Monday, April 6, 2009

నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ - II

2 comments

Before this article


at-work-on-his-desk-in-berl

'ఒక వ్యక్తిజీవితంలో ఏ విధంగానైతే సువర్ణావకాశాలు అరుదుగా వస్తూంటాయో,ఒక దేశపు చరిత్రలో కూడా అంతే అరుదుగా అవి వస్తూంటాయి.ఆ అవకాశాన్ని జారవిడిచినట్లయితే అలాంటి అవకాశాలు కొన్ని దశాబ్దాల వరకు రావు. అలాంటి సువర్ణావకాశం ఇప్పుడు మన ముందుంది. మనం అది జారవిడుచుకోకూడదు. ఇది మన పవిత్ర కర్తవ్యం . . . ‘

జర్మనీ అధీనంలో వున్న భారత యుద్దఖైదీలనుద్దేశించి నేతాజీ అనర్గళ ప్రసంగం ఇలా సాగిపోతోంది.అందరూ మంత్రముగ్ధులయినట్టు వింటున్నారు.ఒక సైనికుడు మరొక సైనికుడితో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది.నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఒక్క రోజులో ,నరనరాన స్వాతంత్ర్య కాంక్షను నింపుకొన్న యువ సైనికులతో తయారవలేదు. అది ఎలా జరిగిందో చూద్దాం.

జర్మనీలో ఉన్న భారత యుద్ద ఖైదీలనందరినీ తమ దళంలో చేర్చుకోవాలనే కోర్కె నేతాజీకి లేదు. ఎంతవీలైతే అంత తక్కువ మందిని,చిత్తశుద్ది గల వారిని ఎంపిక చేసుకొని తన దళంలోనికి తీసుకోవాలనేది నేతాజీ ఆశయం. అందుచేతనే ఒక ఆం క్ష పెట్టాడు. ఎవరైనా సరే ఆజాద్ హింద్ ఫౌజ్ దళంలో చేరి శిక్షణ పొందవచ్చు వారికి బ్రిటిషు సైన్యంలో ఉన్న హోదా ఇవ్వడం మాత్రం జరగదు. వారు మళ్లీ మామూలు సైనికుడుగా జీవితం ప్రారంభించి తమ పరిశ్రమ ద్వారా,నేర్పు ద్వారా మాత్రమే పై పదవులు పొందవల్సి ఉంటుంది.ఈ నిబంధన పెట్టడంతో నాన్ కమాండ్ ఆఫీసర్లుగా ఉన్నవారు చాలామంది నేతాజీ దళంలో చేరకుండా ఆగిపోయారు.అయినా పట్టుదల గల కొందరు శిక్షణ పొందడానికే సిద్దపడ్డారు.నాలుగు మాసాల సమయంలో మూడువందల మంది శిక్షణ కోసం దళంలో చేరి ఫ్రాంకెన్ బర్గ్ చేరుకొన్నారు. మరో ఆరు మాసాలలో ఇంకో మూడు వందల మంది వచ్చి చేరారు.

ఇటలీలో భారతీయ యుద్ద ఖైదీల దురవస్థ.

visiting-cellular-jail

ఈలోగా ఇటలీలో యుద్ద ఖైదీలుగా ఉన్న భారతీయుల పరిస్థితి దయనీయంగా తయారైంది. లిబియాలో బ్రిటిష్ వారికి తోడుగా యుద్దం చేస్తూ పట్టుబడ్డ భారతీయ సైనికులను ఇటలీకి తరలించారు. యుద్దంలో గెలిచి మరొకరిని ఖైదీలుగా పట్టుకోవడమన్నది ఇటలీవారికి అంత అలవాటు అయిన విషయంకాదు. ఈసారి అయినా జర్మన్ల ప్రతిభ కారణంగానే బ్రిటిషు సైన్యం లిబియాలో ఓటమి చవిచూసింది. అయితే యుద్ద ఖైదీలుగా పట్టుబడ్డవారిని ఈటలీ అధీనంలో ఉంచారు. ఇటలీవారికి యుద్ద ఖైదీలను ఎలా చూడాలో తెలియదు. యుద్దభూమిలో ఎలాగూ యుద్దం చేయలేరు కాబట్టి తమ ప్రతాపమంతా ఖైదీలమీద చూపించనారంభించారు. వారికి ఆఖరికి మంచినీరు కుడా సరఫరా చేయలేని స్థితి కల్పించారు.ఖైదీలకు అందించే రేషన్ ను ఇటలీ సైనికులు కాజేస్తూ ఖైదీలను మాడ్చేవారు.స్వేఛ్ఛాభారత కేంద్రం ప్రతినిధులు ఇటలీ మిలిటరీ అధికారులతో సంప్రదింపులకు వచ్చినప్పుడు భారతీయ యుద్దఖైదీలు తమను జర్మనీకి తరలించవలసిందిగా మొరపెట్టుకొన్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే వారిని జర్మనీకి తరలించడం ప్రారంభమయింది. అప్పటికే ఆజాద్ హింద్ ఫౌజ్ శిక్షణా కేంద్రం కోనిగ్స్ బ్రుక్ కు తరలించడం జరిగింది. ఇటలీవారు పెట్టిన హింసలు తట్టుకోలేక నానా బాధలు పడిన ఆ ఖైదీలకు ఇక్కడి పరిస్థితి ఊరట కలిగించింది. నేతాజీ నెలకొల్పిన దళంలో చేరినవారు చక్కటి దుస్తులు ధరించి స్వేఛ్ఛగా తిరుగుతూ సరిపడిన ఆహారం భుజిస్తూ కష్టపడి శిక్షణ పొందడం చూచి వీరు ఆనందించారు కూడా. ఆ విధంగా ఇటలీనుంచి వచ్చి అక్కడ చేరిన భారత యుద్ద ఖైదీలు నేతాజీని చూడాలనీ, ఆయన చెప్పేది వినాలనీ కుతూహలంగా ఎదురుచూడసాగారు.

అనుకున్న ప్రకారం, అనుకున్న సమయానికి, నల్లని దుస్తులలో టోపీ పెట్టుకొని, తన దేశానికి చెందిన ఎక్కువ మంది సైనికులతో ఆ సుదూర ప్రాంతంలో మాట్లాడే అవకాశం దొరికినందుకు ముఖంపై సంతోష చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండగా మందహాసంతో సమావేశ స్థలానికి వచ్చాడు నేతాజీ. 'ఆజాద్ హింద్ జిందాబాద్ , ఇంక్విలాబ్ జిందాబాద్ , నేతాజీ జిందాబాద్ ' అనే నినాదాలు ఆకాశంలో మారుమ్రోగాయి. యుద్దఖైదీలు కూడా తమ కొంతు కలిపారు. దళంవారి జాతీయగీతాలు, తాము వ్రాసుకొన్న గీతాలు పాడటంతో సభా కార్యక్రమం ప్రారంభమయింది. 'హమే సుఖతో ఆజ్ భూల్ జానా పడేగా వతన్ కేలియే దుఃఖ్ ఉఠానా పడేగా ఆజాద్ హిందీయో ఉఠో కమర్ బాంధో వతన్ బులా రహాహై బచానా పడేగా (ఇప్పుడు సుఖాలన్నీ మర్చిపోయి దేశం కొరకు ఎంతటి కష్టాన్నైనా సహించడానికి సిద్దపడాలి. దేశం కొల్లగొట్టబడుతోంది. ఓ ఆజాద్ హింద్ బంధువులారా! భుజం భుజం కలిపి ముందుకు నడవండి. దేశం పిలుస్తోంది రక్షించడం మన విధి).

నేతాజీ లేచి నిలబడగానే సభలో సూదిపడినా వినపడేంత నిశ్చబ్దం ఏర్పడింది.చాలా సులువైన హిందూస్తానీ భాషలో ప్రసంగం నడిచింది. అక్కడ చేరిన వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు. అత్యధిక సంఖ్యాకులు ఇంకా దళంలో చేరనివారు.ఉద్యోగం పోతుందేమోనన్న భయం ఆవరించి ఉన్నవారు. వారి జీతాలు, పెన్షన్ రద్దు అవుతాయేమోనన్న భయంతో వున్నవారు. వారిలో ఎక్కువ మంది లాభం పొందడానికి సైనికులుగా చేరిన వారు, నేతాజీ వంటి జాతీయ నాయకుడి మాటలు వింటే ఈ లాభాలు పోగొట్టుకోవలసి వస్తుంది. తన వక్తృత్వ పటిమ, హేతుబద్దమైన వాదన వారిమీద ఎక్కువగా పని చేయవన్న సంగతి నేతాజీకి తెలుసు.వారి భావాలకు అనుగునంగా వారి కుటుంబాలకు కొద్దో గొప్పో ఆర్థిక సహాయం లభింపచేసే రీతిగా కొన్ని ప్రతిపాదనలు చేయగలిగినప్పుడు మాత్రమే ఆ మాటల ప్రభావం వారిపైన ఉంటుందన్న సంగతి ఆయంకు తెలుసు. అయితే ఒక బాధ్యత కలిగిన జాతీయ స్థాయి నాయకుడుగా జవాన్లను భర్తీ చేసుకొంటున్నప్పుడు బ్రిటిషు ఆఫీసర్లు చెప్పినట్లుగా కల్లబొల్లి కబుర్లు తాను చెప్పలేడు. నిజాన్ని మాత్రమే తాను వారి ముందుంచగలడు. నిజం చెప్పడమంటే మింగుడు పడని కఠిన సత్యం వారి ముందుంచడమే. తాను వెల్లడించే నిజాయితీ అన్ని విధాలా త్యాగాన్ని కోరుతుంది. త్యాగం అంటే కేవలం తనకు లభిస్తున్న జీతమే కాదు. కుటుంబానికి లభించే పెన్షన్ మాత్రమే కాదు. అవసరాన్ని బట్టి ప్రాణాలు సహితం త్యాగం చేయడానికి సిద్దంగా ముందుకు రావాలి. అయితే ఆ పోరాటంలో వారిని విజయలక్ష్మి వరిస్తే కేవలం వారి భవిష్యత్తే కాకుండా మానవజాతి భవిష్యత్తు బాగుపడుతుంది. తాను చెప్పే విషయాలు వారి హృదయాలను, అంతఃకరణను స్పందింపచేయాలి. అంటే తన నాయకత్వంపట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంచి, పరిపూర్ణ విధేయతతో సంపూర్ణ త్యాగభావనతో మాతృభూమి సేవకు బేషరతుగా అంకితం కావాలి.జీతపు రాళ్ళకోసం సైనికులుగా చేరినవారికి ఇంతటి మహోన్నతమైన ఆశయం అర్థం కావడం కష్టమే. నేతాజీ కూడా వారు వెంటనే ఒక నిర్ణయానికి రావాలని కోరుకోలేదు.బహు జాగ్రత్తగా ఆలోచించుకొన్న మీదటనే వారు ఒక నిర్ణయానికి రావాలని. అది స్థిరమైన నిర్ణయంగా ఉండాలని నేతాజీ కోరుకున్నాడు. దళంలో చేరడంలో గల కష్టనష్టాలు సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న తర్వాత చేరిన కొద్దిమంది మాత్రమే స్థిరంగా నిలువగలరని ఆయన భావన.

భారతదేశంలో సాగిన స్వాతంత్ర్యపోరాటాల చరిత్రను సింహావలోకనం చేస్తూ అనేక విషయాలు వారికి తెలియచేశాడు. మొదటి ప్రపంచయుద్దం, రెండో ప్రపంచ యుద్దం గూర్చి వివరాలు తెలియచేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యం కృంగిపోతున్నదని, భారదేశం నుంచి వారిని తరిమికొట్టడానికి అది అన్ని విధాలా తగిన సమయమని నొక్కి చెప్పాడు. విదేశీపాలన కారణంగా మాత్రమే భారదేశం అంత పేద దేశంగా మారిందని తెలియచేశాడు.

'ఒక వ్యక్తిజీవితంలో ఏ విధంగానైతే సువర్ణావకాశాలు అరుదుగా వస్తూంటాయో, ఒక దేశపు చరిత్రలో కూడా అంతే అరుదుగా అవి వస్తూంటాయి. ఆ అవకాశాన్ని జారవిడిచినట్లయితే అలాంటి అవకాశాలు కొన్ని దశాబ్దాల వరకు రావు. అలాంటి సువర్ణావకాశం ఇప్పుడు మన ముందుంది. మనం అది జారవిడుచుకోకూడదు. ఇది మన పవిత్ర కర్తవ్యం.ఈ కర్తవ్యనిర్వహణలో మనం ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించరాదు.మన కర్తవ్యాన్ని మనం పాటించనట్లైతే భావి తరాలకు పాపం చేసినవారమవుతాము.మనకు తగిలించబడిన శృంఖలాలుబంగారు సంకెళ్ళే కావచ్చు స్వేఛ్ఛను కోరుకొంటున్న పౌరులుగా ఆ సంకెళ్ళను తెగకొట్టుకోవలసిందే.భారతదేశానికి ఎంతో సేవ చేసినట్లు బ్రిటిసువారు ఎంతగానో ప్రచారం చేసుకొంటున్నారు.కాని వారు మన సర్వస్వం దోచుకొని మనను ఏ విధంగా పనికిరానివారుగా చేశారో ప్రపంచానికి తెలియజేలేదు. '

అంటో వారి హృదయలకు హత్తుకునేటట్లు ఉపన్యసించాడు.సభికులంగా మంత్రముగ్ధులై వింటున్నారు.ఒక సైనికుడు మరొక సైనికుడితో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది.అది వారి హృదయాలపై శాశ్వత ముద్ర వేసింది.

ఇంత నిర్దుష్టంగా కష్టాలను లెక్క చేయకుండా, ప్రమోషన్లు ఆశించకుండా, త్యాగమయ జీవితానికి ఇష్టపడి, తమ సర్వస్వాన్ని మాతృభూమి పాదాల చెంత అర్పించడానికి సిద్దంగా ఉన్నవారు మాత్రమే ముందుకు రావాలని పిలుపు ఇచ్చినా - ఒక సంవత్సర కాలంలోనే 3,500 మంది స్వేఛ్ఛా భారత సైనిక దళంలో చేరారు. అలా చేరిన వారికి వెంటనే యూనిఫారం, కిట్టూ సరఫరా చేసే వారు. చేరకుండా మిగిలిన ఖైదీలు క్యాంపులో అలాగే ఒకటి రెండు రోజులు ఉండిపోయేవారు.ఎవరినీ బలవంతపెట్టడమన్నది లేదు.అన్ని విధాలా ఇష్టపడిన వారిని మాత్రమే దళంలో చేర్చుకోవడం జరిగేది.

డిశంబరు 1942 నాటికి దళంలో చేర్చుకోవడం ప్రారంభించి సరిగ్గా ఒక సంవత్సరం గడిచింది. ఇప్పుడు అది మొదట ఏర్పడిన కొద్దిమందితో కూడిన చిన్న దళంకాదు; అన్ని హంగులూ సమకూర్చుకొన్న ఆజాద్ హింద్ ఫౌజ్.

11.in_azad

Comments

2 comments to "నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ - II"

మనోహర్ చెనికల said...
April 6, 2009 at 11:54 AM

చాలా రోజుల నుండి మీ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాం,

Unknown said...
April 7, 2009 at 12:26 PM

శ్రీధర్ గారు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను మీ పోస్ట్ కోసం ... చివరకు ఈ రోజు నా నిరీక్షణ ఫలించింది :). ధన్యవాదాలు ...

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com