‘సిగ్నర్ ఒర్లాండో మజొట్టా!’ జర్మనీ చేరుకున్న మొదట్లో సుభాష్ యీ పేరుతోనే చలామణి అయ్యాడు.1945 ఆగస్టు లో బోస్ ఒక విమాన దుర్ఘటన లో మృతి(?) చెందిన రెండేళ్లకు ముందు కూడా ఒకసారి విమాన దుర్ఘటనలో మృతి చెందాడు. కాదు. బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసింది. బోస్ తప్పించుకున్నాడన్న నిజాన్ని బ్రిటిష్ ప్రభుత్వం యింకో రకంగా వాడుకోజూసింది. 1942 మార్చి లో BBC, బోస్ విమాన ప్రమాదంలో మృతి చెందాడని విష ప్రచారం మొదలుపెట్టింది. అప్పుడింక బోస్ ఒర్లాండో మజొట్టా ముసుగులోంచి బయటికొచ్చాడు.
బోస్ గళం భూన భోంతరాల్ని చీల్చుకుంటో భారత దేశ ప్రజల గుండెల్ని తాకింది.
'నేను సుభాష్ చంద్ర బోస్ ని మాట్లాడ్తున్నాను. నేను బ్రతికే వున్నాను '
యీ వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. భారతీయుల గుండెలు గర్వంతో ఉప్పొంగిపోయాయి.తమ ప్రియతమ నాయకుడు జీవించే వున్నాడన్న వార్త భారతీయుల స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రజ్వలింపచేసింది .(సరిగ్గా యీ రేడియో సందేశంలోనే గాంధిజీని 'జాతిపిత ' గా అభివర్ణించాడు. )
యింకా 'అక్షరాజ్యాల మద్దతు నేను కోరుతున్నా ఆ కూటమి చేస్తున్న యుద్దాలకి భవిష్యత్తులో చేసే యుద్దాలకి గాను నేనెప్పుడూ జవాబుదారీ కాను.ఎందుకంటే నా అంతిమ లక్ష్యం భారత్ సర్వస్వతంత్రమవ్వటం.నా దేశాన్ని దాస్య శృంఖాలల్నించి విముక్తం చేయటానికి అలుపెరుగని నా జీవితాన్నంతా ధారపోస్తాను.యీ భూగోళంలో ఎప్పుడెక్కడున్నా యెప్పుడూ మీ సుభాష్ చంద్రబోస్ మారడు. నా తుది శ్వాస వరకు నేను నా దేశానికి ఒక సైనికుడిగానే పనిచేస్తాను.' అంటూ తన అస్థిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.
సరిగ్గా ఇదే సమయంలో జపాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.'భారదేశం భారతీయులది. తమ స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి ఇది సువర్ణావకాశమ’ని. జపాన్ ప్రకటనతో ఉత్తేజితుడైన బోస్ రోం లో ముస్సోలినీ ని కలిశాడు. ముస్సోలినీ దగ్గిరనుంచి అనుకూలమైన మద్దతు కోసం ప్రతిపాదన చేశాడు. జర్మన్ ప్రభుత్వానికి బోస్ సమర్పించిన మొదటి మెమొరాండంలో అక్షరాజ్యాలు మద్దతునిచ్చేవిధంగా ఒక ప్రకటన యివ్వాలని యెంతో పట్టుబట్టినా ఆ కూటమి అందుకు సుముఖంగా కనిపించలేదు. బోస్ కు మద్దతుగా ముస్సోలినీ, జర్మనీకి ఒక ప్రతిపాదన కూడా పంపాడు. ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బోస్ కు చెప్పినట్టు తన ప్రతిపాదనలో వివరించాడు. దీనికి ప్రతిస్పందనగా 1942 మే 11 న Dr. Goebbels తన డైరీ లో యిలా రాసుకున్నాడు. 'రాజ్యాధికార బదలాయింపు జరగడానికి యిది సరైన సమయం కాదని జర్మనీ భావిస్తోంద’ని. భారత స్వాతంత్ర్యం కోసం అక్షరాజ్యాల కూటమి ఒక త్రైపార్టీ అగ్రిమెంటుకు రావాలని తద్వారా బ్రిటిష్ వారిపై యుద్దం ప్రకటించే ప్రవాస తాత్కాలిక భారత ప్రభుత్వం పై విశ్వసనీయతా, 'ఇండియన్ లీజియన్ ' కు చట్టబద్దతా వస్తుందని బోస్ భావించాడు. ఈ ఆలోచనని తూట్లు కొట్టిన హిట్లర్ ప్రపంచ పటం పై జర్మనీ ఆక్రమణలో ఉన్న రష్యన్ ప్రాంతాల సరిహద్దును,భారత్ సరిహద్దులను చూపిస్తూ తమ వల్ల ఒనగూరేదేమీ లేదని పెదవి విరిచి తూర్పు వైపునించి విజృంభిస్తున్న జపాన్ సాయం తీసుకొమ్మని సలహా యిచ్చాడు.
Comments
5 comments to "Netaji's meet with Mussolini"
December 24, 2008 at 10:21 AM
చాలా మంచి విషయాలు చెబుతున్నారు..ధన్యవాదాలు
December 24, 2008 at 1:33 PM
Hello sir,
మీ టపాలు అన్ని చాలా బాగున్నాయి. హిస్టరీ అంటే ఆసక్తి కలిగిస్తున్నాయి. అక్బర్ గురించి టపాలు అన్ని ఒకేసారి చదివేసాను. Appreciating your efforts.
December 25, 2008 at 4:12 PM
Thanks a lot Mr.Shridhar :).
January 12, 2009 at 11:32 AM
The theme looks awesome :)
April 5, 2010 at 8:52 PM
Today onwords i am the reader of this blog.
first thanks to my brother to providing this link and very very thank ful to writer of this blog......
Thanks from
www.ameerpetstudent.com Team
Post a Comment