Thursday, April 3, 2008

దండకలో రాముడు !

5 comments
సీతారామలక్ష్మణులు దండకకు పయనమయ్యారు.మఱ్ఱి పాలతో వెంట్రుకలు జడలు కట్టేటట్లు చేసుకుని గంగ దాటటానికి నావ ఎక్కారు. సీత గంగా నదికి అంజలి ఘటించి ఇలా అన్నది. 'దశరథ పుత్రుడైన రాముడు తండ్రి ఆజ్ఙ పూర్తి చేసుకుని క్షేమంగా అయోధ్యాపురికి తిరిగి వచ్చి రాజ్యపాలన చేస్తుండగా నిన్ను సేవిస్తాను. వేనవేలు గోవులనూ వస్త్రాలనూ అన్నాన్నీ బ్రాహ్మణులకు ఇస్తాను. ...వేనవేల కల్లు బిందెలతో, మాంసాహారంతో వ్రతాలతో నిన్ను పూజిస్తాను. నీ తీరంలో నివసించే దేవతలనూ క్షేత్రాలనూ సేవిస్తాను' [అయో.52-89].

ఇవి గ్రామ దేవతలకు మొక్కుకునే మొక్కుబడుల లాగానే ఉన్నాయి.

గంగను దాటి వారు గుహుని రాజ్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారు నాలుగు గొప్ప మృగాలను ఆహారం కోసం చంపారు. 'తేవత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహ మృశ్యం పృషతం మహా రురుం ఆదాయ మేధ్యం త్వరితం ఋభుక్షితౌ ' (వరాహం, మనుబోతు, దుప్పి, నల్లచారల దుప్పి).

[ఇక్కడ ఒకసారి మాంసభోజనం గురించి చూద్దాం. అతిథిగా వచ్చిన వేదవిదునికి గృహపతి మాంసంతో కూడిన భోజనాన్ని వడ్డించాలి. నివేదించిన మాంసం తినాలి అనేది నియమం. యజ్ఙాలలో ఆవులను ఎద్దులను బలి ఇవ్వటం గురించి ఋగ్వేదమూ-శతపధ బ్రాహ్మణమూ ఇతర బ్రాహ్మణాలూ చాలా సమాచారాం ఇస్తాయి. యజ్ఙంలో బలి ఇచ్చిన పశువు మాంసం ఎక్కువ వాటా బ్రాహ్మణులకే వెళ్ళేది. గోవు పవిత్రమైనది కాబట్టి గోమాంసం తినేవారు. పితృ దేవతలకు నెలనెలా పెట్టే మాసిక శ్రాద్దాలలో ప్రశస్త మాంసం వడ్డించాలని మనుధర్మ శాస్త్రం చెబుతోంది [3-123]. ద్విజులు తినదగిన, తినకూడని పశుమృగ పక్షి, మత్స్య మాంసాలను మనువు స్పష్టంగా చెప్పాడు. అయిదుగోళ్ళు కలవానిలో కొన్నింటిని వారు తినవచ్చునట. ప్రశస్తమైనవి వారికి పోగా ఇక మిగిలినవి కింది వర్ణాల వారు తినవలసి వచ్చేది. యజ్ఙం కోసం పశువును హింసించి హోమం చేసి తినటం దైవ విధానం. తన పొట్ట కోసం చంపి తినటం రాక్షస విధి ' అని మనువు చెప్పాడు[5-31]




యజ్ఙ హింసను అనుసరించని వారు రాక్షసులయ్యారా?].

ఆర్యులలో (లేక ఆర్య సంప్రదాయం పాటించేవాళ్ళలో) మధుపర్కం (పెరుగుతో కలిపిన తేనె) అందించటం ముఖ్యమైన ఆచారం. తేనె, పెరుగు/వెన్న కలిపిన పదార్థం లేక వాటికి తోడు బార్లీ (యవ) గింజలు కూడా కలుపుతారు. మధుపర్కానికి అంగంగా ఆవు/ఎద్దు అవి లేకపోతే మేక మాంసమైనా ఉండాలట. గృహసూత్రాల్లో ఈ విషయం ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. సంప్రోక్షణ చేసిన మాంసం తినవచ్చునని ధర్మశాస్త్రాలు చెప్పాయి. శ్రాద్ద భోజనానికి నియమింపబడిన విప్రుడు మాంసం తినకపోతే 21 జన్మలు పశువుగా పుడతాడట[మను. 5-35].

రాముడు లక్ష్మణుడు మాట్లాడుకునే సంధర్భంలో రాముడు కొన్ని భావాలతో సతమతమవుతాడు. 'రాజు జీవించే వున్నాడా? కైకతో సుఖంగా ఉన్నాడా? నేనొక్కడినే అయోధ్యను ఆక్రమించుకోగలను కాని అధర్మానికీ పరలోకానికి భయపడుతున్నాను - ధర్మార్థాలు వదలి కామాన్నే ప్రధానంగా ఎంచిన రాజు దశరథుని లాగా శీఘ్రంగా ఆపదలు పొందుతాడు'.

ఆ తర్వాత ఒకరోజు దశరథుడు మరణించాడు. కౌసల్య రోదిస్తూ 'పతివ్రతనైన నేనూ భర్త శరీరాన్ని ఆలింగనం చేసుకొని అగ్నిలో ప్రవేశిస్తాను ' అన్నది. 'సాహమద్యైవ... పతివ్రతా ఇదం శరీర మాలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనం' [అయో.66-12]. విధవలుగా ఉండటాన్ని నిరసించటం కూడా ఇందులో ఇమిడి ఉంది.

స్త్రీలు విధవలుగా బ్రతికి ఉంటే కోరికలకు దాసులై వంశగౌరవాన్ని మంట కలుపుతారేమో అనే భయంతో వారిని చంపేయటానికే సమాజం సిద్దపడింది.

Comments

5 comments to "దండకలో రాముడు !"

Siva said...
April 3, 2008 at 6:06 PM

ఈ సారి మీ టపాలో గట్టి ఆరోపణలే ఉన్నాయ్!

(1) మాంసాహారం: ఇంటకు ముందరికొన్ని టపాలలో కూడా మీరు ఈ అంశాన్ని స్పౄశించారు. కానీ ఇందులో మీ అసలు ఆక్షేపణ ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కొన్ని యుగాల క్రిందట విప్రులు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాంసాహారం భుజించేవారు అని మనకు అర్ధం అవుతున్న విషయం. ఇందులో తప్పు పట్టాల్సిన విషయమేముంది?

(2) గోవధ/జంతుబలి: యజ్ఞయాగాదులకు గోవధ/జంతుబలి చెసేవారు అప్పట్లో. గోవుని గోమాతగా పూజించే మన సంప్రదాయంలో ఇదెలా సమ్మతం అంటారు..అవునా? నిజమే నాకూ ఖండించాలనే ఉంది...ఎంత ఆలోచించినా ఇది ఎలా ఒప్పు అయిందో అర్ధం కావటం లేదు. చదువరులెవరైనా వివరణ ఇస్తే బావుణ్ణు. ఇంకోవిషయం..ఆది శంకరాచార్యులవారు కాశ్మీరంలో ఉద్దండ బౌద్ధ పండితులతో వాదించి వైదిక సంప్రదాయాన్ని పునఃప్రతిష్టించారు అంటారు కదా...అందులో ఇలాంటి వాదనలు ఉండే ఉండాలి కదా?? ఎవరైనా వివరాలు ఇవ్వగలరా??

(3)వర్ణ వివక్ష: కొంతవరకు నేను వివరణ ఇవ్వగలను. కాని ఇప్పుడు కాదు...ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఈ విషయం మీద టపాలు వ్రాస్తారు కదా...అప్పుడు తేల్చుకుందాం :-)

(4)సతీ సహగమనం: ఇది కూడా గట్టి ఆరోపణే! నా ఈ చిన్ని బుర్రకి ప్రస్తుతానికి ఏ విషయంపై వాదించే అవగాహన, పరిజ్ఞానం లేవు :-( విజ్ఞులెవరైనా వివరణ ఇవ్వగలరు.లేదా మళ్ళీ ఆది శంకరాచార్యులవారిని శరణువేడాలి :-)

ఇక ఈ ముఖ్యమైన విషయాలు కాక మీ టపాలో ఎప్పటిలానే అనవసరమైన వ్యాఖ్యలు చొప్పించారు. "గ్రామ దేవతలకు మొక్కుబడులలానే ఉన్నాయి" (కావచ్చు, అయితే తప్పేముంది?) "యజ్ఞ హింసను అనుసరించని వాళ్ళు రాక్షసులు అయ్యారా" (ఇలా అని రామాయణం ఎక్కడా చెప్పలేదే! యజ్ఞ కంటకులు అంటే రాక్షసులు యజ్ఞాలలో జరిగే హింసని చూసి భరించలేక, కేవలం ఆ మూగజీవాలమీద జాలితో ఆటంకాలు కల్పించేవారు అని అంటారా?)

ఇంతకుముందు చెప్పినట్లు మీ టపాలలో ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు లేకుంటే మీ బ్లాగు నిజంగా ఓ ఉత్తమమైన విమర్శగా ఉండిపోతుంది.

Anonymous said...
April 3, 2008 at 10:08 PM

good one

రానారె said...
April 4, 2008 at 12:27 AM

'పతివ్రతనైన నేనూ భర్త శరీరాన్ని ఆలింగనం చేసుకొని అగ్నిలో ప్రవేశిస్తాను' - ఇది ఫరవాలేదు.

'నీ భర్త శవాన్ని ఆలింగనం చేసుకొని అగ్నిలో ప్రవేశించి నువ్వు పతివ్రతవనిపించుకో, దూకు, కమాన్' - ఇది దారుణం.

Srinivas said...
April 5, 2008 at 12:10 AM

@రానారె

కొంచెం మారుద్దాం -
'నా భర్తను ప్రేమిస్తున్న నేనూ భర్త శరీరాన్ని ఆలింగనం చేసుకొని అగ్నిలో ప్రవేశిస్తాను' - ఇది ఫరవాలేదు.
'నేను పతివ్రతను కనుక నేనూ భర్త శరీరాన్ని ఆలింగనం చేసుకొని అగ్నిలో ప్రవేశిస్తాను' - దారుణం.

Venkataramana Nippani said...
May 28, 2016 at 8:21 PM

శివ గారి వ్యాఖ్యలపై,
1)యజ్ఞ, యాగాదులు ఆర్యుల సంస్కృతి నుండి వుధ్బవించినవి. ఆర్యులు సంచారజీవులు. ఒకవిధంగా ఖండద్రిమ్మరులు కాబట్టి వారి ఆస్తి పాస్తులన్నీ సొమ్ములే!(పశువులు) స్థిర వ్యవసాయం తెలియని ఆజ్ఞానులు కాబట్టి, సొమ్ములపైనా, వెటపైన ఆధారపడి బ్రతికేవారు చేసుకునే పూజా పురస్కారాలకు వారికి విరివిగా లభించే మధ్య మాంసాలను ఉపయోగించడంలో తప్పులేదు.
2)స్థల, కాల ప్రభావంతో ఆచార వ్యవహారాలు మారుతువుండడం సహజం. దిమ్మరులుగా తిరిగే ఆర్యులకు గోవు మాంసాన్నీచ్చే జంతువులాగే కనబడింది. ఎప్పుడైతే వ్యవసాయ ప్రాముఖ్యం పెరిగిందో తమకోసం కష్టపడే గోవు దైవం గా మరడంలో వింతయేముంది?

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com