నేతాజీ జర్మనీ చేరేసరికి అక్కడి పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. జర్మనీ అప్పటికే రెండవ ప్రపంచ యుద్దంలో తలమునకలై ఉంది. అంతలో ఇటలీదేశం హిట్లర్ తో చేతులు కలుపుతున్నట్లు ప్రకటన చేసింది.దీనితో జర్మనీ బాధ్యత ఇంకా పెరిగింది. తన దళాలలో ముఖ్య మయిన వాటిని ఉత్తర ఆఫ్రికాకు,బాల్కన్ దేశాలకు పంపంవలసిన అగత్యం ఏర్పడింది. ఈ తరుణంలో అర్లండో మెజోట్టా పేరుతో జర్మనీ ఫారిన్ ఆఫీసులో నేతాజీ ప్రత్యక్షమయ్యాడు. జర్మనీ విదేశాంగ శాఖ అధికారులకు నేతాజీ ఎవరో బాగా తెలుసు. భారతదేశంలో అత్యంత ప్రియతమ నాయకుడైన నేతాజీ తమముందు నిలచాడన్న సంగతి వారు గుర్తెరిగినవారే . అయితే నేతాజీని తమ మధ్యకు ఏ విధంగా ఆహ్వాహించాలో, యెలాంటి మర్యాదలు పాటించాలో తేల్చుకోలేని పరిస్థిలో పడ్డారు. నియతృత్వ విధానంలో సాగుతున్న హిట్లర్ పరిపాలన్లో ఆయనకి తెలియకుండా ముఖ్య నిర్ణయాలు ఏవీ తీసుకునే వీలుపడదు. నేతాజీ జర్మనీ వెళ్ళడం కొత్తేమీ కాదు. 1935 లో జర్మనీ సందర్శించాడు. అప్పుడు ప్రభుత్వ అతిథిగా కాక కేవలం ఒక విదేశీ పర్యాటకుడుగా మాత్రమే ఆ దేశాన్ని సందర్శించాడు.
హిట్లర్ కు ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది. ఒక పక్క భారత దేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం సాగుతూ ఉండగా సైనికులు యుద్దం చేస్తూ ఉండడం సామాన్య సైనికుడుగా ఉన్న హిట్లర్ ని మొదటి ప్రపంచ యుద్దం కాలంలో ప్రత్యక్షంగా చూశాడు. రెండవ ప్రపంచ యుద్దంలో కూడా భారత సైనికులు బ్రిటిష్ వారి తరపున ఇతియోపియా, ఈజిఫ్టులలో యుద్దం చేయడం గమనించాడు. ఈ భూమికను ఆధారంగా చేసుకొని నేతాజీకి ఎలాంటి గౌరవం ఇవ్వాలనేది తేల్చుకోవడం హిట్లర్ కు కూడా కష్టతరంగానే తోచింది. సుదూర ప్రాంతాలైన నార్వే, లిబియా మొదలైన చోట్ల హిట్లర్ సైన్యాలు యుద్దంలో నిమగ్నమై ఉన్నాయి. ఆ సంవత్సరంలోనే జూన్ 22న రష్యాపైకి కూడా సైన్యాలు పంపించాడు. ఈ స్థితిలో నేతాజీ రూపంలో మరో భారాన్ని వహించడానికి జర్మనీ వెనుకా ముందు ఆలోచించాల్సి వచ్చింది. అంతేకాక, నేతాజీ వద్ద అధికారికంగా వచ్చిన దాఖలాలు ఏమీ లేవు. భారత జాతీయ కాంగ్రెస్ కానీ, మరో సంస్థ కాని అతనికి ఎలాంటి అధికారాలు దత్తం చేసి పంపలేదు. కాబట్టి నేతాజీకి రాజకీయ ఆశ్రయం కల్గించడం కంటే మరో సహాయం అందించగల్గిన పరిస్థితి కాదు అది. జర్మన్ అధికారులకు సంబంధించినంత వరకు బోస్ సమస్య అంత అర్జెంటుగా పరిష్కరించవలసినదిగా మాత్రం కనిపించలేదు.
కాని నేతాజీ విషయం వేరు. అంతదూరం నుంచి జర్మనీకి వచ్చి చేరింది గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడానికి కాదు. పోగొట్టుకొంటున్న ప్రతి గంటా అతి విలువైనది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిస్తున్న స్వాతంత్ర్య పోరాటంలో ప్రతి గంటా విలువైనదే. జర్మనీ లో రోజులు గడుస్తున్న కోద్దీ బోస్ కు యుగాలు గడుస్తున్నట్లు అనిపించింది.
జర్మనీ వారు విజయ పరంపర సాధిస్తున్న రోజులవి. ఆ సమయంలోనే కనుక హిట్లర్ ను ఒప్పించగలిగితే భారత దేశానికి చాలా మేలు కలుగుతుందనీ, తన కోర్కెలలో చాలా భాగం నెరవేరుతాయనీ బోస్ భావించాడు.
సుభాష్ పట్ల హిట్లర్ వైఖరి
అంతరాంతరాలలో బ్రిటిష్ వారి పట్ల హిట్లర్ కు ఉన్న అభిమానం కూడా భారతదేశం పట్ల త్వరలో సరియైన అవగాహనకు రాలేక పోవడానికి కారణమయింది. నిజంగా ఇంగ్లీషు వారిని మట్టు పెట్టి ఇంగ్లాండును స్వాధీనం చేసుకోవాలనే కోర్కె గనుక హిట్లర్ కు ఉంటే, ఆ పని ముందుగానే నెరవేరి ఉండేది. డన్ కర్క్ సంఘటన ఇందుకు నిదర్శనం.29 మే, జూన్ 14 మధ్య కాలంలో మూడు లక్షల మంది బ్రిటిష్ సైనికులను సురక్షితంగా డన్ కర్క్ నుంచి ఇంగ్లాండు పోవడానికి అనుమతిచ్చాడు హిట్లర్. ఆ సమయంలో జర్మనీ కి బలమైన విమానదళం ఉంది. జలాంతర్గాముల దళం ఉంది. భీతి చెందిన బ్రిటిష్ సైనికులను జర్మన్లు వెంటాడుతున్న పరిస్థితి అది.హిట్లరే తలచుకుంటే బ్రిటిష్ దళాల్లో ఒక్క సైనికుడు కూడా ఇంగ్లాండు చేరేవాడు కాదు. కాని హిట్లర్ అలా చేయలేదు. అయితే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ బ్రిటిష్ యుద్ద యంత్రాంగానికి తూట్లు వేసే చర్యలో ఏ దేశం పాల్గొనడానికి సిద్దపడినా దాన్ని ఆహ్వానించేందుకు జర్మన్లు సిద్దమే.
బ్రిటిష్ వారికి మనుష్యులూ,వనరులూ అందజేయడంలో భారత దేశం అగ్రస్థానంలోఉంది.భారత ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న విషయం ఇది. కాబట్టి బోస్ ను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని జర్మనీ గుర్తించింది. హిట్లర్ కు కుడి భుజంగా వున్న రెబ్బెన్ త్రాప్ బోస్ ను సమర్థించాడు.
స్వేచ్చాభారత కేంద్రం.
ఈ లోగా బోస్ కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. భవిష్యత్ కు సంబంధించిన ప్రణాళికను తయారు చేసుకోవడంలో మనస్సును లగ్నం చేశాడు. స్వేచ్చా భారత కేంద్రం [Free India Center] సంస్థను స్థాపించాడు. రేడియో ప్రచారం, సైనిక దళం స్థాపించడం, అలాగే ఆర్థిక సామాజిక సమస్యలు ఆకళింపు చేసుకునేందుకు ఒక ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పుకోవడం ఆ సంస్థ లక్ష్యాలు. అయితే. మూడవ లక్ష్యం అంతగా ముందుకు సాగలేదు. అనుకొన్నట్లుగానే బోస్ జర్మనీ అధికారులతో మంతనాలు సాగించాడు. ఆ అధికారులు సుభాష్ మేధస్సుకు ఆశ్చర్యపోయారు. స్వేచ్చా కేంద్రానికి అప్పుగా ప్రతి నెలా కొంత సొమ్ము మంజూరు చేయడానికి ఓ ఒప్పందం కుదిరింది. నేతాజీ కి వ్యక్తిగతంగా నెలకు 800 పౌన్లు కేటాయించారు. స్వేచ్చా భారత కేంద్రానికి కేటాయింపు 1941 లో 1200 పౌన్లతో ప్రారంభించి 1944 లో 3200 పౌన్లకు పెంచారు. ఈ అప్పు తీర్చే బాధ్యత వ్యక్తిగతంగా బోస్ దే.
అసలు హిట్లర్ సాయమే తీసుకోవాలనే పట్టుదలేమీ బోస్ కి లేదు. కలకత్తా నుంచి బ్రిటన్ గూడచారుల, పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నపుడు బోస్ మొదట సోవియట్ సహాయం తీసుకోవాలనే ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యపడలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ లో ప్రవేశించాలని బోస్ చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాతే ఆయన జర్మనీ వైపు దృష్టి సారించాడు.
(ఆ సమయానికి స్టాలిన్ కి ఇంగ్లాండ్ తో రహస్యమైన అవగాహన ఉన్నదని, ఆ కారణం వల్లనే స్తాలిన్, బోసు కి ఆశ్రయం ఇచ్చేందుకు, బ్రిటన్ కు వ్యతిరేకంగా బోస్ సాగించదలచిన సాయుధ సమరానికి మద్దతు ఇచ్చేందుకు సమ్మతించలేకపోయాడనే కథనం సైతం ఉంది). రెండవ ప్రపంచ యుద్దంలో తొలిదశలో యుద్ద స్వభావానికి, ఆ తర్వాత మారిన యుద్దస్వభావానికి చాలా తేడా వుంది. బోస్ జర్మనీకి వెళ్లే సమయానికి హిట్లర్, సోవియట్ కి శత్రువు కాదు. పైగా హిట్లర్, స్టాలిన్ అప్పటికి 'నిర్యుద్ద సంధి ' కుదుర్చుకున్నారు కూడా. ఏ క్షణాన హిట్లర్ సోవియట్ పైకి తన సైన్యాన్ని నడిపించాడో...ఆ క్షణం యుద్ద స్వభావమే మారిపోయింది. బోస్ ఈ విషయం గమనించాడు కాబట్టే జర్మనీ సోవియట్ మీద యుద్దం ప్రకటించిన మరుక్షణం భారత ప్రజల సానుభూతి యావత్తు సోవియట్ కే ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు.
అసలు బోస్ జర్మనీ వెళ్లి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించే స్వాతంత్ర్య పోరాటంలో నాజీల మద్దతు పొందుదామని ప్రయత్నించిన మాట నిజమే. కానీ, ఇది ఇక్కడి వరకే. బోస్ ఏనాడూ నాజీల మద్దతు దారు కాలేదు. వారి అడుగులకి మడుగులొత్తే వ్యక్తిగా, వారి దుష్ట పన్నాగాలకి తోడ్పడే వ్యక్తిగా లేనేలేడు. పైగా, సింహం గుహలో చొరబడి, దాని జూలు ఒడిసి పట్టినట్టు ఆయన స్వయంగా హిట్లర్ వంటి వ్యక్తులతోనే నిర్భయంగా, కరాఖండిగా వ్యవహరిచాడు. జర్మనీ తన ఉద్యమానికి ఎటువంటి సహకారం ఇవ్వాలన్న విషయంలో నేతాజీకి స్పష్టమైన అవగాహన వుంది.
1.భారత స్వాతంత్ర్యానికీ, సార్వభౌమత్వానికీ గల హక్కును జర్మనీ గుర్తించాలి
2.ఆజాద్ హింద్ ఉద్యమాన్ని నాజీలు ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల విప్లవోద్యమంగా గౌరవించాలి
3. ఆజాద్ హింద్ ప్రసారాల పట్ల, ప్రచురణల పట్ల ఎటువంటి నిర్బంధాలు, నిషేధాలు, అదుపు ఉండరాదు
4. ఆజాద్ హింద్ ఫౌజ్ లో సైనికులను చేర్చుకునే అధికారం, నిర్వహణ సుభాష్ దే, ఆజాద్ హింద్ దళాల విధేయత తమ మాతృదేశానికే ఉంటుంది కానీ మరెవరికీ కాదు 5.ఆజాద్ హింద్ దళాలు బ్రిటన్ పైనే కానీ జర్మనీకి శతృవులైన మరే ఇతర దేశం పైనా తమ తుపాకీని ఎక్కుపెట్టవు -
క్లుప్తంగా చెప్పాలంటే బోస్ షరతుల సారాంశం ఇదే.
ఒంటరిగా తమ దేశానికి కార్యార్థియై వచ్చిన నేతాజీ,
తమకి విధించిన షరతుల్ని చూసి నాజీలు నిర్ఘాంత పోయారు.
Comments
2 comments to "Netaji in Berlyn"
December 19, 2008 at 6:03 AM
thanx for an informative article
August 14, 2009 at 12:37 PM
thank you veri much,netaji is my lord
Post a Comment