అసలే తాము సబ్ మెరైన్ లో విపత్కరమైన స్థితిలో చిక్కుకున్నారు.పైన మృత్యువులా వాలుతోన్న కార్గో విమానం ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని సంకట స్థితి. సిబ్బంది అదుపు తప్పినట్టు కనబడుతోన్న ఇంజన్లు.పైన కార్గో విమానం చేస్తోన్న శబ్దంతో చెవులు చిల్లులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకేం సంబంధం లేనట్టు ఆ హోరులో కూడా ఆయన గొంతు ఖంగుమంటోంది. తన శిష్యుడికి నోట్స్ డిక్టేట్ చేస్తున్నాడు. యీ దెబ్బతో అరికాలిమంట నెత్తికెక్కినట్టు జపాన్ నావికావిభాగం వాళ్లు కయ్యిమంటో లేచారు. మత్సుదా వొక సైనికేతరుడైన, ఒక సాధారణ వ్యక్తి అని, సైనిక జలాంతర్గాములలోనికి, అందునా ... యుద్ద సమయంలో ... ఒక సైనికేతరుడు ఎలా ప్రవేశిస్తాడని జపాన్ సైనికాధికారులు తిరకాసు వాదన లేవనెత్తారు. యీ తిక్క వాదనకి నాజీ అధికారి ఆడం వాన్ ట్రాట్ చిరాకు పడి,
'మత్సుదా సైనికేతరుడుకాడు. ఆయన భారతీయ విముక్తి సైన్యానికి సుప్రీం కమాండర్- ఇన్-ఛీఫ్ సుభాష్ చంద్ర బోస్ ' .
*
'... యీ రోజు నేను మరొకసారి ప్రమాదభరితమైన మార్గాన్ని ఎంచుకున్నాను. కానీ యీసారి అది ఇంటివైపు. ఈ రహదారి చిట్ట చివర్న ఏముందో నేను చూడలేక పోవచ్చు. ఒకవేళ నాకు అటువంటి ప్రమాదం ఏదైనా సంభవిస్తే...ఇక యీ జీవితంలో నేను నీకు ఎటువంటి వర్తమానమూ పంపలేకపోవచ్చు...'
గుండెల్ని పిండే యీ మాటలు సుభాష్ 1943ఫిబ్రవరి 8న తన అన్న శరత్ చంద్రబోసుకి రాసిన ఉత్తరంలోనివి. జర్మనీ తీర ప్రాంతంలోని పట్టణం కీల్ నుంచి సుభాష్ చంద్ర బోస్ తన ప్రమాదభరితమైన సాహసయాత్రను ప్రారంభించింది సరిగ్గా ఆ మర్నాడు - ఫిబ్రవరి9న.
శిరసు పైన భయావహంగా ఊగులాడుతున్న కత్తిలా , పసిరికలో దాగిన పాములా ఉంది, సుభాష్ తను ఎంచుకున్న అపరిచిత మార్గంలో ప్రమాదం వెన్నంటిలా పరుచుకుంది. ప్రమాదానికి వ్యాకులపడే వ్యక్తి కాడు సుభాష్. ఆ జలాంతర్గామి తన చివరి మజిలీ కావచ్చు, సాయుధ సమరం ద్వారా దేశ స్వాతంత్ర్యాన్ని సాధించాలన్న తన స్వప్నం సముద్ర అగాధ జలాల్లో శాశ్వతంగా సమాధి అయిపోవచ్చు. ఆ నిష్కామ యోగికి అందుకు ఎటువంటి చింతాలేదు. కీల్ తీరంలో జలాంతర్గామి తలుపులు మూసుకుపోయే ముందే సుభాష్ బోస్ తన చివరి బాధ్యతల్ని అప్పగించదలుచుకున్నాడు. గతంలో విదేశాల్లో ఉన్నపుడే సుభాష్ ఎమిలీ షంకెల్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆశయ పథంలో ఆమె సుభాష్ కు సహచరే. తాను జర్మనీ చేరుకున్న వెంటనే ఎమిలీ ని పిలిపించుకుని తన కార్యదర్శిగా నియమించుకున్నాడు.
సుభాష్ జర్మనీలో ఉన్నపుడే ఆ దంపతులకి ఒక పాప కూడా జన్మించింది.ఆమెకి 'అనిత ' అని పేరు పెట్టుకున్నారు. కీల్ తీరంలో వేచి ఉన్న జలాంతర్గామి తనను ఎన్నటికీ తిరిగిరాని తీరాలకు చేర్చే అవకాశం కూడా ఉన్నది కాబట్టే...యిక సుభాష్ భార్యను, కుమార్తెను, తన సోదరుడికి, కుటుంబానికి పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు.
'... నేనిక్కడే వివాహం చేసుకున్నాను, నాకొక కుమార్తె కుడా ఉంది. అన్నయ్యా! జీవితాంతం నన్ను అవ్యాజ్యమైన ప్రేమతో నువ్వు ఆదరించావు నువ్వు. ఒక వేళ నేనంటూ యీ లోకంలో లేని రోజు, నా భార్య పట్ల, నా కుమార్తె పట్ల కూడా అదే విధమైన ఆప్యాయతని చూపి ఆదరించగలవు ...'
అని శరత్ చంద్రబోసుకు రాసిన లేఖలో సుభాష్ పేర్కొన్నాడు. '... నేను అసంపూర్తిగా వదిలి వేసిన కర్తవ్యాన్ని, నా భార్య, కుమార్తె, విజయవంతంగా పూర్తి చేయగలరని... నా అంతిమ ప్రార్థన...' అని తాను రాసిన అక్షరాల మధ్య ఖాళీల్లో, ఒక సహచరుడిగా, ఒక తండ్రిగా, తన మనసులో నిండుగా, గాఢంగా తొణికిసలాడుతున్న ప్రేమనంతా నింపాడు సుభాష్. మహత్తర దేశ ప్రేమికుడిగా, సాహసిగా, నిష్కామయోగిగా, పోరాట యోధుడిగా ప్రేమించే మనిషిగా... సర్వ సంపూర్ణమైన వ్యక్తిత్వం సుభాష్ ది. తన కార్యదర్శి, జీవన సహచరి ఎమిలీ సహాయంతో, జర్మనీ నుంచి బయల్దేరే ముందే... తనకు సంబంధించిన రహస్య సమాచారాన్నంతా కాల్చేశాడు సుభాష్.
కీల్ నగరానికి సుభాష్ తోకలిసి వెళ్లేటప్పుడు అబిద్ కి తాను ఎక్కడికి వెళ్తున్నదీ తెలియదు.
నేతాజీ తనని ఒకటే ప్రశ్న అడిగాడు - '...అబిద్, ఒక ప్రమాదకరమైన బాధ్యత ఉంది. అందుకు నువ్వు క్షణక్షణం అపాయభరితమైన దూర ప్రయాణానికి సిద్దం కావల్సి ఉంది. ఆ ప్రయాణంలో ప్రాణాపాయం కూడా సంభంచించవచ్చు... సిద్దమేనా?'
'నేతాజీ! , లంఘిస్తున్న వ్యాఘ్రం మన ఆజాద్ హింద్ సైనికుల చిహ్నం. ఏ క్షణాన మీ హస్తాలతో మన బ్యాడ్జిని నా యూనిఫారానికి అలంకరించారో... ఆ క్షణమే నా జీవితం, నా సర్వస్వమూ... మన ఆశయసిద్దికి అంకితం చేశాను. ఆజ్ఞాపించండి'.
నేతాజీ అబిద్ భుజం తట్టి ‘నాకు తెలుసు 'అన్నాడు.
ఫిబ్రవరి 9వ తేదీ అసురసంధ్యవేళ, చీకట్లు ముసురుకుంటున్నాయి. అబిద్ ను, నేతాజీని కమాండర్ మ్యూసెంబర్గ్ జలాంతర్గామి లోపలికి ఆహ్వానించాడు.ఇద్దరూ లోపలికి ప్రవేశించగానే,నెమ్మదిగా తలుపులు మూసుకుపోయాయి.
జలాంతర్గామి భారంగా తీరాన్ని విడిచింది.
Comments
6 comments to "నేతాజీ కుటుంబ వివరాలు"
May 2, 2009 at 2:31 AM
ఇప్పటివరకు మనదెశం ప్రొడుస్ చెసిన అసలయిన హిరో సుబాష్ చంద్రబొస్. అలాంటి విశిష్ట వ్యక్తి గురించి ఇంత ఆసక్తికరం గా మాకు సమచారం అందిస్తున్నందుకు మీకు మా దన్యవాదాలు.
May 2, 2009 at 11:05 AM
dhanyavaadaalu oka karmayogi jeevitaanni amdistunnamduku
May 2, 2009 at 11:32 AM
మనలో అణువణువునా నిరంతరం పోరాట స్ఫూర్తి రగిలించగల అగ్నిశిఖ నేతాజీ. అయన గురించి ఇంత వివరంగా, ఇంత రసస్ఫోరకంగా అందిస్తున్నందుకు కృతఙ్ఞతలు.
May 4, 2009 at 1:23 PM
Yeppatilaane ... superb !!!!
May 14, 2010 at 6:54 PM
subhash chandrabose gurinchi eppatinundo chadavaalanukunnanu. .. kaanee dorikina samaachaaram antagaa chadivinchaleka poyindi.
Nijamgaa meeru andistunna samaachaaram chaalaaa baagundi. viluvainadigaa undi. Dhanyavaadaalu.
Maro naluguriki mee blog gurinchi cheppanu.
June 18, 2013 at 4:34 PM
DHANYAVADALU
Post a Comment