పూర్వ కాలంలో యజ్ఙమే ప్రధానంగా తయారైన మతంతో సకల జనం సంతుష్టి చెందలేదు. పశు సంపద ఇమ్మని యుద్దాలలో విజయం సమకూర్చమనీ నిత్యజీవిత భౌతిక అవసరాలు తీరడం కోసం యజ్ఞాలు చేసినవాళ్ళ మనస్సుల్లో ఇతర ప్రశ్నలనేకం తలెత్తాయి. ఈ ప్రపంచం ఎలా సృష్టి అయింది? దేవుళ్ళెవరు? మనిషిని ఎవరు సృష్టించారు? సృష్టికి మూలం యేది? లాంటి ప్రశ్నలు రేకెత్తాయి. తమలో తాము చర్చా సంవాదాలు జరుపుకుంటూ ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషించారు. ఆ ఆధ్యాత్మిక చింతనని వారి శిష్యులు కంఠోపాఠం చేశారు. రాయటానికి సౌకర్యాలు ఏర్పడ్డాక, వాటిని లిఖితరూపంలో భద్రపర్చారు.సృష్టికి మూలమేమిటి అనే ప్రశ్నకు మతంలో సమాధానముంది. ఆ సమాధానం 'దేవుడు' .
ఆ దేవుడికి మూలం ఏమిటి అనే ప్రశ్న వేయవద్దంటుంది మతం. దేవుడు స్వయంభువు కాబట్టి ఆ ప్రశ్న తప్పంటుంది. ఆ సమాధానం నచ్చక నాస్తికత్వం పుట్టుకొచ్చింది. యుగాయుగాలుగా మానవుడు ఈ సృష్టికి మూలమెవరు? అనే ప్రశ్న కోసం చేసిన అన్వేషణే తత్త్వశాస్త్రంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ తత్త్వశాస్త్రం రెండు శాఖలుగా చీలింది. భావవాదులుగా, భౌతికవాదులుగా. అప్పటి సమాజంలో ఆర్య సంప్రదాయాలన్నిటినీ నిరసించిన వారు భౌతికవాద శాఖలోకొస్తారు.. ఈ కోవకు చెందినవారు చార్వాకుడూ, మహావీరుడు, అజితకేశకంబలి, మఖ్ఖలిగోశాలుడు, పూరణుడు, కాత్యాయనుడు, బుద్దుడూ. వీళ్ళందరిలోకీ బుద్దుడే చరిత్రలో నిలిచిపోవడానికి గల కారణాలలో ఒకటి బుద్దుడు ఏ విషయం లోనూ 'అతి ' కి పోకుండా మితం పాటించడం. ప్రస్తుతం మన చర్చా విషయం చార్వాకులు కాబట్టి చార్వాక దర్శనం/మతం గురించి క్లుప్తంగా చూద్దాం.
భారతీయ దార్శనిక ఆలోచనా సముద్రంలో ఉవ్వెత్తున పైకి లేచి సమసిపోయిన మహా తరంగం చార్వాక మతం/దర్శనం. దీన్నే లోకాయత దర్శనం అని కూడా అంటారు. చార్వాకుడు చెప్పిన దర్శనం కావటం వల్ల దీన్ని చార్వాక దర్శనమన్నారు కొందరు. చారు+వాక్ = చార్వాక, అంటే చారు= సులభమైన లేక సరళమైన, మధురమైన; వాక్ = శబ్గం, మాటలు, అంటే మధురమైన మాటలు చెప్పే దర్శనమని కొంతమంది భావించారు. దేవతల గురువగు బృహస్పతి రాక్షసులమీద ఉండే ద్వేషంకొద్దీ వారమదరినీ ఇంద్రియ లోలురుగా చేయడానికై ఈ దర్శనాన్ని రాశాడని ఒక కథ ఉంది. అందుకే దాన్ని బార్హస్పత్య దర్శనం అని కూడా అంటారు. ఇప్పుడా గ్రంథం లభించటం లేదు. కాని బౌధ్ధ గ్రంధాల్లో ఈ విషయం ఉటంకిస్తారు. చార్వాకులని , పాషండులని, హౌతుకులని, నాస్తికులని, వితండవాదులని శుద్ద తార్కికులని , శుద్ద ప్రత్యక్షవాదులని, వేదబాహ్యులని పిలిచారు.
వీరి దర్శనం అసుర దర్శనమని భగవద్గీతలో ఉన్నది. దైవాసుర సంపద్విభాగ యోగంలో (16:7-8) చార్వాక మత ఖండన ఉన్నది. విష్ణుపురాణంలో (I-6:29-31) యజ్ఙయాగాది క్రతువులు చేయడం నిరర్థకమనే వాదన ఉన్నది. బౌద్ద గ్రంధాలన్నీ దాదాపు లోకాయత మత సిద్దాంతాలను పేర్కొంటాయి. బృహస్పతి సూత్రాలు, అర్థశాస్త్రం, కామశాస్త్రం, లోకాయత శాస్త్రం, ప్రబోధ చంద్రోదయం, తత్త్వోపప్లవసింహ మొదలైన గ్రంథాలు చార్వాక దర్శనానికి ఆధార గ్రంథాలు. చార్వాక దర్శనం ఒక ప్రత్యేకమైన దర్శనంగా అభివృద్ది చెందలేదు. అయినప్పటికినీ ఈ దర్శనాన్ని ప్రతివారూ పూర్వపక్షంగా పేర్కొన్నారు.
చార్వాకుల వాదం ఉంటుంది
'ఈ సమస్తమైన ప్రపంచంలో ఉన్నదంతా పంచభూతాత్మకం. అంటే భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం. ఈ అయిదు భూతాలు (భూతం అంటే చాలా పెద్దది) పరస్పరం ఒకదానితో ఒకటి ఎప్పుడూ పెనవేసుకొని ఒకదాన్ని మరొకటి పరిగ్రహించి, ఒకటి మరొకదానితో సంసర్గాన్ని కలిగి ఉంటాయి. మానవుడు భుజించిన ఆహారం శరీరంలోజీర్ణమై అనేకమైన ధాతువులుగా మారిపోతుంది. రక్తంగానూ, వీర్యంగాను, శ్లేష్మంగానూ, లాలాజలంగాను లోపల ఉంటుంది. బయట చర్మం, గోళ్ళు వెంట్రుకలుగా మారుతుంది. స్త్రీపురుషుల సంభోగం వల్ల మానవుడు కాని, తదితర ప్రాణులుకాని జన్మిస్తాయి. శరీరం ఆవిర్భవించడంతోపాటే, శరీరంలో ఉండే చైతన్యం కూడ శరీరంతోపాటే వస్తుంది. శరీరం నశించిపోగానే చైతన్యం కూడ నశిస్తుంది( భావవాదులు దీనికి భిన్నంగా చెబుతారు. చైతన్యం ముందు, పదార్థం తరువాత అని, చైతన్యం శాశ్వతం అనీ) . చార్వాకులు దేహమే ఆత్మ అని చెబుతారు. ఆత్మ లేదని అంగీకరించినవారికి భగవంతునితోని నిమిత్తం లేదు. '
ప్రత్యక్షమే ప్రమాణంగా అంగీకరించిన చార్వాకుల వాదం దేవుడి అస్తిత్వాన్ని తిరస్కరిస్తుంది. యే కాలంలో వున్న మానవుడికి అయినాకాని తెలిసేది భూతకాలం, వర్తమాన కాలం మాత్రమే. జరుగబోయేది యెవ్వరికీ తెలియదు. ఆత్మ లేనప్పుడు, శరీరం మరణానంతరం పిడికెడు బూడిదయై పోయినప్పుడు మోక్షం అనేది అర్థరహితమైన శబ్దం. తపస్సు, పూజ, నిరసన వ్రతం, ఉపోష్యాలు, శరీరాన్ని శుష్కింపచేస్తాయేకాని వాటివల్ల ఏమీ ఫలితముండదు. పుష్ఠినిచ్చే ఆహారాన్ని తిని సంతృపుతిగా జీవించాలేకాని ఈ శరీరాన్ని ఆకలిదప్పులతో బాధించకూడదు.
వేదమంతా కర్మకాండతో కూడిఉన్నది. అసలు వేదంలో ఉన్న విషయాలన్నీ అప్రమాణాలన్నారు చార్వాకులు. యజ్ఙం యేమంటుంది 'స్వర్గకామో యజేత వహ్నిః ' స్వర్గం కావాలనుకున్నవారు యజ్ఙయాగాది కర్మలు చేయాలి. చేస్తే పుణ్యం వస్తుంది. దద్వారా స్వర్గం లభిస్తుంది. యజ్ఙమంతా హింసతోను, పశుబలితోను కూడిఉన్నది. యజ్ఙంలో హింసించబడే యజ్ఙపశువు కూడ స్వర్గానికి పోతుందని వేదం చెబుతుంది. అట్లాంటప్పుడు యజ్ఙాన్ని చేసే వారు వారి తండ్రినో, సోదరుడినో, బంధువునో ఆహుతి చేసినట్లయితే వారు సరాసరి స్వర్గానికి పోయి సుఖించవచ్చుకదా. పురోహితశ్రేణి పరమ సోమరిపోతులు. వారి జీవనార్థం వారు కల్పించినటువంటి తంతే మరణించినవారికి ఏర్పాటుచేసే శ్రద్దామలి తంతు అంతా. మరణించిన వారి పేరిట చేసే అన్నదానం, పిండ పితృ యజ్ఙం ఇవన్నీ మానవ మూర్ఖత్వానికి, సంఘ నయవంచనకు నిదర్శనమన్నారు. మన తండ్రో, తల్లో సోదరుడో గ్రామాంతరం వెళ్ళారనుకొందాం. వారి పోషణార్థంగా ఇక్కడ మనం విందుభోజనం చేస్తే అది వరికి అందుతుందా? '.
ఈ విధంగా భగవంతుడు లేడని, ఆత్మ లేదని, వేదం పరమ నయవంచకుల గ్రంథమని, పాప పుణ్యాలు లేవని, స్వర్గ నరకాదులు లేవనీ చాటి చెప్పింది.
Comments
3 comments to "రామాయణంలో చార్వాక(వేదబాహ్యుల) ప్రసక్తి-2"
April 7, 2008 at 3:03 PM
చాలామంచి సమాచారం అందించారు. చార్వాకుల గురించే వచ్చిన మరో వ్యాసం లింకుని ఇస్తున్నాను వీలైతే చూడండి http://nuvvusetty.wordpress.com/2007/09/22/%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%95%e0%b0%a4%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82/
April 8, 2008 at 3:56 PM
(1) వినసొంపుగా ఉండే కొన్ని తర్కాలు కొంచెం ఆలోచించిచూస్తే భలే విడ్డూరంగా ఉంటాయి:
నాస్తికులు- "భగవంతుడున్నాడు అనే నమ్మకం మూర్ఖత్వం. ఉన్నాడనటానికి అధారం చూపించమనండి. అన్నిటికి మూలం భగవంతుడైతే మరి ఆయనికి మూలం ఎవరు? ఆది, అంతంలేనివాడు అని తప్పించుకోవాలని చూస్తారు ఈ మూర్ఖులు. అసలు ఈ జీవపరిణామం అంతా "laws of nature/physics" ప్రకారం జరిగింది. ఒకానొక singularity నుంచి big-bang theory ని అనుసరించి సౄష్టి జరిగింది."
వినటానికి బావుంది కదూ? మరి ఆ సదరు singularity ఎలా పుట్టుకొచ్చిందో ఎవరైనా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోగలరా? తొందరపడి "ఆది-అంతం" లేనిది అనేసేరు :-)
ఏతా వాతా తేలిందేమిటంటే నాస్తికవాదం కూడ నిరాధారమైనదని!
(2) గతించినవారికి శ్రద్ధాంజలి ఘటించటం, వారి జ్ఞాపకార్థం అన్నదానం చేయటం ఎలా తప్పవుతుంది? అది నిజంగా స్వర్గంలో ఉన్నవారికి చేరుతుందా లేదా అనే విషయం మనకనవసరం. అలా చేయటం ఒక చక్కని సంప్రదాయం కాదా? అలాంటప్పుడు "స్వర్గంలో ఉన్న మీవారికి ఈ ఫలం దక్కుతుంది" అని మభ్యపెట్టయినాసరే ఇలాంటి సంప్రదాయాన్ని సమజంలొ ప్రవేశపెట్టటం మంచిదేకదా?
(3) యజ్ఞాలలో జంతు బలి సమ్మతమైతే మనుషులనే బలి ఇవ్వటం ఎందుకు సమ్మతం కాదు అంటారు. మరి అలా అయితే ఇప్పుడు మాంసాహారులందర్నీ నరమాంస భక్షణ చెయ్యమందామా?
April 9, 2008 at 6:10 PM
మీరు చెప్పేది చూస్తుంటే, నాకు Da Vinci Code పుస్తకం మళ్ళీ చదివినట్టు ఉంది. ఇందులో నాకొక అనుమానం. అప్పట్లో మాంసాహారం తినటం తప్పు అని చూపించలేదు కదా.. మరి ఇప్పుడు ఎందుకు బ్రాహ్మణులు మాంసం ముట్టుకోరు ? జంతువులను చంపితే, పాపం అంటారు.. మరి యాగాలలో ఎలా జంతుబలి ??
Post a Comment