తాటక పరాక్రమం, వైఖరీ చూసి చంపాలనిపించదట. లక్ష్మణుడితో అంటాడు ' స్త్రీ కావటం వల్ల ఆమెను చంపకుండా ముక్కూ చెవులూ కోసి పంపేద్దామనుకున్నాను కాని ఈమె పరాక్రమం, వైఖరీ చూసి చంపాలనిపిస్తోంది.' అనీ అన్నాడు [బా.కాం.26-10,11,12]. ఇదేం విచిత్రమైన కోరికో?! వనవాసిని, నిరాయుధురాలు అయిన స్త్రీపై క్షత్రియులు చేసిన దాడి ఇది. రాముడి బాణం గుండెల్లో గుచ్చుకుని తాటక నేలకొరిగింది.ఒక మహర్షి ప్రేరేపణతో శస్త్ర విద్యా పారంగతుడైన ఒక రాకుమారుడు చేసిన హత్య ఇది. రామలక్ష్మణుల సహాయంతో విశ్వామిత్రుడి యజ్ఙం దివ్యంగా ముగిసింది. ఆ తర్వాత జనకుడు చేస్తున్న యజ్ఙం చూడటానికి మిథిలకు ప్రయాణమయ్యారు.
అహల్య:
రామలక్ష్మణులను అహల్య ఆశ్రమం మీదుగా తీసుకువెళ్ళాడు విశ్వామిత్రుడు. భర్త గౌతముని శాపం చేత అహల్య మంచు కప్పిన చంద్ర కాంతి లాగా నీటిలో ప్రకాశిస్తున్న సూర్యకాంతి లాగా ఉన్నదట. అహల్యను రాయిలా అయిపొమ్మని శపించినట్టు కనబడదు. 'ఆహారం లేకుండా గాలి తింటూ తపస్సు చేస్తూ ఇతరులకెవ్వరికీ కబడకుండ వేల సంవత్సరాలు బూడిదలో పడి ఉండు ' అని శపిస్తాడు.
పురుషుల కామానికీ అత్యాచారానికి బలి అయిన స్త్రీ గా అహల్యను చెప్పుకోవాలి. అహల్యను బ్రహ్మ జగదేక సుందరిగా సృష్టించాడు. గౌతమునికి భార్యగా ఇచ్చాడు. ఒకప్పుడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంతో ఆమెను కలిశాడు. భర్త రూపంలో వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసే ఆమె అతనితో సంగమించిందని కొందరంటారు. గౌతముని వేషంలో వచ్చిన వాడు ఇంద్రుడని అహల్యకు తెలీదంటారు కొందరు. వచ్చినవాడు గౌతముడే అని ఆమె మోసపోయిందంటారు. రామాయణ కావ్య రచయిత మాత్రం యేమాత్రం బిడియం, సంకోచాలు లేకుండ అహల్య ఆలోచనల గురించి ఇలా రాస్తాడు. 'రాజులకు రాజు ఇంద్రుడు, సురులలో శ్రేష్టుడైనవాడితో (ఇంద్రుడు ఎంతటి శ్రేష్టుడో ఎవరికి తెలియదు) కలిసినందుకు సంతుష్టిగా వుంది, ఇంద్రా, తొందరగా వెళ్ళు ' అని ఇంద్రుడితో బరితెగించి సంగమించినట్టుగా కనబడుతుంది. 'గొప్ప ఊరువులగలదానా! నేను సైతం సంత్రుప్తి చెందాను, వెళ్తున్నాను ' అని చెప్పి ఇంద్రుడు కుటీరం దాటి బయటికొస్తాడు.[బా.కాం. 1-48-19,20,21,]
అహల్య బ్రహ్మ వరప్రసాదిని. అహల్య లాంటి ఒక ముని పత్ని శీలాన్ని యింత పలచన చేయటం రామాయణ కావ్య రచయుతకే చెల్లింది (దేవేంద్రుడే కోరి వస్తే శీలానికి విలువా లేదా?). పరపురుషుడి భార్యని, అదీ ఒక మహర్షి పత్నిని వాంఛించి కలిసినప్పుడు యే పాప పుణ్యాలూ, ధర్మాలూ అడ్డు రాలేదు ఇంద్రుడికి, ఎందుకంటే ఇంద్రుడు దేవగణానికి చెందినవాడు కాబట్టి. దేవలోకానికి అధిపతి. యేమైనా [ఇంద్రుడి గురించి ఎంత తక్కువ మట్లాడితే అంత మంచిది]. సీతా స్వయంవరంలో రాముడు విల్లుని ఎక్కుపెట్టగానే అది ఫెళ్ళున విరిగింది. సీతారామ వివాహంలో మంగళ సూత్ర ధారణ లేదు. మంత్రాలున్నాయి. అగ్నికి ప్రదక్షిణ చేయటం ఉంది. ఇది ఆర్య సంప్రదాయం. విశ్వామిత్రుడు ఉత్తర పర్వతాల దిశగా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. దశరథుడు సపరివారంగా తన రాజ్యానికి వెళ్తూ ఉంటే దారిలో పరశురాముడు ఎదురై తాను తెచ్చిన విష్ణుధనువు ఎక్కుపెట్టి చూపమన్నాడు. రాముడు ఆ విల్లు అందుకుని ఎక్కుపెట్టగానే పరశురాముడు తన ఓటమి ఒప్పుకున్నాడు.
శైవం మీద వైష్ణవం పై చేయిగా ఉండటం ఇక్కడ గమనించవలసిన అంశం.
బౌధ్ద, జైన, వైదిక, శైవ, వైష్ణవ ధర్మాలను పాటించేవారి మధ్య రేగిన ఘర్షణలూ క్షత్రియ బ్రాహ్మణ జాతుల/వర్ణాల మధ్యజరిగిన అధికార ప్రాబల్యపు అసూయాద్వేషాలూ ఇక్కడ సూచితమవుతాయి.
ఇక రాముడు అరణ్యవాసం చేయటానికి దండకకు బయలుదేరిన వేళావిశేషాలు చూద్దాం.
Thursday, March 27, 2008
Browse > Home /
రామా కనవేమిరా?
/ దేవేంద్రుడి కామానికి బలయిపోయిన స్త్రీ
Comments
6 comments to "దేవేంద్రుడి కామానికి బలయిపోయిన స్త్రీ"
March 28, 2008 at 11:20 AM
ఈ మధ్య మీ వ్యాసాలలో అసంబద్ధ ధోరణి కనిపిస్తోంది ! అహల్య కోరి సంగమించిందా లేదా అనే విషయం లో స్పష్టత లేదు అని మీరే అంటారు...మరి ముక్తాయింపులో మాత్రం అహల్య శీలాన్ని రామాయణం పలుచన చేసిందింది అంటారు! బ్రహ్మ వర ప్రసాదిని అయినంతమాత్రాన అరిషడ్వర్గాలకు ఎల్లవేళలా అతీతురాలయి ఉండగలరని చెప్పలేం కదా! బ్రహ్మ మానస పుత్రునికే అది సాధ్యం కాలేదు!! విషయం మనకి నచ్చినా నచ్చకపోయినా నిష్పాక్షికంగా తర్కించటం అవసరం.
దేవేంద్ర పదవిని పొందిన వాళ్ళల్లో ఎందరో అహంభావంతో ప్రవర్తించి భంగపడినట్లు మన వాజ్ఞయం చెప్తోంది. గోవర్ధనగిరి సన్నివేశం లొ ఎమి జరిదిందో మీకు తెలియనిది కాదే. మరి ఎల్లప్పుడూ దేవేంద్రునికి అనుకూలంగానే మన పురాణాలు ఉన్నయని ఎలా అంటారు? మన తర్కానికి అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రమే ఉదహరించటం న్యాయమా?
విష్ణుధనస్సును ఎక్కుపెట్టటానికీ శైవం మీద వైష్ణవం ఆధిపత్యం చెలాయించటానికీ ఉన్న సంబధం ఏమిటో అర్థం కాలేదు. మీరు ఏదైనా ముక్తాయించేటప్పుడు దానికి అధారంగా వివరణ ఇస్తే బావుంటుంది.
March 28, 2008 at 1:58 PM
తాటకి రాక్షస జాతి కి చెందిన స్త్రీ. వాలిని రాముడు చెట్టుచాటునుండి వధించాడు. అది న్యాయమే నని ఎందుకంటే వాలి జంతు జాతికి చెందినవాడని, జంతువులను చాటునుండి వధించడంలో తప్పులేదని పురాణాలు చెబుతున్నాయి. రాక్షసులు వారికి ఉండే మాయల చేత ఎన్నడు నిరాయుధులు కారు. వారి మాయే వారి ఆయుధం, అని నా అభిప్రాయం.
నిజమే! అహల్య, దేవేంద్రుని కామానికి బలయ్యింది. "ఇంద్ర" అనేది ఒక పదవి. మన పురాణాల్లో ఇంద్రుడు అనే అంటారు కానీ అతను ఏ ఇంద్రుడో చెప్పరు. అందరు ఇంద్రులూ చెడ్డవారేనా?
రాముడు సాక్షాత్తు విష్ణువు అవతారం, అలాంటి వాడికే కష్టాలు తప్పలేదు. అహల్య కేవలం మానవకాంత (బ్రహ్మ వర ప్రసాదిని అయినా కూడా). అహల్య కావాలని సంగమించిందా లేదా అనేదాన్ని పక్కనపెడితే, ఆ సంఘటన మాత్రం కేవలం ఆమే రాత. ఆ రాతను వ్రాసినవాడు ఆమెను పుట్టించిన ఆ బ్రహ్మే.
Title కి మరియు వ్యాసం చివరికి పొంతన లేదు, రచయిత వ్యాసం చివరకి వచ్చేసరికి విషయం మారిపోయినట్టనిపిస్తుంది.
March 31, 2008 at 5:15 PM
మీరు కరెక్ట్ గానే చెప్పారు, విషయాలు చాలా అసంబద్దంగా వున్నాయి. కానైతే ఒక సంగతి మీరు సరిచేసుకోవాలి. విషయాల్ని అసంబద్దంగా నేను రాయటం లేదు. అసంబద్దమైన విషయాల్ని నేను రాస్తున్నాను. అహల్య విషయమూ అదే. అహల్య రాతనే కాదు, సమాజం స్త్రీలపట్ల చూపిన వివక్షే రామాయణాది కావ్యాల్లో స్త్రీల రాతలన్నీ అలా వున్నాయి. అది మనం చేసుకున్న పాపమే
ఇకపోతే దేవేంద్రులవారి సంగతి. దేవగణాలంతటికీ అధిపతి కూర్చోవాల్సిన కుర్చీలో ఉచ్చనీచాలెరుగని వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టటంలో ఆంతర్యమేమిటి? ఇంద్రుడి పదవికి నీతి, నియమలూ , ధర్మాధర్మాలూ అఖ్కరలేదా? దేవగణాలకు తప్ప మిగతా వాళ్లకు మాత్రం ఈ డొంకతిరుగుడు పాఠాలెప్పుడూ చెబుతుంటారు. దేవతలకు మాత్రం మినహాయింపు ఎందుకు?
ఇక మీ ఆఖరి ప్రశ్నకు, నేను ముక్తాయింపుల్లోనే రాసే ఉద్దేశముంటే రామాయణాన్ని ఇంతగా చర్చించే అవసరమే లేదు, ముచ్చటగా మూడు టపాల్లోనే ముగించేవాణ్ణి. సాధారణంగా నా టపాల్లో ముక్తాయింపు వుంటే దాని వివరణ ముందు కాని తరువాత కాని వుంటుంది . ఇపుడూ అంతే.
April 1, 2008 at 2:28 PM
శ్రీధర్ గారూ, ఏ విషయంమీదైనా మన అభిప్రాయం తెలియజేయాలని అనుకున్నప్పుడు (పొగడటమైనా, తెగడటమైనా)మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా రెండు:
(1) మన వ్యక్తం చేసే అభిప్రాయానికి మద్దతుగా విశ్లేషణ/వివరణ అవసరం. ఇది లోపించినప్పుడు అభిప్రాయ వ్యక్తీకరణ కేవలం శాసన సభలో అధికార-ప్రతిపక్షాల సంవాదంలానే మిగిలిపోతుంది. ఆరోపణలు/ప్రత్యారోపణలు తప్ప ఆధారాలు మరుగున ఉండిపోతాయి. "ఇంద్రుని కామానికి బలి అయిపోయిన స్త్రీ అహల్య" అని మీ అభిప్రాయం. ఒక్క సారి మీ వ్యాసాన్ని ఆసాంతం చదవండి. ఎక్కడైన మీరు ఇందులో అహల్య తప్పు లేదు అని ఆధారాలు చూపారా? రామాయణం అహల్య శీలాన్ని అవమానించింది అన్నారే తప్ప, మీ వాదన ఎలా నిజమో చెప్పారా? అలాగే "విష్ణు ధనస్సు ఎక్కుపెట్టటానికీ, శైవం మీద వైష్ణవం ఆధిపత్యం చెలాయించటానికీ సంబంధం ఏమిటి" అన్న నా ప్రశ్నకు వివరణ ఇచ్చారా? కేవలం "నా టపాల్లో ముక్తాయింపు ముందు వివరణ ఉంటుంది" అని అన్నారు.
(2) మన అభిప్రాయాలు ధౄడంగా ఉండటంలో తప్పు లేదు, కాని మన అభిప్రాయాలు అన్నీ నిజమే అయితీరాలన్న నమ్మకం సరి కాదు. ఉదాహరణకి మీరు చెప్పే విషయాలకి అధారాలు చూపగలిగితే నా అభిప్రాయం తప్పు అని ఒప్పుకోవటానికి, మార్చుకోవటానికి, నేను సిద్ధంగానే ఉన్నాను. ఒక మంచి విశ్లేషణకి ఇది తప్పని సరి.
మీకో విషయం చెప్పాలి. నేను తరచుగా చూసే అతి తక్కువ బ్లాగులలో మీది ఒకటి. ప్రతి టపా కి మీరు తీసుకునే శ్రమ, ఇచ్చేవివరణ వల్లనే ఇది. ఆ అభిమానంతోనే ఇంత నిశితంగా విమర్శిస్తున్నాను. అన్యథా భావించవద్దు.
April 1, 2008 at 3:54 PM
కృతజ్నతలు. దేవతల రాజు దేవేంద్రుడి సెలక్షన్ విధానం గురించి నాకు ఐడియా లేదు. అతను ఇంద్రుడి గా సెలెక్ట్ అయ్యేటప్పటికే దుర్మార్గుడా లేక ఇంద్రుడిగా మారినతరువాత పదవీ గర్వంతో అలామారతారా, వాళ్ళకి ప్రమోషనే తప్ప డిమోషన్ లు ఉండవా లాంటి వాటి గురించి పురాణాల్లో ఎక్కడైనా ఉందా? అసలు ఇంద్రుడి పదవి మీదే ఒక బ్లాగు వ్రాయొచ్చేమో!
మన పురాణాలని కేవలం కల్పిత కావ్యాలు లేదా రచనలు గా మాత్రమే తీసుకుంటే స్త్రీ పాత్రలను ఆవిధంగా వ్రాయడం కేవలం సానుభూతి కోసం మాత్రమే అని నా అభిప్రాయం. మన సినిమాల్లో హీరో చెల్లినో/అక్కనో/తల్లినో విలన్ భయంకరంగా పీడించడం/రేప్ చేయడం లాటివన్ని ఆ హీరో మీద సానుభూతి కోసం మాత్రమే. అలాంటి వాటినే ప్రజలు ఆదరిస్తున్నారు ప్రత్యేకంగా ఇలాంటి సీన్ లన్ని ఆడవాళ్ళ లో ఒక రకమైన సానుభూతిని ఏర్పరుస్తాయి. బహుశా అప్పట్లో కూడా అదే ట్రెండ్ వుండేదేమో! అవే నేటి సినిమాల నాటి కావ్యాల సక్సెస్ ఫార్ములా. మన టి.వి సీరియల్/సినిమాల్లో ఆడ విలన్ లు కూడా ఆ ఫార్ములా ప్రభావమే.
చివరగా, రాముడుని అడవులకు పంపడానికి కారణం ఒక స్త్రీ కుట్రే కదా!
September 28, 2009 at 4:28 PM
If you have dare approve my previous comment and this comment.
Think twice man, how gods (in your view) can do mistakes and they doesn't know what is going to be happen. And how they are having desires like humans who are very tiny creatures in the view of GOD.Meaning of GOD is superior. Creator of everything. Which is created by god is a creature can't be god
Post a Comment