Friday, May 8, 2009

సాగరగర్భంలో సుభాష్ సాహసయాత్ర - II

8 comments

Contd from here

with abid hasan

ఫిబ్రవరి 9వ తేదీ చీకట్లు ముసురుకుంటున్నాయి. అబిద్ ను, నేతాజీని కమాండర్ మ్యూసెంబర్గ్ జలాంతర్గామి లోపలికి ఆహ్వానించాడు. ఇద్దరూ లోపలికి ప్రవేశించగానే తలుపులు మూసుకుపోయాయి. జలాంతర్గామి భారంగా తీరాన్ని విడిచింది. సమయం గడిచే కొద్దీ లోలోపలికి వెళ్లిపోతోంది. లోపలంతా కొత్త వాతావరణం.

దేహంలోనూ, రక్త ప్రసరణలోనూ వచ్చే మార్పులు. సహజమైన గాలి, వెలుతురు లేని స్థితి. ఇరుకు, ముతక, డీజిల్ వాసన. ఎక్కడ చూసినా బట్టలకి బెడ్డింగులకి , చివరికి తినే బ్రెడ్ లకి సైతం డీజిల్ వాసన.

నేతాజీ, అబిద్ హసన్ ఇద్దరూ మెల్లిగా అలవాటు పడుతున్నారు. అందరూ నడిచే దారి పక్కనే ఒక చిన్న ఖాళీలో నేతాజీ పడక ఏర్పాటు అయింది.మరొక చోట దారి పక్కనే ఖాళీలో అబిద్ హసన్ పడక ఏర్పాటైంది.ఆ గాలి ఆడని, గుడ్డి వెలుతురు గుయ్యారంలో,వారిద్దరూకొన్ని నెలలు గడపాలి.జలాంతర్గామిలో ప్రయాణం ప్రారంభమైన అర్వాతే హసన్ కి నేతాజీ చెప్పాడు తమ గమ్యమేమిటో.ఒక నూతన ప్రస్థానానికి తనను సహ పథికుడిగా నేతాజీ ఎంచుకున్నాడన్న పరవశపు గగుర్పాటు వలన అబిద్ కి అక్కడి వాతావరణమంతా మనోహరంగా కనిపించసాగింది. ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టాలు యాంటీ సబ్ మెరైన్ ఎక్స్ ప్లోజన్స్ కి అవకాశం. అదృష్టవశాత్తూ బోసు ఉన్న సబ్ మెరైన్ ఇటువంటి మందు పాతరలు ఎన్నిటినో తప్పించుకుంది. పేలుళ్ల శబ్దం, తీవ్రమైన కుదుపులు సబ్ మెరైన్ లోకి వినిపిస్తూనే ఉండేది.

with abid hasan

గుడ్ హోప్ అగ్రం సమీపంలో ఒక సంఘటన జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ ఉన్న బ్రిటిష్ నౌక ,సుభాష్ ప్రయాణించే జలాంతర్గామి కి తటస్థ పడింది. కొంత దూరం దాన్ని అనుసరించాక ఆదేశాలమేరకు దాన్ని పేల్చి వేశారు.ఆయిల్ ట్యాంకర్ పేలగానే ఆ సమీప ప్రాంతమంతా ఉపరితల జలాలమీద చమురు తెట్టెమాదిరిగా ప్రవహించింది. పేలుడు సందర్చంగా చెలరేగిన మంటలు చమురు తెట్టెకు అంటు కోవడంతో చాలా పెద్ద విస్తీర్ణంలో సముద్ర ఉపరితలం మీద పెద్దగా మంటలు రేగాయి. సముద్రానికి మంటలు చెలరేగి, బడబానల దృశ్యాన్ని తలపించింది ఆ సన్నివేశం. బోసు, ఆబిద్ అటువంటి దృశ్యాన్ని ఎన్నడూ చూడలేదు. జ్వాలల, నాల్కల మధ్య బోసు ఒక దృశ్యాన్ని చూశాడు.

కాలిపోతున్న ఆ బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ నౌకలో చిక్కుకున్న వ్యక్తులు హాహా కారాలు చేస్తున్నారు. అందులో తెల్లవాళ్లు,నల్లవాళ్లు ఉన్నారు.నౌక మునిగి పోతుంటే ఒక పొడవాటి దూలానికి వేలాడుతూ విలవిలలాడుతున్నారు వాళ్లు. జీవితం కోసం చివరి పోరాటం అది. కొద్ది సెకన్లలో వారి మరణం తప్పదనే అనిపించింది. అంతలో దృశ్యం మారింది.లైఫ్ బోట్లు వచ్చాయి. మునిగిపోతున్న పడవలోని సిబ్బంది ఆ లైఫ్ బోట్లలో ఎక్కారు. వాళ్ల ప్రాణాలు రక్షించబడ్డాయి. లైఫ్ బోట్లు స్పష్టంగా కనిపిస్తుంటే బోస్ చూశాడు. అందులో ఒక్క నల్ల మనిషి కూడా లేడు. నేతాజీ కళ్లలో నీళ్లు తిరిగాయి.

మెడగాస్కర్ దగ్గిర నిర్థారిత ప్రదేశం వచ్చింది. ఐ-29 మోడల్ జపాన్ సబ్ మెరైన్ అక్కడికి పదిగంటలు ముందుగా వచ్చి ఎదురుచూస్తోంది. సముద్రం అలలతో అల్లకల్లోలంగా ఉంది. సాంకేతిక కారణాల వలన రెండు జలాంతర్గాములు ఒకదానికొకటి దగ్గరకి రావడం సాధ్యం కాలేదు.కనీసం రేడియో సందేశాలను పంపుకుందామన్నా శత్రువులు పసిగట్టేస్తారన్న భయంతో ఆ పని చేయలేదు. రెండు జలాంతర్గాములు అనుకూలమైన స్థితి గురించి ఎదురుచూస్తూ, గంటలు గంటలు ఒకరి దృష్టి పథం నుంచీ మరొకరు తప్పి పోకుండా అక్కడే పది గంటలు కాలం వెచ్చించారు. చిట్టచివరికి జర్మన్ సబ్ మెరైన్ కమాండర్ విసిగి పోయాడు.

ఈ స్థితి ఎక్కువ కాలం కొనసాగితే ఇంధనం కొరత కారణంగా పెద్ద ముప్పు ఏర్పడే అవకాశం ఉండింది. సస్పెన్సుని బద్దలు కొట్టాలని నిర్ణయించకున్నాడు కమాండర్ మ్యూసెంబర్గ్. ఆయన ఆదేశాల మేరకు ఇద్దరు అనుభవజ్ఞులైన , సిబ్బంది ధైర్యంగా ఎగసి ఎగసి పడుతున్న సముద్రంలో దూకారు.

ప్రాణాంతకమైన సాహసం అది. ఆ ఇద్దరు జర్మన్లు ఈదుకుంటూ, ఒక తాడు కొసను చేతితో పట్టుకుని,ఒక రబ్బరు తెప్పను తీసుకుని ఆ నావికులిద్దరూ జర్మన్ సబ్ మెరైన్ ను చేరుకున్నారు. తాము తెచ్చిన తాడును ఈ సబ్ మెరైన్ కి కట్టేశారు. ఇప్పుడిక బోసు, ఆబిద్ ల వంతు.

భారమైన హృదయంతో , సిబ్బంది అందరి దగ్గర పేరు పేరునా అడిగి శలవు తీసుకున్నాడు బోసు.రెండు జలాంతర్గాముల మధ్య వున్నతాడును పట్టుకుని, రబ్బరు తెపమీద ఒక చోటినుంచి మరొక చోటికి వెళ్లాలి వారిద్దరూ.ఎగసి పడే కల్లోల తరంగాలు ఒక వైపు,ఆకలిగా తిరిగే షార్క్ చేపలు, పొంచిఉన్న శత్రువు. ఈ అపాయాలన్నిటినీ అధిగమించి, తాడు పట్టుకుని, రబ్బరు తెప్పమీద కూర్చుని,కొద్దికొద్దిగా కదులుతూ ఒక జలాంతర్గామి నుంచి మరొక జలాంతర్గామికి చేరడం అనే అసామాన్యమైన ఫీటును సాధించారు బోసు, ఆబిద్.

ఆ విధంగా సుభాష్ చంద్రబోసు తలపెట్టిన సాహస ప్రయాణం ఒక కొలిక్కి వచ్చింది.త్వరలోనే జపాను వాహనం బోసును తీసుకుని మెరుపువేగంతో రివ్వుమంటో సుమత్రా ద్వీపాలకు దగ్గర ప్రదేశానికి చేర్చింది.అక్కడి నుంచి వారు టోక్యో చేరారు. ప్రపంచ వ్యాప్తంగా నావికా చరిత్రలో సుభాష్ చేసిన ఈ బెర్లిన్ టు టోక్యో సాహస యాత్ర అనేక విధాల్గా చారిత్రాత్మకమైనదిగా, అద్భుతమైనదిగా కొనియాడబడింది. రెండవ ప్రపంచ యుద్దంలో శత్రు బలాలు, శత్రునౌకలు, బలగాలు మొహరించిన ప్రదేశాల నుంచి, దాటివచ్చి, వాతావరణం సైతం అననుకూలంగా ఉన్న స్థితిలో ఒక జలాంతర్గామి నుంచి,మరొక జలాంతర్గామిలోనికి మనుషులనే బదిలీ చేసిన యీ తరహా సంఘటన ఇదొక్కటే .ఖండాలను దాటి , మహాసముధ్రాలను దాటి మొత్తం 25,500కి.మీ దూరాన్ని ప్రయాణించినందుకు సుభాష్ బోసుకు 18వారాల సమయం పట్టింది.

ఇవాళ అదే పని చేయడానికి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం రీత్యా కొన్ని గంటల సమయమే సరిపోవాల్సి రావచ్చు. సబ్ మెరైన్ల దగ్గర్నుంచి, టైప్ మిషన్లదాకా దశాబ్దాల కాలంలో గుర్తుపట్టలేని మార్పులు ఎన్నో వచ్చాయి. అయితే, బోసు ఆయన సహచరుడు ప్రాణాలొడ్డి చేసిన యీ సాహసయాత్ర మాత్రం ప్రపంచ విప్లవాల చరిత్రలో ఏ నాటికీ అజరామరం.

Comments

8 comments to "సాగరగర్భంలో సుభాష్ సాహసయాత్ర - II"

Unknown said...
May 8, 2009 at 11:17 AM

Nijanga chaala sahasamaina yatra .... Desam kosam yevaru inta sahasam chestru ee rojullo ??? Hats off to Subhash Chandra Bose !!!!!

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...
May 11, 2009 at 12:00 PM

మీరు చాలా బాగా రాస్తున్నారు. వ్యాస పరంపర పూర్తయిన తర్వాత ఒక పి డి ఎఫ్ ఫైలు రూపంలో విడుదల చేస్తే బాగుంటుంది.

Anonymous said...
July 20, 2009 at 5:43 PM

nice sir, Miru chala manasu petti raastunnaru. I will comment on all posts soon. I am a history student form osmania university.

Sridhar said...
July 20, 2009 at 6:44 PM

Thank U.
Might be u are the first History student to comment ever.

Any way, some delay has occured due to some unavoidable situations in updating the blog.

Soon u will be finding with new and regular updates in this blog.


By the way, I dont understand the language of the blogs u follow.

Arun said...
August 13, 2009 at 12:33 PM

Install Add-Telugu widget button with ur blog, u can easily post ur articles on top Telugu social bookmarking sites & u get more visitors and traffic to ur blog.
Download from www.findindia.net

Nagini said...
October 3, 2009 at 2:57 AM

hello shridhar garu
good morning,im very very happy to read all u r information about sir.netaji,today my dream is completed,since 10years i was searching for how was he played a role in our freedom battle.thank you so much sir,u doing a priceless job,me and my mom are fans of u r blog,,keep posting sir
All the best
me telugu ammayi

సలక్షణ దీక్షిత ఘనపాఠి సన్నిధానం said...
March 21, 2010 at 5:51 PM

super

కెక్యూబ్ వర్మ said...
June 1, 2011 at 8:37 PM

Nice article.. continue sir...

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com