దశరథుడికి రాముడిని యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేయాలనుకోవడం (భరత శత్రుఘ్నులు తమ మేనమామల దగ్గిర వున్నపుడు), దానికి కావాల్సిన ఏర్పాట్లు జరగడం, రాముడిని పిలిచి తన ఆలోచన చెప్పడం , కైకేయికి రాముడి పట్టాభిషేక వార్త మంధర ద్వారా తెలిసి కినుక వహించడం, ఇవన్నీ మనందరికీ తెలిసినవే. సుదీర్ఘమైన సంభాషణ తర్వాత కైక కోరికలు ( భరతునికి పట్టాభిషేకం, రాముడు దండ కారణ్యంలో 14 సం. గడపటం ) కోరికలు తీరుస్తానని దశరథుడు రాముని మీద ప్రమాణం చేసి చెబుతాడు. విషయం తెలిసి దశరథకైకలను రాముడు కలుస్తాడు.
'నీ తండ్రిని సత్య సంధుడిగా చేయాలంటే నీవు నా మాట ప్రకారం చెయ్యు ' [అయో. 18-34] అని కైక రాముడితో చెబుతుంది. రాజాజ్ఙ పాటించకుండా వుంటానా అన్నాడు రాముడు. 'తండ్రి ఆజ్ఞాపిస్తే సీతనూ రాజ్యాన్నీ ప్రాణాన్నీ ధనాన్నీ కూడ తమ్ముడైన భరతునికి ఇచ్చి ఉండే వాడిని. తండ్రి సంతోషమే నా సంతోషం ' [అయో.19-7].
దశరథుడు కౌసల్యను తలుచుకుని దుఃఖిస్తూ కులపత్నికి వుండాల్సిన గుణాలని విశదీకరిస్తాడు.
' కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా
శయనేషు రంభ రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రి
షట్కర్మ యుక్తా కులధర్మపత్ని ' [అయో. 12-68,69].
అప్పటి సమాజం మాతృస్వామ్యంలోంచి పితృస్వామ్యంలో మార్పు చెందిందని రాముడి మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది.
'పురుషార్థాలలో మొదటిదైన ధర్మం యొక్క ఫలం పొందాలనుకునేవాడు తండ్రి, తల్లి, బ్రాహ్మణుడు, చెప్పిన ప్రకారం చెయ్యాలి. ప్రతిజ్ఙ చేసి తప్పకూడదు. సత్య వాక్య పాలన చెయ్యాలి. మాతృ వాక్య పాలన కంటే శ్రేష్ఠమైనది పితృ వాక్య పాలన ' అని రాముడు చెబుతాడు. తానూ అడవులకు వస్తానంది కౌసల్య. రాముడు వారించాడు. 'భర్తను వదిలిపెడితే భార్యకు పాపం కలుగుతుంది. మనసులోనైనా భర్తను నిందించకూడదు. భర్త జీవించి ఉన్నంత వరకు అతనిని సేవించటం సనాతన ధర్మం. నీవూ నేనూ ఇద్దరమూ తండ్రి మాట వినాలి. నియమంగా వ్రతాలు, ఉపవాసాలు, దేవతాపూజలు చేయటం, భర్తకు ఇష్టమైన పనులు చేయటం, ఉపచారాలు చేయటం, నియతాహారం భార్యకర్తవ్యం. అలా చేయకపోతే నరకానికి పోతారు. శాంతి పౌష్టిక హోమాలతో చందన తాంబూలాలతో దేవతలనూ బ్రాహ్మణులనూ ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి. జీవించి ఉన్న స్త్రీకి భర్తే దైవం, ప్రభువు...ఇవ్వాళ నీకూ నాకూ రాజే (దశరథుడే) ప్రభువు ' ఇంకా చాలా చాలా చెప్పాడు సతీధర్మాలు.
సీతను చూడగానే రాముడు దుఃఖం అణచుకోలేకపోయాడట.'సీతా! ధర్మ స్వరూపం తెలిసినదానా ! గొప్పకులంలో పుట్టినదానా (సీత జనకుడి పెంపుడు కూతురు. అసలు కులం తెలియక పోయినా పెంచిన తండ్రి కులమూ అత్తవారి కులమూ ఆమెకు గౌరవాన్ని ఆపాదించాయి. గొప్పకులంలో పుట్టినదానా' అని ఆమెను సంబోధించారు. ఆర్యధర్మాలను పాటించటం వల్లనే ఆమెకు సమాజం (మునులు/బ్రాహ్మణులు) గౌరవం ఇచ్చి ఆదర్శ స్త్రీగా మన్నించింది. ఇదే దృష్టితో తాటక గురించి ఆలోచిస్తే - తాటక బ్రహ్మ వర ప్రభావం వల్ల యక్ష దంపతులకు జన్మించినా యక్షుని పెళ్ళి చేసుకున్నా యక్ష స్త్రీగా మన్నన పొందలేదు. ఆర్య ధర్మ నిరసన వల్ల శాపగ్రస్తురాలై రాక్షసిగా దుర్మార్గురాలిగా ప్రచారమైంది. వర్గ వర్ణ వైషమ్యాల ప్రతిఫలనం ఈ పాత్రలలో స్పష్టమవుతున్నది. ) సంభోదిస్తూ రాముడు సీతకు విషయం వివరించాడు.
'సీతే తత్ర భవాం స్తాతః ప్రవ్రా జయతి మాం వనం, కులే మహతి... [అయో 26-19,20]
తాను లేనపుడు ఎలా నడుచుకోవాలో సీతకు చెప్పాడు రాముడు. 'నేను అడవులకు ప్రయాణమై పోతూ నిన్ను చూసి పోదామని వచ్చాను. ఇక భరతుడు రాజు అవుతాడు.అతనికి అనుకూలంగా ప్రవర్తించు. మరీ విశేషంగా అతని సం రక్షణలో ఉండవద్దు. నా పట్ల స్థిరమైన అనురాగంతో ఉండాలి (ఇవన్నీస్త్రీస్వేచ్చకి కట్టడి ధర్మాలా?). నేను అడవిలో ఉన్నప్పుడు నీవు ఇక్కడ వ్రతాలూ ఉపవాసాలూ చేస్తుండాలి. నా తల్లులని సేవించాలి...' [అయో. 26-38] సీతకు కోపం వస్తుంది [అయో. 27] '...భార్య ఒక్కతే భర్త చేసే పుణ్య పాప కర్మల ఫలాన్ని, భర్త భాగ్యాన్ని అనుభవిస్తుంది. నేను కూడా వనవాసానికి ఆజ్ఙాపింపబడినట్టే' అంటో స్త్రీ ధర్మాల్ని సీతతో చాలానే చెప్పించారు[23 శ్లోకాలు]. అలానే రాముడు కూడా అడవిలో తనతో పాటూ వుంటే పాటించవలసిన నియమాలూ, ధర్మాలూ కూడా చాలానే చెప్పాడు[26 శ్లోకాలు]. సీత ఎంత చెప్పినా రాముడు తనతో తీసుకెళ్ళటానికి ఒప్పుకోడు. సీత పరుషంగా , కోపంగా , దుఃఖంగా ఇంకో 22 శ్లోకాల్లో రాముడ్ని నిందిస్తో లేక బతిమాలుతో, బెదిరిస్తో వేడుకుంటుంది('నీవు నన్ను తీసుకు వెళ్ళకపోతే నీవు చూస్తుండగానే విషం తాగుతాను - శత్రువులకు వశపడనుకాక వశపడను (యెవరిక్కడ శత్రువులు?) ). అంతకు రాముడు సమ్మతించి '...నిన్ను రక్షించలేక కాదు. చక్కని శరీర సౌష్ఠవం గల నిన్ను నాతో వనవాసానికే సృష్టించాడు. నీ కులానికీ నా కులానికీ (స్వస్య కులస్యచ) తగినట్టు ఆలోచించావు '.
ఇలా ఓ వంద శ్లోకాల్లో పతిపత్నీ ధర్మాలు, పతివ్రతా ధర్మాలూ చెప్పించారు. ఈ సంభాషణ అంతా విన్న లక్ష్మణుడు తాను కూడా వనవాసానికి వస్తానని రాముణ్ణి ప్రార్థించాడు. 'నీ భార్య సంగతి ఏమిటి?' అని రాముడు లక్ష్మణుడిని అడగలేదు. 'నీ తల్లి అనుజ్ఙ తీసుకుని రా' అనైనా అనలేదు. 'సరే, నీ స్నేహితులతో చెప్పేసి రా' అన్నాడు. ఇక్కడ పతిపత్నీ ధర్మాలు అవసరం రాలేదు (లక్ష్మణుడి భార్య తానూ వస్తానని అనలేదా?!). రాముడితో సీత అడవికి వెళ్ళాలి కాబట్టి, సంధర్భోచితం కూడా కాబట్టి భార్యభర్తలు ఒకరిపరంగా ఒకరు పాటించవలసిన ధర్మాల్ని ప్రవేశపెట్టారు.ఇవి సరిపోక కౌసల్య నోట కూడా పతివ్రతా ధర్మాలు చెప్పించారు. 'కులోచితమైన సచ్చరిత్రగల స్త్రీలకు భర్తయే సర్వోత్కృష్టుడు. కులటలైన స్త్రీలు కపట స్వభావం కలవారుగా ఉంటారు. అంతకుముందు ఎన్ని కోరికలు తీర్చినా డబ్బులేక పోయే సరికి భార్యలు భర్తను నిరాదరిస్తారట. రోగం కలిగినా చూడరు. అది స్త్రీల సహజ గుణమట. స్త్రీలు ఎప్పుడూ అబద్దాలు చెప్తారు. వికారంగా ప్రవర్తిస్తారు. మనసులో మాట చెప్పరు. స్త్రీ మనస్సు చంచలం (సీత కూడా స్త్రీయే కదా). అగ్ని సాక్షిగా జరిగిన వివాహాన్ని కూడా వారు లెక్క చెయ్యరు. వారికి కులాభిమానం లేదు. బ్రహ్మజ్ఙానం లేదూ.ఇలా స్త్రీలను కించపరచటానికి ఎన్నో చెప్పారు. మానవ స్వభావ దుర్లక్షణాలను స్త్రీలకు ఆపాదించారు [అయో.39]
Comments
3 comments to "సతీధర్మాలు"
April 1, 2008 at 7:07 PM
అబ్బా ! ఇన్ని ధర్మాలున్నాయా , మా ఆవిడకి కూడా ఎవరయినా చెప్తే బావున్ను
April 1, 2008 at 8:04 PM
క్రిదటి టపాకి శివ గారు మొదట చేసిన వ్యాఖ్య చూసి నా భావానికి సరైన వ్యక్తీకరణ దొరికింది కదా అని మీ సమాధానం కోసం ఎదురు చూసాను. మీ సమాధానం తృప్తికరంగా అనిపించలేదు.
మీరు మొదలు పెట్టిన చర్చలో ఒక assumption ఉంది. రామాయణం ఫలానా ఉద్దేశంతో రాయబడింది అని. మీ వాదనలు ఆ assumption ను బలపరిచే అంశాలను ఎన్నుకుని ముందుకి నడుస్తున్నాయి.
చదివే వారికి అసంబద్ధత కనిపించి ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పట్లేదు.
మాతృస్వామ్యం ఉంది అన్నది మీ assumption అని నాకనిపిస్తుంది. దానికి తల్లి పేరును పరిచయంలో చెప్పుకోవడం కి మించి నాకు మీ వ్యాసాలలో ఇంకే మాటలూ అందుకు కారణంగా చూపించినట్లు కనిపించ లేదు.
ఇక తండ్రి మాట నిలబెట్టడం , భర్త మాటను శిరసావహించడం, ఇవన్నీ కలిపి చూడాలి అనిపిస్తుంది. కాలక్రమేణా స్త్రీ పరమైన నిబంధనలే ఎక్కువ నిలిచి రాజ్యం చేస్తున్నాయన్నది నిజం. కానీ మీ ఈ టపా చదువుతుంటేనే నాకనిపించిన ఒక ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను. ఆ కాలంలో ఉన్న న్యాయం heirarchy ని గౌరవించడం. కుటుంబానికి తండ్రి పెద్ద. తమ్ములకి అన్న తండ్రి వంటి వాడు. భార్యకి భర్త అలానే. authority ని ప్రశ్నించకుండా గౌరవించడం అనే దాన్నే రాముడు పాలించినట్టనిపిస్తుంది నాకు. చివరికి రాజు "ప్రజల" మాటకు తల ఒగ్గాలి అని కూడా చూపించాడు.
ఇక స్త్రీ తన మానానికి తనే బాధ్యురాలు అన్న దృష్టి కొన్ని సంస్కృతులలో "సహజంగా" ఉన్న నమ్మకం. అది రామాయణం ఏర్పరిచిన నమ్మకం కాదు. ఆ నాటి సామాజిక పరిస్థితులలో రాసిన కావ్యం కనుక అప్పటి నియమాలనే చూపిస్తుంది. అలాగే మరి శ్రీరాముడు ఏక పత్నీ వ్రతం చేపట్టి చివరి వరకూ ఆ మాటను నిలుపుకున్నాడు. వేదిక ధర్మాల కోసం మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు. ఆయన చేసుకోలేదు.
భరతుడి ద్వారా established norms ని ప్రశ్నింప చేశాడు కదా రచయిత మరి?
ఇప్పటికీ సమాజ సంస్కరణ కోసం వచ్చే, వచ్చిన రచనలను చూసుకుంటే రచన మొత్తం ideal పరిస్థితులను చిత్రీకరించదు. ఉన్న పరిస్థితులను చూపుతూ అందులో "సంస్కరణాంశాన్ని" ప్రవేశ పెడుతుంది.
మరి గురజాడ వారి కన్యాశుల్కం తీసుకుందాం. ఆయన అప్పటి పరిస్థితులని చిత్రీకరిస్తూ అందులో సమస్యను నాటకీయంగా పరిష్కరించారు. కొన్ని సంభాషణలనో, గిరీశం పాత్రనో తీసుకుని ఇంకో అభిప్రాయం ఏర్పరుచుకోవడం కూడా సాధ్యమే, కాదంటారా? మరి మధుర వాణికి వివాహం చేసినట్టు చూపించ లేదే? అంటే అది తప్పని ఆయన చెప్పినట్టా? ఆ నాటీ పరిస్థితులకి ఎంత మటుకూ tocuh చెయ్యాలో అంత మటుకు చేశాడనుకోవాలా?
రామాయణం లోని కొన్ని quotes ను శాసనంగా చేసి స్త్రీలను అణగ దొక్కిన వారికి ప్రతిగా మీరు ఈ వాదన చేస్తుంటే దాని ప్రయోజనం negative అనిపిస్తుంది నాకు. మీరూ దానిని ప్రామాణికంగాను, శాశనంగానూ భావిస్తున్నట్లే కదా? మీరూ కొన్ని quotation లను వాడుకుంటున్నట్లే కదా?
ఏనుగు కాళ్ళు పట్టుకుని ఒకరు ఒకటంటే దాని తొండం పట్టుకుని ఇంకొకరు ఇంకొకటన్నట్లు.
ఇది నా భిప్రాయం. ఇప్పటికైనా స్పష్టంగా వివరించ గలిగానో లేదో.
April 1, 2008 at 10:25 PM
Meeru chestunna ee charitra sodhana pusktabhaddam cheyyagalarani aasistunnanu.....
inta vyayaprayasala korchi chesina ee srama kalamlo kalisipo koodadu ....
waiting for next posts...
chandra
Post a Comment