Wednesday, April 15, 2009

Berlyn to Tokyo | సాగర గర్భంలో సాహస యాత్ర | మత్సుదా

2 comments


మోడల్-9 కి చెందిన జలాంతర్గామి అది. చిక్కటి చీకటి. కింద అంతూ దరీలేని సాగరం. పైన పాలపుంతల వరకూ వ్యాపించిన ఆకాశం. అట్లాంటిక్ సాగర జలాల్లో ఆ జలాంతర్గామి ప్రయాణం ప్రారంభమై అప్పటికి చాలా రోజులైంది. జలాంతర్గామి నడిచేది బ్యాటరీమీదే అయినా, ప్రతిరోజు రాత్రి కొంత సేపు నీటి ఉపరితలానికి వచ్చి, డీజిల్ ఇంజన్ ఆన్ చేసి, ఆ సమయంలో తన బ్యాటరీలను రీచార్జ్ చేసుకోవాలి. సాగర గర్భంలో నిర్ణీత మార్గంలో ప్రయాణిస్తూ ముందుకు సాగాలి. ఆ రాత్రి ఎప్పటి మాదిరిగానే సముద్ర గర్భంలో ప్రయాణిస్తున్నపుడు సబ్ మెరైన్ రాడార్ నుంచి స్క్రీన్ మీదకి సంకేతాలు రాసాగాయి. 'శత్రువుల సరుకుల విమానం అది ' రాడార్ తెరముందు కూర్చున్న క్రూ మనిసి చెప్పాడు.

వెంటనే సిబ్బంది అంతా అలర్ట్ అయిపోయారు. హెడ్ క్వార్టర్స్ కి మెసేజ్ వెళ్లింది. అందరిలో ఉత్కంఠ పెరిగిపోయింది. 'మనం ఆ విమానాన్ని గుర్తించినట్టే మన ఉనికిని కూడా ఆ విమానం కనిపెట్టే అవకాశం ఉంది ' కెప్టెన్ కమాండర్ మ్యూసెంబర్గ్ గంభీరంగా వ్యాఖ్యానించాడు. వింటున్న అందరిలో టెన్షన్ రెట్టింపు అయింది. భయపడకండి. మనం ప్రస్తుతం సేఫ్ జోన్ లో వున్నాం. ఇప్పుడున్న డెప్త్ లో మన ఉనికిని ఎవరూ కనిపెట్టలేరు ' అండు కెప్టెన్. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హెడ్ క్వార్టర్స్ నుంచి నిముషం పూర్తి కాకుండానే జవాబు వచ్చింది - ఆ విమానాన్ని అటాక్ చెయ్యమని.

అప్పుడు జరిగింది పొరపాటు.రోజుల తరబడి నిద్రలేమితనం,టెన్షన్ వల్ల కావచ్చు. చాలా అనుభవం ఉన్న మనిషి కూడా ఒక్కోసారి క్షణకాలంలో చేసే పొరపాటే... ప్రాణాంతకమౌతుంది. డ్రైవింగ్ క్యాబిన్ లో ఉన్న మనిషి అరక్షణంలో గేరును తప్పుగా ఆపరేట్ చేశాడు... అది చాలా ఖరీదైన పొరపాటు...ఏం జరుగుతోందో తెలిసేలోగా సబ్ మెరైన్ పెద్ద శబ్దంతో... మెరుపు వేగంతో...సముద్ర ఉపరితలం మీదకి వచ్చేసింది. సిబ్బందికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక పైనున్న శత్రువు కార్గో ప్లేన్ కి తమ ఉనికి ఈ పాటికి తెలిసి పోయిఉండాలి. క్షణాలు గడుస్తున్నాయి. లాభం లేదు. ఇంజన్లేమో సిబ్బంది మాట వినడం లేదు.

'డైవ్ డౌన్ ... సబ్ మెరైన్ కిందకి మళ్ళించండి. క్విక్ ... శత్రువు...మనల్నే గమనిస్తున్నాడు.... క్విక్ డూఇట్ ఐసే...' అమాండర్ మ్యూసెంబర్గ్ హిస్టీరిక్ గా అరుస్తున్నాడు.
సిబ్బందికి అంత త్వరగా సబ్ మెరైన్ ని కిందకి దింపడం సాధ్యం కావడం లేదు. ఇంజన్లు స్పందించడం లేదు. ఇంతలోనే ప్రమాదసూచన కనిపించింది... పైనున్న కార్గో ప్లేన్ కదలికలో మార్పు వచ్చింది. కమాండర్ మ్యూసెంబర్గ్ కి ఏం జరగబోతోందో... అర్థమైంది.

'My god! enemy is descending. he will bombard our submarine.
Down , I say, D i v e down , quick '
.

విమానం ప్రమాదకరమైన స్థాయిలో కిందికి దిగింది. ఇంకా కొన్ని క్షణాలు చాలు. సబ్ మెరైన్ దారుణమైన ఎక్స్ ఫ్లోజర్ లో అట్లాంటిక్ సముద్ర జలాల్లో శకలాలుగా మారి కలిసిపోవడానికి... అంత రాత్రి చల్లటి వాతావరణంలో... మ్యూసెంబర్గ్ నుదుటినుంచి స్వేదం ప్రవహిస్తోంది... కొందరు క్రూ సిబ్బంది బిగ్గరగా రోదిస్తున్నారు. డ్రైవింగ్ క్యాబిన్ లో సిబ్బంది శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు. చెవులు చిల్లులు పడే శబ్దంతో కార్గో విమానం కిందకి దిగింది...

అయిపోయింది. అంతా ముగింపుకి వచ్చింది.
కమాండర్ మ్యూసెంబర్గ్ నిర్వేదంగా కళ్లు మూసుకున్నాడు.

అయితే యీ అత్యంత ప్రమాదకరమైన సన్నివేశంలో, మృత్యువు అతి చేరువగా వచ్చి దోబూచులాడుతోన్న వేళ ఒక ప్రయాణికుడు మాత్రం తనకేమీ పట్టనంత నిర్వేదంగా , ప్రశాంతంగా కూర్చుని వున్నాడు. అంత కల్లోల సమయంలో ఏమీ జరగనట్టు ఆయన తన కార్యదర్శికి నోట్సు డిక్టేట్ చేస్తున్నాడు.

అతడు మత్సుదా.

జర్మనీలో ఆయన పేరు 'ఒర్లాండో మజొట్టా ' అక్కడ ఇటాలియన్ రాయబారి అతడు.
అఫ్ఘన్ సరిహద్దుల్లో ప్రవేశిస్తున్నపుడు అతడొక కాబూలీ...
పెషావర్ ట్రైన్ లో తప్పించుకుంటున్నపుడు అతడిపేరు 'మహమ్మద్ జియా ఉద్దీన్ ' ఆ సమయంలో అతడొక మౌల్వీ ఆహార్యంలో ఉన్న ఇన్సూరెన్స్ ఏజంట్.

కలకత్తాలో అతడిపేరు 'సుభాస్ చంద్రబోసు ' .

ఆజాద్ హింద్ సైనిక శ్రేణులకి అతడు
ప్రియతమ విప్లవ నాయకుడు నేతాజీ .



బెర్లిన్ టు టోక్యో సాహసయాత్ర వివరంగా తరువాతి పోస్టులో

Comments

2 comments to "Berlyn to Tokyo | సాగర గర్భంలో సాహస యాత్ర | మత్సుదా"

మనోహర్ చెనికల said...
April 17, 2009 at 10:32 AM

that is subhash..
thanks for the info

Unknown said...
April 20, 2009 at 5:25 PM

Good Narration sridhar garu ... waiting for the next post ...

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com