Friday, April 4, 2008

రామాయణంలో చార్వాక(వేదబాహ్యుల) ప్రసక్తి-1

2 comments

రాముడిని తీసుకురావటానికి భరతుడు వెళ్ళినపుడు రాముడు అయోధ్య రాచవ్యవహారాలు, రాజనీతిని బోధిస్తాడు. ఏయే జాతుల సేవకులకు ఏయే పనులు చెప్పాలో, ఎలాంటి వారిని మంత్రులుగా నమ్మాలో, ఎవరిని పూజించాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మంత్రాలోచన చేయాలో అంతా వివరిస్తాడు(76 శ్లోకాలు). బ్రాహ్మణ పురోహితులను గౌరవించటం (వీరిని మాత్రమేనా?!) హోమానుష్ఠానాలు - ఇంకా పరోక్షంగా బౌద్ధ చార్వాకుల మీద విమర్శలూ ఉన్నాయి. వేద మార్గాన్ని ఖండిస్తూ ప్రత్యక్ష ప్రమాణాలనే ప్రధానంగా గ్రహించే పండితులు అనర్థాలు ఉపదేశిస్తారు. శుష్క వాదాలు చేస్తారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి (అయో. 100-38,39) .

స్త్రీల పట్ల వ్యవహారరీతి గురించి 'స్త్రీలకు అనుకూలంగా వ్యవహరించు - పర పురుషులు వారితో మాట్లాడకుండా శ్రధ్ధ తీసుకో - వారు చెప్పేదంతా నిజమని నమ్మకు - వారికి రహస్యాలు చెప్పకు ' అని చెబుతాడు. [అయో. 100-49]. సీత పట్ల రాముని వ్యవహారం ఇలాగే ఉంటుందా?!.

హిందూ కుటుంబంలో పుత్రుని ప్రాముఖ్యం పెరగటానికి రామాయణం బాగా తోడ్పడింది. ఇది 107 సర్గలో రామునికి భరతుడికి మధ్య జరిగిన సంభాషణ ద్వారా స్పష్టమవుతుంది.పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించే వాడు అని చెప్పింది రామాయణమే. నాకైతే మరెక్కడా ఈ విషయం కనిపించలేదు. 'పున్నామ్నో నరకా దస్సాత్పితరం త్రాయతే...[అయో. 107-12] ( నా వరకు తెలిసిన నరకాలివి : రౌరవ, సూకర, తప్తలోహ, మహజ్వాల, శబల, విమోహ, కృమి భక్ష్య, కృమీష, లాలాభక్ష్య, విశసన, అధోముఖ, కృమిపూయ, రుధిరాంధ, వైతరణి, కృచ్చ్ర, అసిపత్రవన, వహ్నిజ్వాల, సందంశ, శ్వభోజన, కాకోల, శాల్మలి. ఏ పనులు చేస్తే ఏ నరకంలో పడవలసి వస్తుందో వివరంగా చెప్పారు. చాలా వరకు వృత్తి పనుల పరంగా నిషేధించేవే. వేటగాళ్ళూ-గొర్రెల మందలను పెంచే వారూ వహ్నిజ్వాల నరకంలో నరకంలో పడతారట. కల్లు అమ్మే వారూ తేనె పట్టులు తీసేవారూ వైతరణి నరకంలో పడతారట. చాలా వరకు ఇలాగే వర్గీకరించారు. అందుకే వృత్తులను ఉన్నతవర్గాలు తీసుకోలేదన్నమాట.)

తండ్రి మాటను పక్కన పెట్టి రాజ్యాధికారాన్ని తీసుకోవచ్చని జాబాలి రామునికి చెబుతాడు. ఇక్కడ జాబాలి నోట పలికించినదంతా కూడా చార్వాకుల(వైదికాచారాలను ఖండించినవారు) ధోరణి సుస్పష్టంగా కనిపిస్తుంది. అప్పటికి వైదికాచారాలను, కర్మకాండనూ, యజ్ఙక్రతువిధానాలను నిరసించే ధోరణి బలపడుతోంది. అందుకే కర్మకాండను బలంగా ప్రచారం చేసే రామాయణం అవసరమైంది. చార్వాక మతాన్ని జాబాలి నోట చెప్పించి దాన్ని ఖండించటం రామాయణ లక్ష్యాలలో ఒకటి.

'ప్రత్యక్ష్యంగా ఉన్నదే వాస్తవం. పరోక్ష ఫలాల కోసం ప్రత్యక్ష ఫలాన్ని వదలి పెట్టకు. తండ్రి బీజమూ తల్లి శుక్లమూ రక్తమూ జీవి పుట్టుకకు కారణాలు- అవి కేవలం నిమిత్త మాత్రాలు. ప్రత్యక్ష లోకాన్ని విడిచి పరోక్ష లోకాన్ని గురించి చింతించటం అవివేకం. క్రతు కర్మలన్నీ ప్రజల్చేత దానాలు చేయించటానికి కల్పించినవే. ఇవన్నీ కల్పితమైన ఆచారాలు...పరలోకం అనేది లేదనుకో. కనిపించని దానిని వదిలిపెట్టు, కనిపించేదే సత్యం.'న నాస్తి పరమిత్యేవ కురు బుద్దిం...[అయో. 108-17]. అందరినీ అందరూ ఈ భూమ్మీదనుంచి వదలిపోతారు. నీవు యౌవనంలో ఉన్నావు. భోగభాగ్యాలు అనుభవించవలసిన తరుణమిది. సమస్తమైన జీవరాశులునాలుగు భూతాల సంయోగ వియోగం వల్ల ఏర్పడుతున్నవి. మరణానంతరం జీవరాసులన్నీ ఆయా చతుర్భూతాల్లో కలుతాయి. పుట్టిన ప్రతివారు ఎవరైనా మరణించక తప్పదు. మరణానంతరం ఏమున్నది. ఏమీలేదు. కనక బుద్దిమందుటైనవాడు దేహం ఉండగానే సుఖించాలి.

పితృకర్మ చేయమని భరతుని ఆదేశిస్తున్నావు. బాగు బాగు! శ్రాధ్ధంలో ఇక్కడ పెట్టిన ఆహారం చనిపోయిన వారికి ఎలా చేరుతుంది? దీక్ష వహించమని, యాగం చేయమని తపం చేయమని, దానం చేయమని నయవంచకులైన బ్రాహ్మణులు చెప్పిన మాటలివి. బుద్దిలేనివారు మాత్రమే ఈ భూమిలో ప్రత్యక్షమైనదాన్ని వదలుకొని, పరోక్షమైనదాన్ని నమ్ముకుంటారు. మబ్బు పట్టినంత మాత్రాన చెరువులో ఉన్న నీళ్ళను గట్టు కొట్టివేసి బయటకు పంపిస్తామా? ఓ రామచంద్రా! ఆత్మ లేదు. మోక్షం లేదు. స్వర్గం లేదు. కర్మ లేదు. కర్మఫలం అనుభవించేవారు లేరు. పాప పుణ్యాలు లేవు . భగవంతుడు లేడు. సన్యాసం, భస్మధారణ, వేదాధ్యయనం, అగ్ని నారాధించడం మొదల్యినవన్నీ బుద్ది , పౌసుషం, స్వయంశక్తి లేనివారికి ధాత సృజించాడని పరాన్న జీవులైన బ్రాహ్మణులు సృజించారు. కష్టాలను, దుఃఖాన్ని ప్రజ్ఙచేత సాధ్యమయినంతవరకు తగ్గించుకొని, దేహాన్ని పటిష్ఠం చేసుకోవడమే బుద్దిమంతుని లక్షణం. ఎందుకంటావా ఈ దేహం పతనమైపోతే మళ్ళీ తిరిగి రాదు …'. ఇలా సుదీర్ఘంగా సాగిపోతూ వుంటుంది. దానికి రాముడు ఖండన కూడా అంతకంటే సుదీర్ఘంగా వుంటుంది.

చార్వాక మతాన్ని జాబాలి నోట చెప్పించి దాన్ని ఖండించటం రామాయణ లక్ష్యాలలో ఒకటి.

ఇంతకూ అసలు చార్వాక మతం అంటే ఏమిటో చార్వాకులంటే ఎవరో, రామాయణంలో వాళ్ల మతానికి కాని , ధోరణికి కాని యింత ప్రాముఖ్యతనెందుకిచ్చిందో తర్వాతి టపాలో వివరంగా చూద్దాం.

Comments

2 comments to "రామాయణంలో చార్వాక(వేదబాహ్యుల) ప్రసక్తి-1"

Anonymous said...
April 6, 2008 at 6:26 AM

ఎప్పటిలాగే మీ ప్రస్థానం ప్రతిఅడుగు శబ్దప్రశస్తమయి ఉన్నది ..

ఇంతకీ జాబాలి ఎవరు ??

, said...
April 7, 2008 at 9:52 AM

కృతజ్ఙతలు. జాబాలి దశరథుని రాచపురోహితులలో ఒకడు. దశరథునికి ప్రీతిపాత్రుడు. భరతుడితో పాటు దండకకు వెళ్లి రాముడిని వెనక్కి తీసుకురావటానికి ఒప్పించలేక అయోధ్యకు తిరిగొచ్చి సరయీనది ఒడ్డున వున్న తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు.

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com