Thursday, March 6, 2008

రామా ! కనవేమిరా? - II

0 comments
శ్రీరామావతారం పద్దెనిమితో అవతారమని భాగవతం చెబుతోంది. బ్రాహ్మణులు క్షత్రియులు కలిసి పురోహిత వ్యవస్థను పటిష్టం చేయటం ఈ అవతార లక్ష్యం. క్షత్రియ ధర్మాలలో వర్ణధర్మ పాలన ఎలాగూ ఉంది. బ్రాహ్మణుల అధికారాన్నీ మునుల వ్యవయారాలనూ ఎవరూ ప్రశ్నించకూడనంతగా కాపాడటం, అరణ్య భూముల ఆక్రమణ, గిరిజన రాజ్యాలను వశపరచుకోవటం, శూద్రులకు విద్య, తపస్సు నిషేధించటం , పాతివ్రత్యం పేరుతో స్త్రీలను అణచివేయటం - వంటివి లక్ష్యాలు. రామచరిత్ర నెపంగా సమస్త ధర్మాలూ, వర్ణాశ్రమ భాగాలు నానాదేశ చరిత్రలు, శత్రుమితుల కథలూ ఇతిహాస స్వరూపంగా చెప్పారని బృహద్దర్మ పురాణం చెబుతోంది.

'రామాయణం మహాకావ్యం కృత్స్నం వాల్మీకి నా స్వయం
తత్ర రామచరిత్ర స్యవ్యపదేశేన సర్వశః
సర్వేధర్మాః సముద్దిష్టా వర్ణాశ్రమ విభాగశః
నానాదేశ చరిత్రాణి శత్రుమిత్ర కథా అపి
ఇతిహాస స్వరూపేణ సర్వేధర్మా నిరూపితాః'

శైవ వైష్ణవ మతాల ఘర్షణ కూడా దీనిలో ఉంది. రావణుడు శైవుడు. శివుని ఆరాధించి దుష్కరమైన తపస్సు చేసి అతీత శక్తులు పొందాడు. రావణునిచేత ఓడిన దేవతలు విష్ణువును ఆశ్రయిస్తే ఆయన ' తపస్సు చేత రావణుని మీరు ఓడించగలరా " అని అడిగాడట. బ్రహ్మ ఇంద్రియలోలుడు, ఇంద్రుడు జారుడు, చంద్రుడు గురువు భార్యతో ఉన్నాడు, యముడు కఠినుడు, వాయువు చంచలుడు, అగ్ని సర్వ భక్షకుడు. అలాగే ఇతర దేవగణాలు కూడా అవలక్షణాలు కలవారే. వీరెవరూ తపశ్శక్తిలో రావణుని జయించటమనే ప్రశ్నే లేదు’. దేవతలు శివుని దగ్గరకు వెళ్ళారు. 'మీకు శివుని దర్శనం ఎక్కడ? ' అని నవ్వి నంది తానే వారికి ఉపాయం చెప్పాడు. ఆ తరవాత విష్ణువు తాను రామావతారంలో రావణుని చంపుతానని హామీ ఇచ్చాడు. దేవతల అంశలు ఆయా వ్యక్తులలోనూ వానరులలోనూ ప్రవేశపెట్టి అతి ప్రయాస మీద వారు రావణుని చంపగలిగారు (స్కంద పురాణం.1-8) .

క్రతు విధానాలు ఆచరించేవారు మునులు ( హింసతోడి యజ్ఙయాగాలు, మంత్రాలు, దైనందిన జీవితంలో ఆచరించే కర్మకాండ. ఈ కర్మకాండ పురోహిత వ్యవస్థను పోషిస్తుంది. వర్ణధర్మాలను స్థిరపరుస్తుంది. ఎక్కువ తక్కువ కులాల ఏర్పాటుకు దారితీస్తుంది. క్రతువిధానాలను వ్యతిరేకించినవారు అసురులుగా, రాక్షసులుగా వర్ణించబడ్డారు ), ద్విజ వర్గాలు, దేవగణాలు. వీరు సురులు, సురాపానం చేస్తారు. క్రతు విధానాలు ఆచరించని వారూ, సురాపానం చేయని వారూ అసురులు. ఇది ఒకప్పటి సమాజ స్వరూపం. సురాసుర యుద్దాలు చాలా జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి. మానవ నాగరికతా పరిణామ క్రమంలో ఈ విధానాల వల్ల వర్గ తారతమ్యాలు, ఆధిపత్య కులాలు, సేవా (ధర్మ) కులాలూ ఏర్పడ్డాయి. వర్ణ వ్యవస్థ బలపడుతూ వచ్చింది. ఆ వ్యవస్థ మీద తిరుగుబాట్లూ వచ్చాయి. వాటిని అణచివేసే క్రమంలో కొన్ని వర్గాలకు మద్దతుగా బోలెడంత వాజ్ఞయం వెలిసింది. అలాంటి వాజ్ఞయంలో కౌసల్య కుమారుడైన శ్రీరాముని చరిత్ర 'రామాయణం' బాగా ప్రచారం పొందింది.

రాముని అవతార లక్ష్యం వెనుక అసలు కథేంటో ముందు చూద్దాం.

Comments

0 comments to "రామా ! కనవేమిరా? - II"

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com