాణి తాటక అండగా ఉంది. యజ్ఙాలను ఉధృతంగా చేస్తున్న వర్గం కూడా అంత పట్టుదలతోనూ ఉంది. రాజులనూ, అధికారులనూ తనకు అండగా నిలుపుకుంది. ఇరు వర్గాలకూ ఘర్షణలు జరుగుతున్నాయి.

తాటక(నాగరాణి)

విశ్వామిత్రుడు యజ్ఙం చేసేది తాటక రాజ్యానికి దగ్గర్లోనే. తాటక యజ్ఙ విరోధి. శాంతి కాముకురాలు. జంతు హింసను నిషేధించిన ప్రజల రాజ్యం అది. కాబట్టి వారు విశ్వామిత్రుని యజ్ఙం సాగనీయకుండా అడ్డుపడుతున్నారు. అయితే మునులు క్షత్రియుల సహాయంతో తమ యాగాలు కొనసాగిస్తున్నారు. అరణ్య ప్రజలు మరింత లోపలికి తరిమికొట్టి వారు భూములు ఆక్రమించి తపోవనాలపేరుతో ఆశ్రమాలు స్థాపించుకున్నారు.
తాటకవనంవైపు తీసుకువెళ్తూ విశ్వామిత్రుడు తాటక 'సహస్ర నాగబల సమన్విత ' అని చెప్పాడు.

'అల్పవీర్యాయదాయక్షాః... నాగ సహస్రస్య ధారయత్య బలాబలం ' [బా.కాం:25-2]. యక్షులు బలహీనులని వింటూ ఉంటాం. అబల ఏమిటి, వెయ్యు ఏనుగుల (నాగుల) బలం కలిగి ఉండటమేమిటి - అని అడిగాడు రాముడు. మనకు తెలిసిన తాటకు పరమ కురూపి. అసలు కథేంటో చూద్దాం.తాటక సుకేతుని కూతురు. సుకేతుని తపస్సు ఫలితంగా బ్రహ్మ ప్రసాదంతో లభించిన వరఫలం తాటక. ఆమె సహస్ర నాగ బలం కలది అనీ, యశవిని అనీ, రూపవతి[బా.కాం:25-6,7,8]. తాటక భర్త సుందుడు. అగస్త్యుని హింసింపబోగా ఆతడు తాటకను వికృతరూపముగలదానవగుమని శపించెను. మారీచుడు ఈమె కుమారుడే. రూపవతీ బలవతీ అయిన తాటక అగస్త్యుని హింసించబోవటానికి కారణమేమిటో రామాయణంగానీ , పూర్వగాథాలహరిగానీ(దీంట్లో తాటక వృత్తాంతం గూర్చి వుంది) చెప్పటం లేదు. కథ తెలిసిన చాలామంది కూడా ఈ వివరాలు చెప్పరు. తాటక ఒక యక్షుని కూతురని చెప్పటం వల్ల సుందుడు యక్షుడని తెలుస్తుంది. తాటక రాక్షసి అనే భావమే ప్రచారంలో ఉంది. తాటక తల్లితండ్రుల, భర్త వివరాలూ ఎక్కడా లేవు. బ్రహ్మ వరప్రసాదంతో కలిగిన కూతురు చాలా గొప్ప వ్యక్తిత్వం కలదే అయి వుండాలి. (హిందూ పురాణాల ప్రకారం యక్షులు దేవగణాలలోనివారు. కామరూపులు. యక్షగానాలుగా ప్రసిద్దిపొందిన సంగీతనృత్య కళారూపాలకు మూలకత్రలు వీరే. యక్షగానాలు జనసామాన్యపు వేషభాషావైఖరులను ప్రదర్శించే వినోద రూపాలు. ప్రాచీన సాహిత్యంలో యక్షుల గురించి, యక్ష ప్రశ్నల గురించి ఉంది.) అగస్త్యుని శాపం వల్ల తాటక భర్త మరణించాడు. మునులు సత్వగుణ సంపన్నులూ తపోబలం కలిగిన వాౠ అయినా గాని చీటికీమాటికీ అందర్నీ శపిస్తుండటం పురాణాలలో కనిపిస్తున్నదే. భర్త మరణానికి కోపోద్రిక్తురాలైన తాటక పుత్రుని వెంట బెట్టుకుని అగస్త్యుని దగ్గరకు వెళ్ళింది. ఆమె కోపంగా అగస్త్యుని మీదికి వెళ్ళిందనీ అందుకే ఆమెను ముని శపించాడనీ రామాయాణం చెబుతున్నది.భర్తను నిష్కారణంగా చంపిన వాని మీదకు భార్య కోపంగా వెళ్ళక చిరునవ్వులు చిందిస్తూ వెళ్తుందా పతివ్రతల లక్షణాలు, భార్యాధర్మాలు ఏకరువు పెట్టిన రామాయణం యక్షరాక్షస స్త్రీలకు వాటిని అన్వయించలేదు. సరికదా వారిని చులకనగా చూసింది.

మానవులను తినే దానివై వికృతమైన ముఖంతో విరూపవై తిరుగాడవలసిందిగా, మారిచుని రాక్షసునిగా [బా.కాం:25,9-14] శపించాడు. ఎంత దారుణమైన శిక్ష ఇది! మారీచుడి దోషమెక్కడ వుంది యీ గలాటాలో ? భర్తను హతమారిస్తే అందుకు నిలదీయటానికీ/కోపోద్రిక్తురాలై వెళ్ళటం ఆమె చేసుకున్న పాపం. అతడిని భగవాన్ గా స్తుతించింది ఆర్య వాజ్మయం. కుటుంబంలోని సభ్యుల మధ్య ఉండే ఆప్యాతల ,బాధ్యతల,విధులు, హక్కులు అన్నీ వివిధ పాత్రల ద్వారా చెప్పిన రామాయణం యక్షుల/రాక్షసుల/స్థానిక ఆర్యేతరుల బాంధ్వ్యాలను ఆ దృష్టితో ఆలోచించలేదు. వారి పట్ల మానవతా విలువలు పాటించలేదు. శాపాల పేర్లతో కింది వర్గాల ఆహార విహారాలనూ వేషాన్నీ కూడా కట్టడి చేశారు. భర్తను చంపారు, కుమారున్ని సపించారు. తనను వికృత పరచారు. వేయి ఏనుగుల శారీరక బలం కలిగి ఉన్నదయితే తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకార్మ తీర్చుకోకుండా నిస్సహయంగా ఉండేదేనా, లేకపోతే శారీరక బలం కంటే త్ఫో బలం గొప్పదని నిరూపించే ప్రయత్నంలో ఈ కథ అల్లారా?

'యశ్శపా ద్రాక్షసో భవత్ ' అని రామాయణం అంటున్నది.శాపం అనేది శిక్షా రూపం.సామాజిక బహిష్కరణకు పూర్వ రూపంగానూ దీనికి చెప్పుకోవచ్చు. మునులు , పురోహిత వర్గాలు ఈ శాపాలు ఇస్తుంటారు. అప్పుడప్పుడు రాజులూ ఇవ్వబోతారు. శాపాల వల్ల దేవతలు, యక్షులు, గంధర్వులు, నాగులూ మానవలోక,లోనో పాతాళలోక,లోనో జన్మిస్తుంటారు. అందరికీ శాపవిమోచనం కూడా వుండదు. కొందరికే వుంటుంది. 'తమ సంఘం నుంచి వెలి అయిన వారిని పంపే భూములుగా దక్షిణా పథాన్ని ఋగ్వేద కాలపుఆర్యులు గుర్తించారు.ఆర్యావర్త దక్షిణ సరిహద్దుల్లో ఆంధ్ర, శబర, మూతిబ, పుళింద, పుండ్రక జాతుల వారున్నారని ఐతరేయం, సాంఖ్యాయన శ్రౌత సూత్రం పేర్కొంటున్నాయి. సరస్వతీ దృషద్వతీ నదుల మధ్యదేశం ఆర్యావర్తం అనీ అక్కడనుంచి వింధ్యదాటి దక్షిణానికి వచ్చిన వారు ఆర్యులుగా ఆ ప్రాంతాల భూములు ఆక్రమించుకున్నారనీ ఒక కథనం. ఆర్యధర్మాన్ని అంగీకరించని వారు దక్షిణానికి వచ్చారనీ వారే స్థానికులైన జాతులనీ మరో కథనం. వర్ణధర్మ రక్షణ రాజులకర్తవ్యమైది. రాజధర్మ నిర్వహణలో భాగంగా చెబుతూ నాగరాణి తాటకను వధింపచేశారు మునులు. ఆమె యజ్ఙాలను విఘ్నపరుస్తున్నదని చంపాలనీ కోరాడు.



'ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణాం. గోబ్రాహ్మణ హితార్థాయ జహి దుష్ట పరాక్రమాం.' (ఓ రాఘవా! చెడు నడవడిక గలదీ దుష్ట పరాక్రమురాలూ అయిన ఈ యక్షిని గోబ్రాహ్మణ హితం కోసం చంపవలసింది.) ఇంతవరకూ ఆమె చెడునడవడి గురించి వాల్మీకి ఏమీ రాయలేదు. విశ్వామిత్రుడూ చెప్పలేదు. భర్త మరణం గురించి అడగటానికి వెళ్ళటమే తాటక చేసిన అపరాధం. యజ్ఙాలు జరగ నివ్వకపోవటమే దుష్టపరాక్రమం. యజ్ఙాలు రాజదక్షిణల కోసమూ యజ్ఙ పశువు మాంసం కోసమూ జరుగుతూ ఉండేవి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనిద్దాం. పైన పేర్కొన్నట్టు అసలు 'గోబ్రాహ్మణ హితం ' అంటే ఏమిటి? తాటక మరణిస్తే బ్రాహ్మణులకు హితం సరే, మరి గోవులకు హితం ఎలా? 'గో' అంటే ఆవుల వంటి పశువులు, గ్రహాలు, కిరణాలు, వేదాత్మక వాక్కు మొ. అర్థాలున్నాయి. 'రవి గోవులను అందించాలి ' (మత్స్య పురాణం) అంటే 'కిరణాలను అందించాలి ' అని అర్థం. 'గో' శబ్దం బ్రాహ్మణులతో జత చేసినప్పుడు వేదాత్మక వాక్కు గల బ్రాహ్మణులు అని అర్థం. గోబ్రాహ్మణులు అంటే వేదాలు వల్లె వేస్తుండే బ్రాహ్మణులు. పురాణాల్లో చాలా సార్లు కనబడుతుంది ఈ 'గోబ్రాహ్మణ హితం ' .
మరి శ్రీరాముడెలా చంపాడు ఒక స్త్రీని? స్త్రీ హత్యనెలా ప్రోత్సహించాడు విశ్వామిత్రుడు?. తాటకను చంపటం పాపమేమీ కాదని అది చాతుర్వర్ణ వ్యవస్థను నిలబెట్టటం కోసం చేయాల్సిన కర్తవ్యమని కబుర్లు చాలా చెబుతాడు. పురోహిత వర్గాలూ, క్షత్రియవర్గాలు పటిష్టపరిచిన వర్ణధర్మాల్ని కాపాడటానికి

పన్నిన పన్నాగం తాటక వధ.



'...చాతుర్వర్ణ హితార్ధాయ కర్తవ్యం రాజసూనునా'

Comments

6 comments to "తాటక వథ వెనుక అసలు కథ - I"

oremuna said...
March 21, 2008 at 10:51 AM

మీరు రవీంద్ర నాథ్ ఠాగూర్ గోరా చదివినారా?

Ramakrishna Bysani said...
March 21, 2008 at 9:38 PM

మీరు చెప్పేదానిలో తర్కం కనబడుతోంది. ఇది చదివితే తమిళనాడులో ఏదో ద్రవిడ పార్టీ మీటింగ్ వింటునట్టు ఉంది. ప్రతి కార్యంలోనూ మంచి చెడూ రెండూ ఉంటాయి, ఎక్కువ మంది ఒప్పుకున్నదో, ఎక్కువ మందికి మంచి చేసినదో అయిన కార్యాన్ని జనం అమోదిస్తారు. బిన్ లాడెన్ కి కూడా వాడు చేసే పని మంచిదే అవుతుంది, అలాగే ఆర్యులకు కూడా వాళ్ళు చేసింది మంచి పనే, ఎందుకంటే అది వాళ్ళ సమాజానికి హితకరంగా ఉంది. ఈ కాలానికి పనికివచ్చే ణీతిని మాత్రమే రామాయణం నుంచి తీసుకుంటే సరిపోదా...

Anonymous said...
March 22, 2008 at 6:16 AM

మిగతా విషయాల మీద నేను సాధికారంగా వ్యాఖ్యానించలేను.
ఒక అనుమానం.
పలువురు భార్యలు ఒకతనికి ఉన్నప్పుడు ఎవరి పుత్రుడో తెలియడానికని, పరిచయం చేసుకోవడానికి తల్లి పేరు తీసుకున్నంత మాత్రాన అది మాతృస్వామ్యం అయిపోతుందా?
కూతురిని దత్తత ఇచ్చేసి కొడుకు కోసం యాగాలు చేయడం వంటివి మాతృస్వామ్యాన్ని సూచిస్తాయా?

RG said...
March 29, 2008 at 1:28 AM

Ignorance is Bliss అని ఎందుకంటారో మీ బ్లాగు చదివితే అర్థమౌతోంది.

మనోహర్ చెనికల said...
March 31, 2008 at 5:02 PM

your work is excellent. till now Im also having one doubt about thataka. why viswamithra wantd rama to kill thataka with out listing any of her crimes? nobody tells. but still we need to worship rama for killing thataka.

keep it up.

చెన్న కేశవ కుమార్ బోను said...
March 27, 2010 at 10:24 PM

taatakaki 1000 enugula balam undedi, adhi brahma gari varam...................anduvalana taataka aame bhartha oori meedapadi ishtamochhinattu tirigevaaru. oka roju taataka bhartha agastya maharshi meeda padaboga aayana atanni samharinchadu. idhi chusina taataka aame kumaarudaina mareechudu agastyudi meeda paddaru. appudaayana taatakani vikrutaroopam vachhugaaka ani, naramamsam tine rakshasudiga maaripoo ani mareechudini sepinchadu..........


nuvvu ramayanam chadivaavu kaani, neeku ramayanam emi ardham kaaledani ardhamavutundi...............

alage nuvvu vruttasurudi gurinchi cheppinadi kuda tappu. indrudini champeyyalani chesina yaagam lonundi puttinavaadu vruttasurudu. vruttasurudu goppavaadani ye puraanamlonu cheppaledu..................kaavalante bhagavatanni marosaari chaduvu...........

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com