Wednesday, April 8, 2009

సాగరగర్భంలో సుభాష్ సాహసయాత్ర - 1

0 comments

జాద్ హింద్ దళం తన శిక్షణా కార్యక్రమాలు చాలా సమర్థవంతంగా పూర్తి చేసుకొంది. దళంలో సంఖ్య 3,500 కు చేరగానే ఇంక క్రొత్తవారిని చేర్చుకోవడం ఆపేశారు. నేతాజీ స్థాపించిన రేడియో కార్యక్రమాలు కూడా సాఫీగా జరిగిపోతునాయి. నిర్దిష్ట సమయాలలో అనుకున్న ప్రకారం ఎలాంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా రేడియో కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. నేతాజీ ప్రమేయం లేకుండానే ఆ కార్యక్రమాలు చక్కగా నిర్వహించడానికి కావలసిన జట్టు నిర్మాణం అయింది. అది కూడా నేతాజీకి చాలా సంతోషాన్ని కల్గించింది. అయితే ఈ రేడియో కార్యక్రమాల నిర్వహణకంటే 3,500 మంది సభ్యులు గల దళాన్ని నిర్వహించే పని చాలా పెద్దపని. జర్మనీ అధికారుల సహాయ సహకారాలు అన్ని విధాల పొందుతూనే వారికి బంటుగా వ్యవహరించకుండా తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలి. ఇది చాలా సున్నితమైన విషయం. అయినా నేతాజీ ఈ విషయంలో బహు చాకచక్యంగా వ్యవహరించాడు. జర్మనీ వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్న ధోరణిలో ఎన్నడూ వ్యవహరించలేదు. తమది స్వతంత్రమైన సైన్యమనీ, స్వాతంత్ర్యాన్ని సాధించుటయే తమ ధ్యేయమనీ ఆయన ఎలుగెత్తి చాటేవాడు.

తాను చేపట్టిన ఆ రెండు కార్యక్రమాలు దారిన పడి సక్రమంగా పనిచేస్తూ ఉండటంతో నేతాజీ ఆలోచనలు మరో దిశకు పరుగెత్తాయి. ఆ కొద్దిపాటి సైన్యంతో భారతదేశంపైన దండయాత్ర జరిపి బ్రిటిషు వారిని పారద్రోలి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టగలమనే ధురభిమానం, అవాస్తవిక దృక్పథం నేతాజీకి ఎప్పుడూ లేవు. చుట్టుపట్ల జరుగుతున్న పరిస్థితులు జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించాడు. యుద్దం సాగుతున్న రీతి గమనించాడు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాడు. తన కార్యరంగాన్ని తూర్పు ఆసియాకు మరల్చాలని నిశ్చయించుకున్నాడు. తూర్పు ఆసియాకు చేరడం అన్నది యుద్దం ముమ్మరంగా సాగుతున్న ఆ రోజుల్లో అంత సులభంగా సాధ్యపడే విషయం కాదు. విమానం ద్వారా వెళ్ళాలన్నా, సముద్రం పైన ప్రయణం చేయాలన్నా - రెండూ ప్రమాద భరితలే. అయినా ప్రమాదాల్ని ఎదుర్కోవడం నేతాజీకి కొత్త కాదు.

అయితే ఇక్కడే ఒక చిక్కుంది. నేతాజీ తూర్పు ఆసియాలో తన కార్యక్రమాని నిర్విఘ్నంగా కొనసాగించాలంటే జపాన్ వారి అండదండలు లభించడం ఎంతో అవసరం. ఆ రోజుల్లో జపాన్ బర్మా తీరం వరకు విజయడంకా మ్రోగించి ముందుకు సాగిపోతోంది కాబట్టి జపాన్ సహాయం తీసుకోవడం తప్పనిసరి. ఆ సమయంలో జర్మనీలో జపాన్ రాయబారిగా ఉన్న ఓషిమా చాలా తెలివైన రాజకీయవేత్త. నేతాజీ జర్మనీలో చేస్తున్న పని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసిన వ్యక్తి. భారతదేశానికి దూరంగా ఎక్కడో జర్మనీలో ఉండి పనిచేయడంకంటే, భారతదేశానికి దగ్గరలో ఉంటే నేతాజీ ఇంకా సమర్థవంతంగా తన సర్వశక్తులను ఉపయోగించి పనిచేయగలడని, అందుకు తననుంచి సర్వ సహాయాలూ అందించగలనని వాగ్ధానం చేశాడు. ఓషిమా సహాయం చేస్తానని చెప్పినప్పటికి, ఆనాటి పరిస్థితులు ప్రయాణానికి అంత అనువైనవి కావు. అయితే అంత క్లిష్టపరిస్థితులలో కూడా ఇటలీ వారు కొందరు నేరుగా సింగపూర్ వరకు తమ విమానాల్లో ప్రయాణం చేసిన ఉదంతాలున్నాయి. కాబట్టి ఇటలీ వారి సహాయంతో విమానం మీద అయితే సింగపూర్ కు అతివేగంగా చేరుకోవచ్చని ఆలోచించి వారితో కూడా సంప్రదింపులు ప్రారంభించాడు నేతాజీ. అయితే విమాన ప్రయాణం మరింత ప్రమాదభరితం. శత్రువుల కనుసన్నలనుంచి తప్పించుకోవడం కష్టం.

జర్మన్ ప్రభుత్వం నేతాజీ కోరిన విధంగా ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్దంగానే ఉంది. జపాన్ ప్రభుత్వానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. జర్మన్ జలాంతర్గాములూ, జపాన్ జలాంతర్గాములూ తరచూ కలుసుకొంటూ తమకు పరస్పరం అవసరమైన సరుకులు మార్పిడి చేసుకొంటూనే ఉన్నాయి. అయితే నేతాజీని ఈ జలాంతర్గాములలో సింగపూర్ చేర్చడమంటే సరుకు రవాణా చేయడం వంటి సులభమైన విషయం కాదు. బ్రిటీష్ ఛానల్ దాటి రావడం అంటే ఎంతో ప్రమాదానికి తలపడి ప్రయాణం చేయడమే. సముద్ర గర్భంలో అనేక చోట్ల మందుగుండు మాటుపెట్టి వుంచుతారు బ్రిటీషువారు. కడు జాగ్రత్తతో ప్రయాణం చేస్తేనే గాని ప్రమాదాన్ని తప్పించుకొని బయటపడే వీలుండదు. ఏ మాత్రం ఆచూకి తెలిసినా శతృవులు వదిలిపెట్టరు. రెండు ప్రభుత్వాలు అతిరహస్యంగా సమాలోచనలు జరుపుకోవాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూలంకషంగా నావికా దళంతో చర్చించాలి. జలాంతర్గాములు ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఇంధనం సమకూర్చుకోవాలి, జర్మన్ జలాంతర్గాములు ఎక్కడవరకు రావాలి, జపాన్ వారు ఎక్కడ నేతాజీని అందుకోవాలి మొదలైన విషయాలు అన్నీ నిర్ణయింపబడాలి. అందుచేత ఉభయప్రభుత్వాలకు ఇష్టమే అయినా కొన్ని మాసాలు నేతాజీ వేచి ఉండాల్సి వచ్చింది. ఒకసారి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొన్నాడు. కాబట్టి ఏ మాత్రం సమయం వృధా కావడం నేతాజీకి ఇష్టం లేదు. శరీరం జర్మనీలో ఉందే కాని, మనస్సంతా తూర్పు ఆసియాలో తాను తలపెట్టిన కార్యంపైనే లగ్నమై ఉంది.


ఈ లోగా జపాన్ వారు బ్రిటీషు సైన్యాలను సింగపూర్ నుంచి తరిమివేయడమేగాక బర్మా వరకు ఆక్రమించుకుని కూర్చున్నారన్న వార్త అందింది. జపాన్ వారు ఖైదీలుగా పట్టుకొన్న భారతీయులలో చాలామంది భారత స్వాతంత్ర్య సమరానికి సన్నద్దంగా ఉన్నారన్న వార్త కూడా నేతాజీకి చేరింది. అలాంటి వారి నందరినీ రాస్ ఇహారీ బోస్ అధీనంలో ఉంచడం జరిగింది. కాని రాస్ బిహారీ బోస్ వృధ్ధాప్యంలో ఉన్నాడు. అప్పటికే జపాన్ లో 35 సంవత్సరాలుగా ఉన్నాడు. యుద్ద సైన్యాలన్ నడపగలిగిన శారీరక పటిమ ఆయనకు లేదు. నేతాజీ వండి శక్తివంతుడు వచ్చి ఆ బాధ్యత స్వీకరిస్తే బాగుండునని ఆయన కూడా ఎదురుచూస్తూ ఉన్నాడు.



సరిగ్గా యీ సమయంలోనే, చరిత్రలో ఒక మహాధ్యాయానికి తెరలేచి
ఒక చారిత్రాత్మక సంఘటనకు ముహూర్తం ఖరారయింది.

సాగరగర్భంలో సుభాష్ సాహసయాత్రకు అంకురార్పణ జరిగింది.

Comments

0 comments to "సాగరగర్భంలో సుభాష్ సాహసయాత్ర - 1"

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com