Saturday, February 16, 2008

రామాయణానికి బాక్ డ్రాప్ లో అసలేం జరిగింది - 2

8 comments
ఈ టపాలో అనార్యులైన యక్ష,రాక్షస,అసుర,నాగ,ద్రావిడుల గురించి చూద్దాం. యే పురాణాలు తిరగేసినా యీ గణాలు కనబడతాయి కాబట్టి రామాయణంలోని అసలు కథలోకి వెళ్ళేముందు కొద్దిగా ఓపిక చేసుకుని ఈ టపా పూర్తిగా చదవండి.

ఆంధ్రులు :

భారతదేశంలో అతి ప్రాచీన జాతుల్లో ఆంధ్రులొకరు. మధ్యఆసియాలోని వాతావరణ మార్పుల వల్ల దశల వారీగా భారతదేశానికి వచ్చిన వారిలో నదీతీరువెంబడి దక్షిణానికి వచ్చిన వారు ఆయా ప్రాంతాలలో స్థిరపడి అక్కడి దేశభాషలను బట్టి ఆంధ్రులయ్యారట. వారు అప్పటికి అక్కడ వున్న స్థానిక జాతులతో ముఖ్యంగా తెలుగులతో ఘర్షణ పడ్డారనీ తర్వాత వారితో సామరస్యంగా సంబంధ బాంధవ్యాలు పెంచుకొన్నారనీ చరిత్ర చెబుతున్నది. దక్షిణాదికి మహా ప్రస్థానం సాగించిన ఆంధ్రులకు స్థానిక అనార్య తెగల్తో ముఖ్యంగా తెలుగులతో ఘర్షణ సంభవించింది. మొదట్లో రాక్షసులు తర్వాత నాగులుగా వ్యవహరించబడ్డ స్థానికులతో ఆంధ్రులు ఆదిలో కొంత ఘర్షణ పడ్డా త్వరలోనే వారితో సామరస్యాన్ని పెంపొందించుకుని కృష్ణా గోదావరీ మధ్య ప్రాంతంలో తమ రాజకీయ ప్రాబల్యాన్ని సుస్థిరం చేసుకొన్నారు. దీనితో ఆంధ్రులు ఆర్య వాజ్ఙయంలో అనార్య జాతులలో చేర్చబడ్డారు. దక్షిణ దేశనికి తరలి వచ్చిన ఆంధ్రులలో కొందరు, వింధ్య పర్వతాలకు దక్షిణాన, అనగా నేటి హైద్రాబాద్ రాష్ట్రపు ఉత్తర సరిహద్దులో స్థిరపడగా, మరికొందరు తూర్పు కనుమల వెంబడి క్రిందికి దిగి, ఒరిస్సా మీదుగా కళింగదేశం చేరుకున్నారు. మహానది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది కనుక ఒరిస్సా మీదుగా ఆంధ్రులలో ఒక శాఖ క్రిందికి దిగివచ్చారని స్పష్టం అవుతుంది. వీరే కాళింగులు. ఆంధ్రులను, కాళింగులను ఒలే తెగలోని రెండు శాఖలుగా ప్రస్తావించుతూ వచ్చాయి.

ఒక్కొక్కసారి ఈ రెండు పదాలు పర్యాయపదాలుగా కూడ వాడబడినవి. మహాభారత రామాయణాది ఇతిహాస కావ్యాల్లో, పురాణాలలోను, బౌద్ద జాతక కథలలోను ఆంధ్రులకు సంబంధించిన గాథలు అనేకమున్నాయి. కురు పాండవ యుద్దంలో ఆంధ్రులు, కాళింగులు కౌరవుల పక్షాన పోరాడారు. ధర్మజుని రాజసూయ యాగ సందర్భంలో సహదేవుడు పాండ్య, ద్రవిడ, ఓఢ్ర,కేరళ, ఆంధ్ర, రాజ్యాలను జయించాడు. శ్రీకృష్ణుడు మధురా నగరం వచ్చినప్పుడు, కంసునిచే ప్రేరితుడై, కరూశరాజైన చాణూరుడను జగజెట్టి, కృష్ణునితో మల్లయుద్దం చేసి చనిపోయినాడు. ఈ చాణూరుడు ఆంధ్రుడని హరివంశపురాణం తెలియజేస్తున్నది. కరూశదేశం వింధ్య పర్వతానికుత్తరాన యమునా నదీ తీరంలో ఉంది. రామాయణంలో మరొక గాథ ఉంది. విశ్వామిత్రుడు నరమేధయాగాన్ని నివారించి, యజ్ఙపశువైన శునశ్శేపుని విడిపించి అతనిని దత్త పుత్రునిగా స్వీకరించగా, అందుకు ఇష్టపడని విశ్వామిత్ర సంతతి తండ్రిచే శపించబడి, తూర్పుగాను, దక్షిణంగానూ తరలిపోయినారు. వీరే ఆంధ్రులని పై గాథ తెలియజేస్తున్నది. యమునా తీరంలో మిడతలదండువల్ల పంటలు నాశనమై కాటకం ఏర్పడినపుడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు 300 మైళ్లు దక్షిణంగా కదలిపోయారని చాందోగ్యోపనిషత్తు తెలియజేస్తున్నది. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రులు వింధ్యకు దక్షిణ ప్రాంతంలో, పుండ్రపుళింద శబర మూతిబులతో కలిసి జీవిస్తున్నట్లు వర్ణించబడ్డారు. చాందోగ్యోపనిషత్తు, ఐతరేయ బ్రాహ్మణములు క్రీ.పూ. 1000 రచింపబడ్డాయి.

ద్రావిడులు:
ఆర్యుల రాక పూర్వం నుండి భారతదేశంలో నివసించిన ప్రజల్ని ఋగ్వేదం, ‘దాసులు’ లేదా ‘దస్యులు’ అని వర్ణించింది. ఆర్యులు మొదట యీ దేశంలో ప్రవేశించినపుడు భూమి కోసం యూ దస్యులతో పోరాడాల్సి వచ్చింది. వీళ్లు ‘నల్లనివాళ్లనీ’ ఆర్యులు వర్ణించారు. ఆర్యులు ఆరాధించిన దేవతల్ని దస్యులు ఆరాధించలేదు. పైగా ఆర్యులు మాట్లాడే భాష అర్థం కాలేదు. ఆర్యులు సంస్కృతం మాట్లాడేవారు. ద్రావిడులు తెలుగువారు. తెలుగు, తమిళ కన్నడ భాషలు ఒకే ద్రావిడ కుటుంబం నుంచి ఆవిర్భవించినవి. తెలుగు ప్రజల నివాసస్థలం మొదట రాయలసీమ. పిమ్మట తెలంగాణా. తెలుగు క్రమంగా తెలుగైందట. అందులో నుండే తెలగాలు, తెలంగాణా, తెలగాణ్యులు (బ్రాహ్మణులలో ఒక శాఖ) తెలిరిగిరి మొదలయిన పేర్లు ఏర్పడ్డాయి.

బర్మాలోని తైలాంగ్ ప్రజలు ప్రాచీన తెలుగు జాతికి చెందిన వారని కూడా కొందరు ఊహిస్తున్నారు. తెనుగు అను మాటకు దక్షిణ దిక్కుగా తిరుగువారు లేక ప్రయాణం చేయువారు అని అర్థం. ‘తెన్’- దక్షిణ దిక్కు, అని తమిళ, కన్నడ భాషలో అర్థం. తెలంగాణలో డోర్నకల్, బీగంపేట, మౌలాలి, మధిర, చింతకాని ప్రాంతాలలో అతి ప్రాచీన సమాధులు కొన్ని బయటపడ్డాయి. ఆంధ్రులు దక్షిణ దేశానికి రాకముందే ద్రావిడ కుటుంబానికి చెందిన తెలుగు ప్రజలు తెలంగాణా ప్రాంతంలో నివసిస్తుండేవారని, వారి నాగరికత హరప్పా మొహంజదారో నాగరికత వలెనే వ్యవసాయం, ఇనుప పనిముట్లు కలిగి నగరాలను సైతం నిర్మించిన వ్యవస్థ అని బళ్ళారి జిల్లాలో ఈ మధ్యనే బయల్పడిన లోహయుగానికి చెందిన పనిముట్ల ద్వారా స్పష్టమవుతుంది. రామాయణంలో వర్ణింపబడిన దండకారణ్యము, జనస్థానము, ఖరదూషణాదుల నివాస స్థలము, దక్కను పీటభూమి, దక్కను పీట భూమిలో భాగమైన తెలంగాణా అత్యంత ప్రాచీనమైన ద్రావిడ నాగరికతకు నిలయమని రూడిగా చెప్పవచ్చు.

నాగులు:
బౌద్ద జాతక కథలు కృష్ణా, గోదావరీ ప్రాంతాన్ని వజ్రదేశమని, నాగభూమియని, మంజీరదేశమని వర్ణించాయి. యీ ప్రాంతంలో నాగజాతి ప్రజలు నివసించేవారు. పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి కద్రువ వల్ల కలిగిన సంతానం నాగులు. వినత వల్ల కలిగిన సంతానం గరుడుడు.డా. అంబేడ్కర్ 'రచనలు-ప్రసంగాలు ' 7వ సంపుటిలో ఇలా వివరిస్తాడు. ‘నాగులు ఆర్యులు కారు. సాంస్కృతికంగా ఉన్నత స్థాయికి చెందిన వారు. ఆదిమ జాతులు విస్తారమైన ప్రాంతాన్ని పాలించారు. క్రీ.శ. తొలి శతాబ్దాలలో ఆంధ్ర దేశమూ దాని పరిసర ప్రాంతాలు నాగుల ఏలుబడిలో ఉండేవి. స్కందనాగుడు బళ్ళారి ప్రాంతాని పాలించాడు. దక్షిణాది వారిని ప్రత్యేకంగా ద్రావిడులని అన్నందున నాగులు ద్రావిడులు వేరనుకోరాదు. ఒకే ప్రజకు అవి రెండు పేర్లు మాత్రమే. 'నాగ ' అనేది జాతి పరమైన పేరు. ద్రావిడ అనేది భాషా పరమైన పేరు’(P.283) భారతదేశంలో వాయవ్యాన తక్షశిల మొదలు ఈశాన్యాన అస్సాం వరకు దక్షిణాదిన సిలోన్ వరకు నాగజాతి వారున్నారు. వీరి చిహ్నం సర్పం. ఇండోఆర్యన్ భాషలోని 'దాహక ' అనే పదానికి 'దాస ' అనేది సంస్కృతీకరణ. కాలక్రమంలో 'దాస ' అనేదే నాగులను సూచించే పదం అయింది. దాసులు నాగులు ఒకరే. నాగులు రాజు పేరు 'దాహక '. పురాణాల్లో. వంశక్షయం నాగులకు తల్లి వల్ల కలిగిన శాపం కాగా రాక్షసత్వం తండ్రి వల్ల కలిగిందట. నాగులు నిశాచరులూ రాక్షస ధర్మావలంబులూ అయ్యారు (కశ్యపుడు శపించటం వల్ల). మునుల శాపం వల్ల మానవులు సర్పాలుగా అవటమూ ఉంది. సహుషుడనే రాజు అలానే అయ్యాడు అగస్త్యశాపం వల్ల. నాగులను మునులు ద్వేషించారు. మహాభారతంలోని ఉదంకోపాఖ్యానం ఇందుకు ఉదాహరణ.

నాగులు యజ్ఙ హింసకు విరోధులు. ఆర్యులు భారతదేశానికి వచ్చి గంగా యమునా ప్రాంతంలో స్థిరపడిన మీదట నాగులు మధ్య ప్రాంతం వదిలి అస్సాం రాష్ట్రంలోను, పెషావరువద్ద తక్షశిల ప్రాంతంలోను, దక్షిణాన కృష్ణా-గోదావరి ప్రాంతంలోను స్థిరపడ్డారు. ఆర్య-నాగజాతి కలహాలు చరిత్ర పసిద్దము. మహాభారతంలోని పరీక్షిత్తు కథ, జనమేజయుని సర్పయాగం-ఇందుకు నిదర్శనాలు. ఆర్యుల వర్ణ విభేదాలు వీరిలో ప్రవేశించలేదు. వీరు ప్రప్రథమంలోనే సమానత్వాన్ని బోథించిన బౌద్ద మతాన్ని స్వీకరించారు.

యక్షులు:
నాగులతోపాటే యక్షులను మరొక తెగ కూడా ఈ ప్రాంతంలో నివసించేవారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు శాసనాన్ననుసరించి క్రీ.పూ. 400 ప్రాంతంలో కుబ్బీరకుడను రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలుస్తున్నది. కుబ్బీరక నామం నుండే కుబేర పదం ఏర్పడ్డది. కుబేరుడు యక్ష గణం అధిపతి. యక్షులు అనార్య జాతులలో ఒకరు. కుబ్బీరకుడు సింహం గోష్టికి అధిపతి. నాగులకు పాము ఇలవేల్పు. యక్షులకు సింహం ఇలవేల్పు. నాగుల వలెనే యక్షులు కూడా ప్రథమంలోనే బౌద్ద మతం స్వీకరించారు. ఆధిపత్యకులాలు ప్రవేశపెట్టిన కర్మకాండను అంగీకరించని వారిలో యక్షులు కూడా వున్నారు. కొన్ని పురాణ కథలు రాక్షసులను యక్షులను ఒకే కోవలో చేర్చాయి. 1. తొడల నుంచి వైశ్యులను పాదాలనుంచి శూద్రులను పుట్టించిన ఆ ప్రభువే అటుపై యక్షులను రాక్షసులను కూడా పుట్టించాడని వరాహ పురాణం (9-17) చెబుతోంది. 2. యక్ష రాక్షసుల గురించి రామాయణం ఉత్తర కాండలో ఒక కథనం వినిపిస్తుంది..

అసురులు:
అసుర జాతి ఋగ్వేద కాలానికి ప్రచురంగా ఉంది. భరతవర్షానికి సంబంధించిన ప్రాచీన జాతి ఇది. వీరిని తొలివేల్పులు గానూ పూర్వ దేవతలు గానూ వ్యవహరించటం ఇందువల్లనే. తర్వాతి వారు ఈ అసుర శబ్దాన్ని సురశబ్దానికి వ్యతిరేక పదంగా పొరబడటం వల్ల వాలా అపార్థాలు కలిగాయి. అసురులు ఒక ప్రాచీన జాతి అని కాకుండా దేవతల విరోధులుగా పొరబడటం జరిగింది. రాక్షస, అసుర శబ్దాలను సమానార్థకాలుగా పురాణ కవులు వాడుతూ వచ్చారు. దేవగణాల విరోధుల పేరుకు అసుర అనేది చేర్చి ప్రచారం చేశారు. (రావణాసుర, నరకాసుర, తారకాసుర మొ.). ఋగ్వేదంలోని తర్వాతి భాగాలలోనూ అధర్వణవేదంలోనూ అసుర శబ్దం అర్థం మారి రాక్షసుడు అనీ మాయాశక్తిగలవాడనీ ప్రచారం అయింది. వాస్తవానికి రాక్షసులు అంటే 'రక్షించేవారు ' , రక్షించుకునేవారు ' అని కొందరు భాషాపండితులు చెబుతారు.

ఈ విధంగా నాగులు/రాక్షసులు/అసురులు/యక్షులుగా వ్యవహరించబడిన వారు తెలుగు వారని పరిశోధకుల అభిప్రాయం. వీరంతా ద్రావిడ భాషా మూలం గలవారు. క్రీ.పూ. 500-400 ప్రాంతాలలో ఇప్పటి సర్కారు కోస్తా జిల్లాలను తిలింగ, తెలింగ అనేవారు. తెలుగువారికి రామాయణ కథలోని అసురుల వారసత్వం ఉన్నది. ఆంధ్ర దేశాన్ని (తెలుగుదేశాన్ని-కాలక్రమంలో ఆంధ్ర , తెలుగు అనే పదాలను అనంతర కాలంలో పర్యాయ పదాలుగా వాడుతూ వచ్చారు) ఇక్ష్వాకులు పాలించారనీ కొన్ని జనపదాలు నిర్మించారనీ చరిత్ర చెబుతున్నది. రాముడు ఇక్ష్వాకు వంశీయుడే.


[ఇంకా వుంది...]

Comments

8 comments to "రామాయణానికి బాక్ డ్రాప్ లో అసలేం జరిగింది - 2"

Anonymous said...
February 16, 2008 at 1:00 AM

చివరకు తెలుగువారిని అసురులను చేశారే?

ఇంకా రామాయణంలో ఏమి చేస్తారో?

Solarflare said...
February 16, 2008 at 5:58 AM

Fantastic!!

Anonymous said...
February 16, 2008 at 6:35 AM

చాల ఆసక్తికరంగా ఉన్నది.

Anonymous said...
February 16, 2008 at 11:41 AM

as far as i am concerned, there is no aryan invasion. it was only a tool to create differences between north indians and south indians.
I would like to give here another example. If really some aryans came to india and tried to impose their culture and language on us, it can't happen, because muslims had tried to do the same for 1300 years and they had ruled india for 1000 years. still they were unable to eliminate our culture and language. Moreover, lets suppose that if the aryans were able to impose their religion on indians, then why did indians exhibit such a great strength repulsing islam? As far as aryan theory is concerned, aryans are successful in imposing their culture, but archaelogical reports say otherwise.There was never a war ever reported and according to aryan theory, ramayana and mahabharatha are just myths and not true. How unfortunate is the situation today india is, it is following some crappy theory produced by a bunch of knaves as its history.

Reddy said...
February 16, 2008 at 6:35 PM

Good Attempt

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...
February 16, 2008 at 6:49 PM

1. ఆర్యులు అనేది కేవలం సంస్కృత భాషాపదం. ఇంగ్లీషు భాష దీన్ని ఇంగ్లీషు పరిపాలకులకు అనుకూలమైన అర్థంలో borrow చేసింది. ఈ మాటకు సంస్కృతంలో జాతిపరమైన అర్థం లేదు. ఏ మానవ సమూహాన్నీ మన పూర్వీకులు "ఆర్యులు" అనే పేరుతో పిలిచి ఉండలేదు. ఆర్యశబ్దానికి ఈ విధమైన జాతిపరమైన అర్థ వినియోగం (దుర్వినియోగం) ఇంగ్లీషువాళ్ళ కల్పన. ఆ శబ్దం ఎల్లప్పుడూ "మాన్యులు, పూజ్యులు" అనే అర్థంలో మాత్రమే సాందర్భికంగా ప్రస్తావితులైన వ్యక్తుల పరంగా సంస్కృత సాహిత్యంలో వాడబడింది. అలాగే ఈ విశేషణం ఏ ఇతర జాతికీ వ్యతిరేకార్థకం (antonym) కాదు. ఫలానా జాతివాచకాలకు ఇది antonym అని సంస్కృత వ్యాకరణం చెప్పడంలేదు. కాబట్టి ఆర్యులనే జాతి ఏదీ లేదు.

కాని సంస్కృతభాష జీవించి ఉన్నకాలంలో దాన్ని మాతృభాషగా కలిగి ఉన్న జనసమూహాన్ని మన సౌకర్యార్థం ఆర్యులని వ్యవహరించడంలో తప్పులేదు. అంతకంటే సంస్కృతీయులనే పేరు నాకు ఎక్కువ సమ్మతం.

ఇందులో ఇంకా రెండు విషయాలు. ఆర్యులకూ ద్రావిడులకూ ఘర్షణలు జరిగాయని బ్రిటిషువాళ్ళ ప్రోద్బలంతో చరిత్రపుస్తకాల నిండా రాసిన ఖరాబు రాతలకు ఒక్క లిఖిత ఆధారం కూడా లేదు. చిత్రమేమిటంటే ప్రతిదానికీ ఆధారాలు కావాలని గోలపెట్టే ఆధునికులు, లిఖిత ఆధారాలు ఉన్న విషయాలక్కూడా నమ్మకాలని పేరుపెట్టి అవహేళన చేసే ఆధునికులు- ఏ ఆధారమూ లేని ఈ ఆర్యద్రావిడ యుద్ధాల కాకమ్మ కథకి విస్తృతంగా ప్రచారం కల్పించి భుజానికెత్తుకోవడం.

ఒకప్పుడు ఇక్కడ రెండు జాతులున్నమాట వాస్తవం. అందుకు భాషాభేదం సాక్ష్యమిస్తోంది. కాని వాటిల్లో ఒకటి బయటినుంచి వచ్చిందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. ఇప్పటి ఉత్తరభారతీయులంతా సంస్కృతీయులు కారు. అలాగే ఇప్పటి దక్షిణ భారతీయులంతా ద్రావిడులూ కారు. ఈ మధ్యలో భారీయెత్తున రక్తమిశ్రణం జరిగింది, జరుగుతోంది.

ఆర్యద్రావిడ పుక్కిటి పురాణాల కల్పనలో భాగంగా కల్పించిన ఉపకథలు-ద్రావిడులు నల్లగా ఉండేవారనీ ఆర్యులు తెల్లగా ఉండేవారనీ వగైరా-ఇదంతా ఈ సిద్ధాంతకర్తలైన తెల్లవాళ్ళ వ్యక్తిత్వాన్ని బయటపెడుతోంది. మనకు తెలిసినంతవరకు ఇండియాలో నలుపు పట్ల విచక్షణ లేదు. ఒకే కుటుంబంలో నలుపూ తెలుపూ ఉంటాయి.

వైదిక సాహిత్యంలో దర్శనమిచ్చే జాతుల్ని ఇప్పుడు మనకు కనిపించే జాతులతో identify చెయ్యడం దుస్సాహసం. ఆ పేర్లని కొన్ని జాతులు వర్తమానంలో వాడుకుంటున్నప్పటికీ. ఉదాహరణకు-మన పుస్తకాల్లో కనిపించే నాగులూ, ఇప్పటి నాగాలాండ్ ప్రజలూ ఒకటి కారు. అలాగే రామాయణంలో చెప్పిన లంకా, ఇప్పటి శ్రీలంకా ఒకటి కావు. అదేవిధంగా వైదిక గ్రంథాల్లో కనిపించే ఆంధ్రులూ ఇప్పటి ఆంధ్రులూ ఒకటి కారు.

యక్షులూ మొదలైనవారు ఒక రకం దేవతలని హిందూ సాహిత్యం చెబుతోంది. వారిని గిరిజనులుగా ఆటవికులుగా అర్థం చేసుకోబూనుకుంటే చివరికి ఏమీ అర్థం కాదు. యక్షాదుల గుఱించి అమరకోశంలో ఇలా చెప్పబడింది.

శ్లో. విద్యాధరోzప్సరో యక్ష రక్షో గంధర్వ కిన్నరా: l
పిశాచో గుహ్యకస్ సిద్ధో భూతోzమీ దేవయోనయ: ll

, said...
February 17, 2008 at 5:37 PM

ఇంత శ్రమకోర్చి వ్యాఖ్యలు రాస్తున్నందుకు కృతజ్ఙతలు.
ఇక ఆర్యుల చారిత్రక ప్రామాణికత గురించి ఒకమాట. నా ముందు టపా మొదలుపెట్టేముందే ఒక విషయం స్పష్టం చేశాను. 'ఆర్యులు భారతదేశం బయటనుంచి వచ్చారు' అనే సిద్దాంతం బూటకమూ/కల్పితమూ కావచ్చు అని. ఎందుకంటే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దాని గురించి కూడా మొదలు పెట్టిన చర్చ కాదిది (అసలు 'ఆర్యులెవరు ' అనే అంశం తీసుకుందామనుకుని వాయిదా వేశాను. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు 'సంస్కృతభాష జీవించి ఉన్నకాలంలో దాన్ని మాతృభాషగా కలిగి ఉన్న జనసమూహాన్ని మన సౌకర్యార్థం ఆర్యులని వ్యవహరించడంలో తప్పులేదు.ఒకప్పుడు ఇక్కడ రెండు జాతులున్నమాట వాస్తవం’ అనే మాటలనే తీసుకుందాం. అప్పటికీ మనం చెప్పుకున్న సామాజిక సంబంధాలు, పరిస్థితులులలో మార్పేమీ కబపడదు. ఆర్యులెవరు అనే మాట ప్రస్తుతానికి వొదిలేద్దాం. వాళ్లు బయటివాళ్లయినా మనవాళ్లయినా మనం చర్చించే ఆనాటి సామాజిక పరిస్థితుల వాటిల్లో యేమీ మార్పులు చేయనఖ్కరలేదు. క్రతువిధానాలు (హింసతోడి యజ్ఙయాగాలూ, మంత్రాలూ), వర్ణాశ్రమ ధర్మాలూ, కర్మకాండ, మున్నగు సామాజిక/వైదికాచారాలూ అన్నీ జగత్ప్రసిద్దం. ఆర్య ధర్మాలని చెప్పినా, ఆర్య సంస్కృతి అని చెప్పినా అవన్నీ పురోహిత వర్గాలు ఆచరించి చూపించే వైదిక సంస్కృతిగా అర్థం చేసుకోవాలి. ఆర్య/వైదిక సంప్రదాయాలంటే దైనందిన జీవితంలో ఆచరించే కర్మకాండ. ఈ కర్మకాండ పురోహిత వ్యవస్థను పోషిస్తుంది. వర్ణధర్మాలను స్థిరపరుస్తుంది. ఎక్కువ తక్కువ కులాల ఏర్పాటుకు దారితీస్తుంది. అందుకే క్రతు విధానాలను కొందరు వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన వారిని పురాణాలు అసురులుగా, రాక్షసులుగా పేర్కొన్నాయి. అసురులు, రాక్షసులు, దానవులు, యక్షులు ('యక్షులూ మొదలైనవారు ఒక రకం దేవతలని హిందూ సాహిత్యం చెబుతోంది.' అని తాడేపల్లి గారన్నారు. ఒకసారి ఇది మళ్లీ చదవండి ‘కొన్ని పురాణ కథలు రాక్షసులను యక్షులను ఒకే కోవలో చేర్చాయి. 1. తొడల నుంచి వైశ్యులను పాదాలనుంచి శూద్రులను పుట్టించిన ఆ ప్రభువే అటుపై యక్షులను రాక్షసులను కూడా పుట్టించాడని వరాహ పురాణం (9-17) చెబుతోంది. 2. యక్ష రాక్షసుల గురించి రామాయణం ఉత్తర కాండలో ఒక కథనం వినిపిస్తుంది') , నాగులు అనబడే వారంతా ఒకే జాతిలోని భిన్న సముదాయాలుగా కనిపిస్తారు. క్రతు విధానాలు ఆచరించేవారు మునులు, ద్విజ వర్గాలు, దేవగణాలు. వీరు సురులు, సురాపానం చేస్తారు.క్రతు విధానాలు ఆచరించని వారూ, సురాపానం చేయని వారూ అసురులు, అనార్యులు. ఇది ఒకప్పటి సమాజ స్వరూపం. సురాసుర యుద్దాలు చరిత్రలో చాలా జరిగినట్టు పురాణాలు చెబుతాయి. మానవ నాగరికతా పరిణామ క్రమంలో ఈ విధానాల వల్ల వర్గ తారతమ్యాలూ, ఆధిపత్యకూలాలు, సేవా (ధర్మ) కులాలూ ఏర్పడ్డాయి. వర్ణ వ్యవస్థ బలపడుతూ వచ్చింది. ఆ వ్యవస్థ మీద తిరుగుబాట్లూ వచ్చాయి. వాటిని అణచివేసే క్రమంలో ఆధిపత్య కులాలకు మద్దతుగా బోలెడంత వాఙ్మయం వెలిసింది. అలాంటి వాఙ్మయంలో కౌసల్యకుమారుడైన శ్రీరాముని చరిత్ర 'రామాయణం’ గా బాగా ప్రచారం పొందింది. నా ప్రస్తుత ప్రయత్నం 'రామాయణ’ కథలోని వాస్తవాంశాలు చెప్పటంతోబాటు అందులొ ప్రతిపాదించిన ధర్మం ఎలాంటిది?అది ఏయే వర్గాలకు మేలు చేసింది? ఏ ప్రయోజనాన్ని ఆపేక్షించి కథాసంఘటనలు కూర్చారు? అసలు రాముడు దండకకెందుకు వెళ్లాడు? లాంటి వాటితోటే ముగుస్తుంది ప్రస్తుతానికి.

lalithag said...
February 18, 2008 at 7:39 AM

రాక్షసులూ తెలుగు వారే, శ్రీ రాముడూ తెలుగు వాడే. ఆర్యులు తెలుగు వారు కాదు.
సరిగానే అర్థం చేసుకున్నానా?

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com