Wednesday, February 13, 2008

రామాయణానికి బాక్ డ్రాప్ లో అసలేం జరిగింది?! - 1

3 comments

ప్రాచీన భారతదేశంలో మానవజీవితంలోని ప్రధాన అంశాలైన వేషభాషలు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆశయాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక , మతపరమైన అంశాల గురించి క్లుప్తంగా ఒకసారి అవలోకిస్తే రామాయణాది కావ్యాలని అర్థం చేసుకోవటం సులువవుతుంది. అందుకనే ముందుగా ఈ వ్యాసం. దీన్లో చర్చించబోయే అంశాలిప్పటికే చెప్పాను కాబట్టి, వీటిగురించి అవగాహన వున్నవారు నా తరువాతి వ్యాసాల్ని చదవమని మనవి.

 

మొహెంజదారో-హరప్పా శిధిలాలు బయల్పడేవరకు, ఆర్యుల రాకతోటే భారతదేశ చరిత్ర ప్రారంభమైదనే అభిప్రాయం ఒకటుండేది. వైదిక యుగం కన్నా (ఆర్యుల నాగరికత) సింధు నాగరికత (సింధు/సరస్వతి) చాలా ప్రాచీనమైనదని తెలియవచ్చింది. ఆర్యులు భారదేశం బయటనుండి వచ్చారు ( అసలు ఆర్యులనేవాళ్లు బయటనుండి వచ్చారనేది బూటకపు సిద్దాంతమని , వైదిక యుగం కూడా సింధు నాగరికతలో భాగమని వొక కొత్త బలమైన వాదం ఈ మధ్యనే బయలుదేరింది. దీన్లో అసంబద్దమైనవేవో, మరుగునపడిన విషయాలేవో తర్వాత చూద్దాం) . బహుశా ఈశాన్య ఇరాన్ ప్రాంతం నుంచి, కాస్పియన్ సముద్రానికి చుట్టూ వున్న ప్రాంతాలనుంచి ( ప్రస్తుతం సోవియట్ రష్యాలోని ఆసియా రిపబ్లిక్కులు ) వచ్చి వుంటారు. ఆర్యులు భారదేశానికి, పశ్చిమాసియాలో పలు ప్రాంతాలకు , ఐరోపాకు వలస వెళ్లారు. భారతదేశానికి వలస వచ్చిన ఆర్యుల్ని భారతీయ ఆర్యులని అంటున్నాం.ఆర్యులు మొట్టమొదట పంజాబులో స్థిరపడ్డారు. తరువాత క్రమేణా ఈశాన్య దిక్కుగా కదిలి డిల్లీకి ఉత్తరంగా వున్న ప్రాంతానికి సాగిపోయారు. ఆనాడు సరస్వతి అనే నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదికి యిరువైపులా ఆర్యులు అల్లుకుపోయి చాలా యేళ్లు నివాసం చేశారు.

 

ఆ కాలంలోనే ఋగ్వేద రచన సాగింది. అదే ప్రాంతంలో కురుక్షేత్ర మైదానం కూడా వుంది. ( ఇక్కడ క్లుప్తంగా వైదిక సాహిత్యం గురించి చెప్పుకుందాం )

ఋగ్వేదం: విజయం సాధించిన ఆర్యుల (ద్రావిడుల/దస్యుల పైన ) ఆనంద పారవశ్యం, ప్రకృతి ఆరాధన, అచ్చట ముచ్చట , తాత్విక చింతన ఇందులో కనబడతాయి.

సామవేదం: ఋగ్వేదంలోని ఋక్కులను ఏ విధంగా గానం చేయాలి అన్న విషయం తప్ప ఇందులో అదనంగా చెప్పుకోటానికేమీ లేదు. అలా గానం చేస్తేనే యజ్ఞం ఫలప్రదమౌతుందన్న నమ్మకం ఏర్పడ్డది. అర్థం తెలియకుండా వేదాలను గానం చేసే పురోహిత వర్గాలుకూడా ఏర్పడ్డాయి.

యజుర్వేదం: యజ్ఞవేదిక ఎత్తూ, ఒడుగూ, దానిపైన వుంచవలసిన ధాన్యాలూ, ఏ పురోహితుడు ఏ మూల కూర్చొని యజ్ఞం చేయించాలి మొదలైన కర్మకాండను వివరించేది యజుర్వేదం.

అధర్వణవేదం: ఇందులో పై విషయాలతో బాటు ఆటవిక తెగలలో వ్యాపించివున్న మూడనమ్మకాలు, దయ్యాలు, ప్రయోగాలూ, వాటికి ప్రతిక్రియలు, మంత్రాతంత్రాలూ, మొదలైనవి వున్నాయి.

పై నాలుగు వేదాలకు బ్రాహ్మణాలు ఏర్పడ్డాయి. ఇవి కర్మకాండలో అనుసరించవలసిన పద్దతులను వివరిస్తూ వ్రాయబడిన వచన వ్యాఖ్యాన గ్రంథాలు. బ్రాహ్మణాలతో కర్మకాండ సంపూర్ణ పరాకాష్టనందుకున్నది. యీ పతనావస్థపై తిరుగుబాటుగా మతొక ధోరణి తలయెత్తింది. కర్మకాండ ప్రధానమైనది కాదనీ, ప్రపంచ రహస్యాన్నీ, సృష్టికి మూలకారణాన్ని కనుక్కోవాలంటే కర్మకాండతో నిండివున్న సమాజాన్ని వదిలి, దూరంగా ఆడవుల్లో దీర్ఘాలోచన, అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావించి కొందరు వాదించారు. యూ ధోరణికి చిహ్నంగా అరణ్యకాలు (అరణ్యాలలో మాత్రమే అభ్యసించవలసిన గ్రంథకాలు) తలెత్తాయి. నాలుగు వేదాలకూ అనుబంధాలుగా అరణ్యకాలు వ్రాయబడ్డవి. యీ గ్రంథంలో సగం కర్మకాడ, సగం తత్త్వ విచారం వుంది. యీ పరిణామ పూర్తి చెంది, తత్త్వవిచారణ ప్రధానంగా పెట్టుకున్న ఉపనిషత్తులు వచ్చాయి. ఉపనిషత్కర్తలు కర్మకాండను వదిలివేశారు. రాజసభా భవనాలు తత్త్వశాస్త్ర చర్చలతో ప్రతిధ్వనించేవి. ఋగ్వేదానికి ఉపనిషత్తులకు మధ్య దాదాపు వేయి సం. గడిచాయి. నాలుగు వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వీటిని 'వేదసాహిత్యం' అంటారు.) .

కొద్దికాలం తర్వాత ఆర్యులు ఇంకా తూర్పుగా కదిలి గంగా తీర మైదానాలకు పాకారు. ఆనాడే వాళ్లు ఇనుప గొడ్డళ్లను కొత్తగా కనిపెట్టారు. కొత్తగా కనిపెట్టిన ఆ యినుప గొడ్డళ్లతో ఆడ్డం వచ్చిన దట్టమైన ఆడవుల్ని ఛేదించి వేశారు(దండక దురాక్రమణలు?!) . ఇనుముతో రకరకాల సాధనాలు ఆయుధాలు తయారు చేసుకున్న కాలం అది. ఆర్యులు పశువుల్ని మేపుకొనేందుకు పచ్చికబయళ్లు వెతుక్కోంటో వలస వచ్చారు. వాళ్లు దేశ దిమ్మరులు. క్రమంగా సంచార జీవితాన్ని వదిలేసి ఆర్యులు జనపదాలు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వ్యవసాయాన్ని చేపట్టారు. ఆర్యులు నగర నిర్మాణం పూనుకొనేటప్పటికి కొన్ని శతాబ్దాల కాలం గడిచిపోయింది.


ఆర్యుల సామాజిక జీవన విధానం. ఆర్యులు అనేక గణాలుగా చీలిపోయి వుండేవాళ్లు. యీ గణాలే (కుదురులు) పరస్పరం సంఘర్షించుకునేవి (గణ యుద్దాలు) .ప్రతీ గణానికి ఒక నాయకుడుండేవాడు. ఆ నాయకుణ్ణి 'రాజన్' అనేవాళ్లు. ఆ తర్వాత గణ నాయకత్వం పారంపర్య రాచరికం అయింది. రాజు కొడుకు రాజు పోయాక రాజయ్యాడు. రాచరిక వంశ పారంపర్యం అయింది. చిన్న చిన్న విభాలుగా విడిపో యాయి. ఆర్యగణం నివసించే జనపదాలే గ్రామాలు. ఆర్య కుటుంబం పితృస్వామ్య వ్యవస్థ మీద ఆధారపడి ఏర్పడింది. గృహ యజమానురాలుగా స్త్రీకి మర్యాద, మన్నన వుండేది. ఆర్యులు జజపదాలలో స్థిరపడ్డ తరువాత వారి జీవితంలోకి పొలాలు సాగు చేసేవాళ్లే కాకుండా చేతి వృత్తులు చేసేవాళ్లు కూడా కొత్తగా వచ్చి చేరిపోయారు. కొన్నికొన్ని గ్రామాలు కొన్ని కొన్ని నిర్థిష్ట వృత్తుల్లో ప్రత్యేకత సంతరించుకోడం ప్రారంభమైంది.

వేట ఆర్యులకి ప్రాణం. ఎద్దుల్ని వ్యవసాయానికి ఉపయోగించుకునేవారు. జంతువుల్లో గోవుది అగ్రస్థానం. వాళ్లకి పాలు, మాంసం ప్రసాదించేది ఆవు కాబట్టి దానికి పెద్ద పీట వేశారు. ప్రత్యేకమైన అతిథులు వచ్చిన సంధర్భాల్లో ఆవు మాంసం వడ్డించడం గొప్ప సత్కారంగా భావించేవాళ్లు. అపుడు మనిషి జీవితం విలువ వంద ఆవులకి సమానం. ఒక మనిషి వేరొక మనిషిని చంపినట్లయితే చనిపోయిన మనిషి కుటుంబానికి నూరు ఆవులు పరిహారంగా ఇచ్చుకోవాలి.

ఆర్యులకు గుర్రాలంటే ఎనలేని తీపి. ఇరాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినప్పుడు గుర్రాలతోనే యిక్కడ దిగారు. రథాల్ని లాగటానికి గుర్రాల్ని ఉపయోగించే వాళ్లు. వేదమంత్రాలతో రథవర్ణన విశేషంగా కనిపిస్తుంది. పందానికి రథమొక అందం. సమరాంగణంలో సర్థవంతమైన శకటం. మతం: ఆర్యులు ఆటవికులను లొంగదీసుకునే మేరకు హింసను ప్రయోగించి ఆ తరువాత వాళ్లను తమ సమాజంలో ఆర్థికంగా సాంస్కృతికంగా కలుపున్నారు. బలప్రయోగానికి బదులు మతాన్ని ఉపయోగించారు. ఓడిపోయిన ఆటవికులలో కొందరిని గణం పెద్దలను, పురోహితులను-క్షత్రియ, బ్రాహ్మణ (వాల్మీకి లాంటివారిననుకోవాలి) కులాలలోనికి స్వీకరించి తక్కిన వారినందరిని శూద్ర పంచమ కులాలుగా మార్చారు.

ఆర్యులు అనేక దేవతల్ని ఆరాధించారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నేల , నింగి, గాలి, పర్వతాలు, తరువులు, ప్రకృతి శక్తులన్నీ ఆర్యుల ఆరాధ్యదేవతలు. వీటిల్లో ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడూ, యముడూ ప్రధాన దైవాల్లో కొందరు. యీ దేవతా మూర్తులను ప్రసన్నం చేసుకోడానికి యజ్ఞం అనే బలి సమర్పణతో దేవతల్ని సంతృప్తి పరిచేవాళ్లు. ( ఏ ఒక్క దేవుడినీ అతని అవతారాలనూ కుటుంబాన్నీ చూసినా ఈ విషయం అర్థం అవుతుంది.

 

శివుడి నెత్తి మీది గంగ నీటిదేవత ( యీ నీటి కోసమే (నదీ పరీవాహక ప్రాంతాలకోసం) యెన్నో యుద్దాలు జరిగేవి) ఆమె ఇప్పటికీ శివుడితో ప్రమేయం లేకుండా గంగమ్మగా స్వతంత్రంగా పూజలందుకుంటుంది. శివుడి మెడలోని పాము మన పురాణాలలో 'నాగజాతి ' గా పిలవబడ్డ ఆటవికుల కుదురు చిహ్నం. శివుడిభార్య పార్వతి ప్రతి రూపాలయిన దుర్గ, కాళిక, ‘అమ్మ దేవతల’ పరిణత రూపాలు. ఒక కొడుకు కుమారస్వామి వాహమం నెమలి (కుదురు చిహ్నం) మరొక కొడుకుది ఏనుగు తల, ఎలుక వాహనం (కుదురు చిహ్నాలు) శివుడి వాహనమైన నంది చాలా ప్రాచీన కాలం నుండి ఆటవికులకు ఆరాధ్యం. విష్ణువు భార్య లక్ష్మి సముద్ర మధనంలో పుట్టింది (ఈమే నీటి దేవతే). విష్ణువు అవతారాలు కూర్మ, మత్స్యం, వరాహం, కుదురు చిహ్నాలు. ఇవి మూడూ ఇప్పటికీ వేటాడబడే ప్రాణులే . కృష్ణుడు పశుపోషకుల దేవుడు. అతని సోదరుడు బలరాముడు ఆదిశేషుడి అంశ అయిన కర్షకుల ప్రతునిధి (అతని ఆయుధం నాగలి) . చివరికి బుద్దుడిని గూడ విష్ణువు అవతారంగా ప్రకటించి బౌద్దులనూ ఇదే విధంగా కలుపుకు రావాలని చూశారుగాని వాళ్లు మత్స్య, కూర్మ, వరాహ కుదురు చిహ్నాలు గల గణ జీవులలాగ ఆటవికులు కాక నాగరికులు కావడంతో లొంగిరాలేదు. అందుకనే బుద్దుడి అవతారం అసంపూర్ణంగా వుండిపోయి, బౌద్దం స్వతంత్ర్య మతంగా నిలిచిపోయింది. )

 

ఆర్యుల వస్త్రధారణ విషయంలో పైన ఉత్తరీయం కప్పుకునేవాళ్లు. క్రింద ధోవతి (అంతరీయం) ధరించేవాళ్లు. చీలమండలదాకా జీరాడే పంచె. తలకి పాగా ధరించడం కూడా వాడుకలో వుండేది. ఆర్యులకు ఆభరణాలంటే ప్రీతి. బంగారంతోగాని తదితర లోహాలతోగాని తయారైన ఆభరణాలు అలంకరించుకునేవాళ్లు. స్త్రీలు రకరకాల పూసలదండలు ధరించడానికే ఆసక్తి చూపేవారు. ఆర్యుల అభిమాన క్రీడ వినోదం. నృత్య సంగీతాలతో వినోదించేవాళ్లు . వేణువు, వీణ, మద్దెల వారి ముఖ్య వాద్యాలు. జూదం ఆర్యుల అభిమాన వినోద కాలక్షేపంగా దాఖలాలు కనిపిస్తాయి. ఆర్యుల ఆహారంలో పాలు, వెన్న, నెయ్యి ముఖ్యమైనవి. పళ్లు, కూరగాయలు, పప్పులు, మాంసం సుష్టుగా భుజించేవాళ్లు. మధువు తాగేవాళ్లు. యజ్ఞాలు వగైరాలు నిర్వహించిన సంధర్భాల్లో స్త్రీ పురుష విచక్షణ లేకుండా అందరూ సోమ పానం (భంగు) చేసేవాళ్లు.

 

సుష్టుగా తిని మస్తుగా తాగి శ్రమించి సుఖించిన ప్రజలు ఆర్య ప్రజలు.

 

 

[To be Contd...]

Comments

3 comments to "రామాయణానికి బాక్ డ్రాప్ లో అసలేం జరిగింది?! - 1"

swappu said...
February 13, 2008 at 5:14 PM

Inka ramayanam gurinchi raledu.... deeniki ramayanam ki enti sambandam? ramudu ee kaalam tarwata ane kada ramayanam cheptundi?

, said...
February 13, 2008 at 7:06 PM

swappuగారు!
1)...Inka ramayanam gurinchi raledu.... deeniki ramayanam ki enti sambandam?
ఈ టపా మరియు రాబోయే తర్వాతి టపాలను జాగ్రత్తగా చదవండి. కొన్ని విషయాల్లో కాదు, చాలా చాలా విషయాల్లో రామాయణంలో చెప్పినవాటికి ఆర్యుల కాలంలోని వాటికి నమ్మలేనన్ని సారూప్యాలు కనబడతాయి.
2)...ramudu ee kaalam tarwata ane kada ramayanam cheptundi?
దీనికి సమాధానం యీ టపా యొక్క Title

Suresh Jinna said...
August 12, 2010 at 12:27 PM

ok

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com