Sunday, November 30, 2008

ది గ్రేట్ ఎస్కేప్ - I

4 comments

సుభాష్ దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు పకడ్బందీ పథకం సిద్ధమైంది. కొంత కాలం సుభాష్ ఆరోగ్యం బాగోలేనట్టుగా నటించాడు. సన్నిహితులని, సందర్శకులని కలవడం బాగా తగ్గించాడు. గడ్డం పెంచాడు. సుభాష్ ఆరోగ్యం బాగోలేదని, అతడు దైవధ్యానంలో మునిగి పోదలుచుకున్నాడని , ఐహిక జీవితంపై విరక్తి కలిగిందని, రాజకీయ జీవితాన్ని త్యజిస్తాడని, సన్యసించాలనుకున్నాడని, చండీపూజలో మునిగాడని... రకరకాల వదంతులు వ్యాపింపచేశాడు. సుభాష్ ఆధ్యాత్మిక అనురక్తి గురించి అప్పటికే ప్రపంచానికి చాలామటుకు తెలుసు కాబట్టి కథ సరిగ్గా అతికింది, జనం ఈ వదంతుల్ని తేలిగ్గానే నమ్మారు. కొన్ని రోజులు గడిచాక అసలు తన గదిలోనికి ఎవరూ రాకుండా కట్టడి చేశాడు. చివరికి భోజనం కూడా నౌకర్లు గది బయట ఉన్న బల్లమీద ఉంచాల్సి వచ్చేది. ఎవరితోనైనా ఫోన్ లోనే సంభాషించేవాడు. చివరికి సుభాష్ కు వచ్చే ఉత్తరాలు సైతం ఇదే ధోరణిలో ఉండటంతో, ఉత్తరాల్ని సెన్సార్ చేసే బ్రిటిష్ పోలీసులు సైతం ఈ వదంతుల్ని నమ్మేశారు. సుభాష్ ఏం చేయదలుచుకున్నదీ పరమ రహస్యం. ఆ ఇంట్లో నివసించే కొందరు కుటుంబ సభ్యులకి సైతం సుభాష్ తన పరారీకి పథకం రూపొందిస్తున్న సంగతి తెలియదు. కేవలం ఆ పథకంలో పాత్ర ఉన్న కొద్దిమంది సన్నిహిత మిత్రులకి మాత్రమే తెలుసు.

గోప్యంగా ఉన్న సుభాష్ రూపం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. గడ్డం బాగా పెరిగింది . నిర్దేశించిన సమయం రానే వచ్చింది. 1941 జనవరి 16 అర్థరాత్రి సుభాష్ ఇంటినుంచి ముదురు గోధుమ రంగు షెర్వానీ, పైజామా, టర్కీ టోపీ ధరించి, పొడుగాటి గడ్డంతో ఉన్న ఒక మౌల్వీ సాబ్ బయటకి రావడం బ్రిటిష్ పోలీసులు చూశారు. వారికి అనుమానం రాలేదు. ఆయన తిన్నగా వెళ్లి, బయట తనకోసం సిద్దంగా ఉన్న జర్మనీ వాండరర్ కారు ఎక్కాడు. కారు నడిపిస్తున్నది సుభాష్ మేనల్లుడు శిశిర్. ఆ విధంగా పోలీసులకి రవ్వంత అనుమానం రాకుండా సుభాష్ వారి కళ్లు కప్పి ఇంటి నుంచి దాటిపోయాడు.

ధకం ఎంత పకడ్బందీగా అమలు జరిగిందంటే, సుభాష్ తప్పించుకున్న సంగతి కనీసం పదిరోజుల వరకూ ప్రపంచానికి వెల్లడికాలేదు. కారులోనే పంజాబ్ లోని 'గోమోహ్ ' అనే చిన్న స్టేషన్ చేరుకుని రైలు ఎక్కాడు. రైల్లో ఆ రాత్రి ఎవరూ అతడితో మాట్లాడలేదు. మర్నాడు ఉదయం ఒక సిక్కు ప్రయాణికుడు వచ్చి సుభాష్ ఎదురుగా కూర్చున్నాడు. ఇద్దరికీ మాటలుకలిశాయి. తాను ఎవరో , ఎక్కడివరకూ వెళుతున్నాడో పరిచయం చేసుకోవలసి వచ్చింది సుభాష్ కి. ఆ వివరాలన్నీ ముందే సిద్దం చేసుకున్నవే. 'నా పేరు జియా ఉద్దీన్, నేను ఇన్సూరెన్స్ ఏజంటుని ' అని తనని తాను పరిచయం చేసుకున్నాడు సుభాష్. వృత్తిరీత్యా ఊర్లు తిరగాల్సి వస్తోందని అభిప్రాయం కలిగించాడు. తాను లక్నో నుంచి రావల్పిండి వరకూ వెళుతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ సమాధానాల్లో శంకించడానికేమీ లేదు. సుభాష్ పెట్టె మీద కూడా ఎం.జడ్. అనే అక్షరాలు రాసి ఉన్నాయి. దార్లో స్టేషన్ వచ్చినపుడల్లా సుభాష్ ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకుని జాగ్రత్త పడ్డాడు. ఎంతలేదన్నా సుభాష్ చంద్ర బోస్ రెండు దశాబ్దాలుగా దేశంలో ప్రఖ్యాతుడైన అగ్రశ్రేణి రాజకీయ నాయకుడు. ఎంతోమంది ప్రజలు అతడిని గుర్తు పట్టగలరు. అందుచేత జాగ్రత్తలు తప్పనిసరి. గోమోహ్ నుంచి డిల్లీ వరకూ 'కల్కా మెయిల్ ' లోనూ, అక్కణ్ణించి పెషావర్ కి 'ఫ్రాంటియర్ మెయిల్ ' లోనూ ప్రయాణం చేశాడు. పెషావర్లో సుభాష్ దిగే సరికి అతడి కోసం స్తేషన్ బయట కారు ఒకటి సిద్దంగా ఉంది. పెషావర్ లో తనకు ముందుగానే నిర్దేశించిన బసవరకూ కారులో చేరుకున్నాడు. అక్కడ రెండురోజులు ఉండవలసి వచ్చింది. పెషావర్ వరకూ సుభాష్ తో కొంత దూరం మియా అక్బర్ షా అనే మిత్రుడు రైలులో ప్రయాణించాడు.

పెషావర్ విడిదిలో కమ్యూనిస్టు భగత్ రాం తల్వార్ సుభాష్ ని కలిశాడు. అడుగడుగునా, వాసన పసిగట్టి వెంటాడే బ్రిటిష్ సి.ఐ.డి లనుంచి, పోలీసుల నుంచి, తప్పించుకుంటో సురక్షితంగా బోసు ప్రయాణం సాగిందంటే...అందుకు చాకచక్యంతో, సాహసంతో తమ పాత్ర నిర్వర్తించిన విప్లవకారుల, కమ్యూనిస్టు మిత్రుల, ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తల నిరుపమాన త్యాగమే కారణం. తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన ఈ త్యాగమూర్తులు, బ్రిటిష్ ప్రభుత్వం ప్రమాదకరమైన విప్లవకారుడిగా భావించే, అగ్రశ్రేణి భారతీయ నాయకుడు సుభాష్ ను విజయవంతంగా దేశాన్నుంచి దాటించగలిగారు. ఆ రకంగా భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మరో వీరోచితమైన విప్లవాధ్యాయానికి కారకులయ్యారు.


To be contd...

Comments

4 comments to "ది గ్రేట్ ఎస్కేప్ - I"

Unknown said...
December 1, 2008 at 2:46 AM

very intresting Narration

Dileep.M said...
December 1, 2008 at 11:36 AM

mottaniki mIru tirigi vachchaau escape kaakuMdaa.Post guriMchi chadhivi raasthaaa.

మనోహర్ చెనికల said...
December 1, 2008 at 9:48 PM

waiting for your posts so many daysss

good work

Unknown said...
December 2, 2008 at 1:16 PM

Chaala Baaga raasaru ... inta katha jarigindani .. teleedu naaku ...

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com