కాబూల్ నుంచి సోవియట్ తో సంబంధాలు పెట్టుకోవడానికి సుభాష్, భగత్ చేసిన ప్రయత్నాలు సత్వరమే ఫలితమివ్వలేదు. పోలీసుల తాకిడి తట్టుకోవడానికి, ఉత్తర్ చంద్ మల్ హోత్రా అనే మితృడి ఇంటికి మకాం మార్చారు. సుభాష్ యూరప్ వెళ్లాలంటే, ఆ ప్రయాణం రష్యా మీదుగానే జరగాలి, తన ప్రయత్నాల్లో పురోగతి కనిపించకపోయేసరికి, సుభాష్ బోసుకి విసుగు పుట్టింది. సాహసించి, ఏ అనుమతులు లేకుండానే, తాను సోవియట్ భూభాగం లోకి చొరబడాలని తలపోసిన సందర్భం ఉంది. అది ప్రాణాంతకమైన సాహసం. కొన్ని వారాల తరవాత ఇటలీ మంత్రి అల్బరోటా క్వరోనిని కలవగలిగాడు సుభాష్. తన లక్ష్యాలను ఆయనకి విపులంగా వివరించాడు. కొంత కదలిక వచ్చింది. బోసు విషయం గురించి, జర్మనీ, ఇటలీ, సోవియట్ ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుకున్నాయి. ఫలితంగా సుభాష్ ప్రయాణానికి సంబంధించిన పథకం ఖరారు అయ్యింది. ఇటలీ దౌత్యవేత్త ఒర్లండొ మజొట్టా పేరు మీద బోసుకి పాస్ పోర్టు సిద్దమైంది. ఆ పాస్ పోర్టుతో బోసు సోవియట్ కి చేరుకుని మాక్సోమీదుగా విమానంలో 1941 ఏప్రిల్ 3న బెర్లిన్ చేరాడు.
బ్రిటిష్ పోలీసుల నిర్బంధాన్ని నిఘాని విజయవంతంగా తప్పించుకుని భారత దేశపు వీరపుత్రుడు సుభాష్ జర్మనీ చేరాడన్న వార్త తెలియగానే యావద్భారతం నిర్ఘాంతపోయింది. సుభాష్ బోసు సాహసానికి జాతి యావత్తూ పులకించి పోయింది. అలనాడు ఔరంగజేబు చెరలోంచి వీరశివాజీ తప్పించుకున్న సాహస ఘట్టంతో ఏమాత్రం తీసిపోలేదని అనేకులు పోల్చారు. ఆసేతు హిమాచలం బోసు అభిమానులు ఇది అంతం కాదని ఆరంభమని, స్వాతంత్ర్య సమరాన్ని మలుపు తిప్పగల మరొక మహద్ఘట్టానికి నాందీ ప్రస్తావన మాత్రమేనని, రానున్న రోజుల్లో సుభాష్ బోసు మరిన్ని విస్ఫోటాలను సంధించి ఉంచారని అర్థం చేసుకున్నారు. బోసు వార్తల కోసం యావద్భారతం లోని యువజనం ఒళ్లంతా చెవులు చేసుకుని ఎదురు చూసింది.
వారి నిరీక్షణ విఫలం కాలేదు.
విదేశీ గడ్డమీద భారత విప్లవోద్యమపు పురోగమనానికి సంబంధించిన వార్తలు కెరటాలు కెరటాలుగా భారత దేశాన్ని తాకడం ప్రారంభించాయి.
యీ సాహసయాత్రలో సుభాష్ బాగా అలసిపోయాడు. కానీ అసలు కథ ఇప్పుడు బెర్లిన్ లో మొదలయ్యింది.
లిబియాలో జరిగిందీ సంఘటన.
రెండవ ప్రపంచ యుద్దంలో బ్రిటిష్ ఇండియాకి చెందిన, 20వ బ్రిగేడ్, 10వ సైనిక దళం యుద్దరంగంలో జర్మన్లను ఎదిరించి పోరాడుతోంది. భారత జాతి అభీష్టానికి విరుద్దంగా బ్రిటిష్ వారు భారత సైన్యాన్ని యుద్దరంగంలో దింపారు. పొట్టకూటికోసం సైన్యంలో చేరిన భారతీయులు తమకి సంబంధలేని దేశంలో తమకి తెలియని శత్రువుతో తమ వలస ప్రభువులైన బ్రిటిష్ వారి ప్రయోజనాల్ని పరిరక్షించే నిమిత్తం వీరోచితంగా పోరాడుతున్నారు.
యుద్దరంగంలో శత్రు విమానాల రొద వినిపించగానే సైరన్ మోగింది. పోరాడుతున్న సైనికుల్లో అధికభాగం పరుగు పరుగున బంకర్లలో, ట్రెంచిల్లో దాగారు. మిగిలిన వారు ఎక్కడి వారక్కడే నేల మీద పడుకున్నారు. అప్పుడు ఆవిష్కృతమైంది ఆకాశవీధిలో ఆశ్చర్యకరమైన ఆ దృశ్యం. ఉత్కంటతో ఉక్కిరిబిక్కిరైన సైనికులు వినువీధిలోని విచిత్రానికి విస్తుపోయారు. అందరూ స్థావరాల నుంచి బయటికి వచ్చి వీక్షించారు.
అగ్ని వర్షం కురిపిస్తాయనుకున్న జర్మనీ విమానాల నుంచి జాలువారుతున్నాయి క... ర... ప...త్రా...లు....... ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో కరపత్రాలు... రంగు.. రం....గు....ల రంగు రం...గు...ల కరపత్రాలు. ఇంగ్లీషులో, హిందీలో, ఉర్దూలో, ఇంకా మరికొన్ని ఇతర భారతీయ భాషల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రెపరెపలాడుతున్నాయి. లోహ విహంగాలు వినువీధిన విరజిమ్మిన కరపత్రాలు. సైనికులు సంభ్రమంగా కింద పడిన కరపత్రాలను ఏరుకున్నారు. వాటి అడుగున విస్ఫులింగాల్ని చిమ్ముతున్నట్లున్న ఎఱ్ఱని అక్షరాల్లో సుభాష్ చంద్ర బోస్ అనే పేరు వుంది.
'నేను జర్మనీ వచ్చాను.
ఇది జర్మనీకి, బ్రిటన్ కీ జరిగే యుద్దమే కానీ, మన యుద్దం కాదు.
ఈ యుద్దంతో మనకేమీ సంబంధం లేదు. కనుక దయ ఉంచి మీరు
పోరాటాన్ని కొనసాగించ వద్దు. -సుభాష్ చంద్ర బోస్ '
అత్యంత శక్తివంతమైన మదుగుండు దట్టించిన బాంబుల కంటే, భారతీయ సైనికుల మనసుల్లో ఈ అక్షరాలు ఇంకా పెద్ద విస్ఫోటాన్ని సృష్టించాయి. ఇటువంటి సంఘటనలు విదేశాల్లో భారతీయ దళాలు పోరాడుతున్న అనేక ప్రాంతాల్లో సంభవించాయి. ఈ సందేశాన్ని చదివిన భారతీయ సైనికుల మనసుల్లొ కల్లోలం ప్రారంభమైంది. వలస యజమానుల ఆదేశాలను పాటించాలా? మాతృభూమి బానిసత్వాన్ని వదిలించేందుకు కంకణం కట్టుకున్న ఒక వీరపుత్రుడు సుభాష్ బోస్ పిలుపుకు స్పందించాలా?
నిద్రాణమై ఉన్న స్వేచ్చా కాం క్ష మేల్కొంది. చివరికి కిరాయి కర్తవ్యం కంటే, మాతృదేశ విమోచనా దీక్షే సైనికుల మనసుల్ని జయించింది. సుభాష్ బోస్ పిలుపుని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. వేలాది బలగం ఉన్న భారతీయ సైనిక బెటాలియన్లు బ్రిటన్ పక్షాన్ని విడిచి, జర్మన్లకు స్వాధీనమయ్యారు. అటువంటి సైనికులతోను, ఇంకా యుద్దంలో చిక్కిన యుద్దఖైదీలతోనూ జర్మనీలో ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణం ప్రారంభమయ్యింది.
'....ఈ రోజు మనమంతా మన జాతీయ పతాకం సాక్షిగా స్వాతంత్ర్య పోరాటపు ప్రతిజ్ఙని స్వీకరిస్తున్నాం. ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఈ పతాకాన్ని మనం ఎర్రకోటలోనే ఎగరేసి వందనం చేస్తాం. కానీ జ్ఙాపకం ఉంచుకోండి మనం ఈ స్వాతంత్ర్యాన్ని మూల్యం చెల్లించి సాధించుకోవాల్సి ఉంది. స్వాతంత్ర్యం ఏనాడూ యాచన వలన సిద్దించదు. దాన్ని బలప్రయోగం ద్వారా సాధించుకోవాలి. దాని మూల్యం రక్తం. నాకు రక్తాన్ని యివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను .మనం మన స్వాతంత్ర్యం కోసం, ఏ విదేశీశక్తి ముందూ యాచన చేయబోవడం లేదు. మనం స్వాతంత్ర్యానికి అవసరమైన మూల్యాన్ని చెల్లించి మరీ సాధిస్తాం. అది ఎంత్మ మూల్యమైనా సరే. భారతదేశనికి మనమంతా కలిసి కదం తొక్కుతూ కదలి వెళ్లే సమయంలో, నేను ఖచ్చితంగా మన సేనని ముందుండి నడిపిస్తానని హామీ ఇస్తున్నాను.'
*
[ఇంకా చాలా వుంది...]
Comments
6 comments to "ఆకాశం నుంచి అగ్ని అక్షరాలు"
December 3, 2008 at 12:07 PM
Migilina vaatikosam nirikshistu ...
December 3, 2008 at 12:57 PM
mahaaveeruni saahasaaniki paaddbhivamdanam
December 3, 2008 at 1:51 PM
ప్రభుత్వాలు మర్చిపోయిన భరతమాత ముద్దుబిడ్డ , వీరాది వీరుడు అయిన నేతాజీ గూర్చి తెలియ జేస్తున్నందుకు మీకు అభినందనలు
December 4, 2008 at 10:46 AM
తర్వాతి భాగం కోసం నిరీక్షిస్తూ...
December 4, 2008 at 10:46 AM
waiting for next part
July 27, 2016 at 6:42 PM
కాశం నుంచి అగ్ని అక్షరాలు
Post a Comment